క‌డ‌ప‌పై బాబు వ్యూహం… వైసీపీ గిల‌గిల‌!

వైసీపీ కంచుకోట క‌డ‌ప‌. అలాంటి చోట వైసీపీని నిలువ‌రించేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు భారీ వ్యూహం ర‌చించారు. ఈ వ్యూహానికి వైసీపీ గిల‌గిల‌లాడుతోంంది. వైసీపీ సొంత ప‌త్రిక సాక్షిలో “క‌డ‌ప గ‌డ్డ‌పై సౌభాగ్య‌మ్మ” పోటీపై…

వైసీపీ కంచుకోట క‌డ‌ప‌. అలాంటి చోట వైసీపీని నిలువ‌రించేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు భారీ వ్యూహం ర‌చించారు. ఈ వ్యూహానికి వైసీపీ గిల‌గిల‌లాడుతోంంది. వైసీపీ సొంత ప‌త్రిక సాక్షిలో “క‌డ‌ప గ‌డ్డ‌పై సౌభాగ్య‌మ్మ” పోటీపై బ్యాన‌ర్‌ క‌థ‌నాన్ని చ‌దివితే… అధికార పార్టీ ఎంత‌గా భ‌య‌పెడుతున్న‌దో అర్థ‌మ‌వుతుంది.

రాజ‌కీయాలంటే వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాలే. ఇందులో పైచేయి సాధించే వారిదే విజ‌యం. కుప్పంలో చంద్ర‌బాబునాయుడిని ఓడించ‌డానికి ఏకంగా వై నాట్ కుప్పం, వై నాట్ 175 నినాదాల‌తో వైసీపీ దూసుకెళ్ల‌డాన్ని చూస్తున్నాం. కుప్పం మున్సిపాలిటీ స‌హా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ, ఆ పార్టీ మ‌ద్ద‌తుదారుల‌ను ఓడించి వైసీపీ చంద్ర‌బాబు వెన్నులో వ‌ణుకు పుట్టించింది. కుప్పంలో అసెంబ్లీ స్థానాన్ని కూడా హ‌స్త‌గ‌తం చేసుకునేందుకే వైసీపీ స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతోంది.

చంద్ర‌బాబు మాత్రం ఊరికే వుంటారా? ఆయ‌న కూడా దెబ్బ‌కు దెబ్బ తీసేందుకు త‌న‌దైన శైలిలో పావులు క‌దుపుతున్నారు. కుప్పంలో మీరు వేలు పెడితే, క‌డ‌ప‌లో తానెందుకు ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ని బాబు వ్యూహానికి ప‌దును పెట్టారు. ఆ వ్యూహం వైసీపీ దృష్టిలో కుట్ర‌, క‌ప‌టం అయ్యాయి.

దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి భార్య సౌభాగ్య‌మ్మ‌ను స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయించ‌డానికి చంద్ర‌బాబు క‌ప‌ట నాట‌కానికి తెర‌లేపారంటూ సాక్షి ప‌త్రిక క‌థ‌నం రాసింది. ఇది వైసీపీ మ‌నోగ‌తంగా చూడాల్సి వుంటుంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా సౌభాగ్య‌మ్మ‌ను బ‌రిలో నిలిపితే టీడీపీ, కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి సుల‌వ‌వుతుంద‌ని చంద్ర‌బాబు ఎత్తుగ‌డ వేశార‌ని రాసుకొచ్చారు. కాంగ్రెస్ త‌ర‌పున డాక్ట‌ర్ సునీత నిలిస్తే, బీజేపీకి కోపం వ‌స్తుంద‌ని, స‌హ‌కారం వుండ‌ద‌ని, అందుకే ఆమె వెన‌క్కి త‌గ్గార‌ని క‌థ‌నంలో పేర్కొన్నారు.

వివేకా హ‌త్య కేసులో అనుమానితులంద‌రినీ జైలుకు పంప‌డంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు స‌క్సెస్ అయ్యారు. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని మాత్రం జైలుకు పంప‌డంలో డాక్ట‌ర్ సునీత విఫ‌ల‌మ‌య్యారు. దీంతో అవినాష్‌ను ప్ర‌జాకోర్టులో ఓడించాల‌ని వివేకా కుటుంబ స‌భ్యులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇందుకు ష‌ర్మిల ఇప్పుడు తోడ‌య్యారు. వివేకా కుటుంబ స‌భ్యుల‌కు మొద‌టి నుంచి ష‌ర్మిల మ‌ద్ద‌తు లేదు.

