చట్టంపై నమ్మకం ఉందంటున్న ‘శ్రీమంతుడు’ టీమ్

దిగువ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించిన తర్వాత, రచయిత శరత్ చంద్ర మరోసారి మీడియాకు ఇంటర్వ్యూలు షురూ చేశారు. తనకు పరిహారం అక్కర్లేదని, క్రెడిట్ కావాలని కోరుతున్నారు. చాలా కాలం కిందటే తనకు 12…

దిగువ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించిన తర్వాత, రచయిత శరత్ చంద్ర మరోసారి మీడియాకు ఇంటర్వ్యూలు షురూ చేశారు. తనకు పరిహారం అక్కర్లేదని, క్రెడిట్ కావాలని కోరుతున్నారు. చాలా కాలం కిందటే తనకు 12 లక్షలు పరిహారంగా ఆఫర్ చేశారని, కానీ తను దాన్ని తిరస్కరించానని చెబుతున్నారు.

తను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవలలో ఎపిసోడ్లు, శ్రీమంతుడు సినిమాలో ఎపిసోడ్స్ ఒకేలా ఉన్నాయని మరోసారి వాదించారు శరత్ చంద్ర. కేవలం ఊరు పేరు మాత్రమే మార్చారని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై శ్రీమంతుడు యూనిట్ తాజాగా స్పందించింది. చట్టంపై తమకు గౌరవం ఉందని, న్యాయ ప్రక్రియలో సహనం-విశ్వాసం అవసరమని తెలిపిన యూనిట్.. ఈ అంశంపై అప్పుడే ఏదో ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాను కోరింది.

“కొరటాల శివ తీసిన శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ అనే నవల మధ్య సారుప్యత ఉందనే చర్చపై స్పందించేందుకు మేమిలా మీ ముందుకొచ్చాం. ఈ రెండూ పబ్లిక్ డొమైన్స్ లో ఉన్నాయి. ఎలాంటి ఓవర్ ల్యాప్ లేకుండా వేటికవే భిన్నంగా ఉన్నాయి. ఎవరైనా ఈ రెండింటినీ పరిశీలించి వెరిఫై చేసుకోవచ్చు.”

ఇలా తమ వాదన వినిపించిన శ్రీమంతుడు యూనిట్.. ఈ అంశం చట్టం పరిథిలో ఉందని, ఇంకా ఎలాంటి తీర్పు  వెలువడలేదని విషయాన్ని మీడియా గుర్తించాలని కోరింది.

గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ ఆధారంగా శ్రీమంతుడు సినిమా తెరకెక్కిందని, దీనిపై తాము గట్టిగా నిలబడతామని తెలిపిన యూనిట్.. ఎవరికైనా అనుమానం ఉంటే, పబ్లిక్ లో అందుబాటులో ఉన్న నవలను, సినిమాను మరోసారి పరిశీలించాలని కోరారు.