తాజాగా త‌న రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా సునీత‌ను ష‌ర్మిల క‌లుపుకుని వెళుతున్నారు. ఇండిపెండెంట్‌గా సౌభాగ్య‌మ్మ‌ను నిల‌ప‌డం ద్వారా కుటుంబ స‌భ్యులు పోటీ చేసినా, జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా పోటీ అభ్య‌ర్థిని నిల‌బెట్టార‌నే నెగెటివిటీని రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ చేస్తార‌నే భ‌యాన్ని వైసీపీ, ఆ పార్టీ సొంత ప‌త్రిక గగ్గోలు పెట్ట‌డాన్ని చూడొచ్చు.  

జ‌గ‌న్‌ను కాద‌నుకుని చిన్నాన్న కుటుంబ స‌భ్యుల‌తో పాటు ష‌ర్మిల వేరే దారులు చూసుకున్నారు. ఇక బంధాలు, అనుబంధాలంటూ ఏడ‌పులు పెడ‌బొబ్బ‌లు పెట్ట‌డం ఏంటో అర్థం కావ‌డం లేదు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సొంత జిల్లా ప్ర‌జ‌ల‌కు బాగా చేశామ‌నే న‌మ్మ‌కం వుంటే, అటు వైపు పోటీలో ఎవ‌రుంటే ఏం అనే ధీమా ఉండాలి. ఎందుక‌నో ఆ ధీమా వైసీపీలో క‌నిపించ‌డం లేద‌ని తాజా సాక్షి క‌థ‌నం చ‌దివితే అర్థ‌మ‌వుతుంది.

ముఖ్యంగా క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని క‌ల‌వాలంటే తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల నుంచి పులివెందుల‌లో ఆయ‌న ఇంటి వ‌ద్ద కాప‌లా కాయాల్సి వుంటుంది. తెల్లారితే ఆయ‌న ఉండ‌రు. దీంతో దూర ప్రాంతాల నుంచి వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని పులివెందుల‌కు వెళితే, క‌డ‌ప ఎంపీ ద‌ర్శ‌న‌మై, ప‌నులు చేయించుకున్న వాళ్లు ఎంత మంది ఉన్నారో వారికే తెలియాలి. జ‌గన్ సీఎం కావాల‌ని చాలా మంది ఆశించారు. జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత , త‌మ‌కు ఒరిగిందేమీ లేద‌ని వాపోయే వారి సంఖ్య భారీగానే వుంది.

క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఏంటో తెలుసు కాబ‌ట్టి, వివేకా కుటుంబ స‌భ్యులు బ‌రిలో వుంటే ఏమ‌వుతుందో అనే భ‌యం ముఖ్యంగా అవినాష్‌రెడ్డిలో వుంది. వివేకాపై ప్ర‌జ‌ల్లో సానుభూతి వుంది. ప్ర‌జ‌ల‌కు చేర‌వైన నాయ‌కుడాయ‌న‌. క‌డ‌ప ఎంపీగా వివేకా, అవినాష్ మ‌ధ్య న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా. గ‌తంలో వైఎస్సార్ ముఖ్య‌మంత్రి రాష్ట్ర‌స్థాయిలో ప‌నులు చ‌క్క‌పెట్టేవారు. క‌డ‌ప జిల్లా స్థాయిలో వివేకా చూసుకునే వారు. ఇప్పుడు జ‌గ‌న్ రాష్ట్ర‌స్థాయిలో చూసుకుంటుంటే, వివేకా లోటును అవినాష్ భ‌ర్తీ చేయ‌లేక‌పోయారు.

స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నవారికి వివేకా భార్య పోటీ చేస్తార‌నే వార్త ఆనందం క‌లిగిస్తుండ‌గా, అవినాష్ అనుచ‌రుల‌కి భ‌యం పుట్టించింది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌ని రాయ‌డం ద్వారా… ఆయ‌న్ను సాక్షి ప‌త్రిక హీరో చేసింది. చివ‌రికి జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల్ని కూడా త‌న వైపు చంద్ర‌బాబు తిప్పుకున్నారంటే, ఇక ప్ర‌జ‌లు ఓ లెక్క అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ సంతోషించాల్సిన విష‌యం ఏంటంటే… క‌డ‌ప ఎంపీ బ‌రిలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌ను నిల‌ప‌లేదు. 

బ‌హుశా ష‌ర్మిల ఒత్తిడి చేసినా త‌ల్లి వినిపించుకోన‌ట్టున్నారు. లేదంటే విజ‌య‌మ్మ‌నే ఇండిపెండెంట్‌గా నిలిపి వుంటే… ప‌రిస్థితి ఏంటో ఒక్క‌సారి వైసీపీ ఆలోచించ‌కుని, కుట్ర‌లు, కుతంత్రాలు లాంటి చేత‌కాని మాట‌లు మాట్లాడ‌క‌పోవ‌డం మంచిది. అటు వైపు ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా ఎదుర్కోడానికి సిద్ధ‌ప‌డాలి. ఇంత‌కు మించిన మార్గం మ‌రొక‌టి లేద‌ని గ్ర‌హించాలి.