సోమేష్ కుమార్ ది నేరం అయితే చంద్ర‌బాబు అండ్ కో?

తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఫార్మాసిటీ స‌మాచారాన్ని ముందే తెలుసుకుని, యాచారం ప్రాంతంలో త‌న కుటుంబం పేరిట‌, బంధువుల పేరిట పదుల ఎక‌రాల భూమిని పోగేశాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వ్య‌వహారంపై తెలంగాణ…

తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఫార్మాసిటీ స‌మాచారాన్ని ముందే తెలుసుకుని, యాచారం ప్రాంతంలో త‌న కుటుంబం పేరిట‌, బంధువుల పేరిట పదుల ఎక‌రాల భూమిని పోగేశాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వ్య‌వహారంపై తెలంగాణ ఏసీబీ దృష్టి పెట్టింద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. 

ఈ కేసుకూ అమ‌రావతి ఇన్న‌ర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ వ్య‌వ‌హారానికి సంబంధించి చాలా సాప‌త్యం ఉంది. సోమేష్ కుమార్ సివిల్ స‌ర్వీసెస్ అధికారి అయితే, అమ‌రావ‌తి రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పుల వెనుక ఉన్న‌ది ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు. 

రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను త‌మ‌, త‌మ స‌న్నిహితుల భూముల విలువ‌లు పెరిగేలా చూసుకున్నార‌నేది ఆ కేసులో వినిపిస్తున్న అభియోగం. ఈ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను తెలుగుదేశం అధినేత, నాటి సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితుడు లింగ‌మ‌నేని ర‌మేష్, నాటి మంత్రి నారాయ‌ణ, వారి కుటుంబీకుల‌కు ల‌బ్ధి క‌లిగింద‌నేది న‌మోదైన అభియోగం.

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ అలైన్ మెంట్ మ్యాప్ ను ప‌రిశీలిస్తే.. లింగ‌మేని ఆస్తుల‌కు ప‌దుల మీట‌ర్ల ప‌క్క‌గా రోడ్ ను సెట్ చేశారు! అందుకు సంబంధించిన ఫొటోలు కూడా అప్ప‌ట్లో దుమారం రేపాయి.

మ‌రి ఇప్పుడు ఫార్మాసిటీ స‌మాచారాన్ని తెలుసుకుని ఆస్తులు కొన్న అభియోగాల‌తో సోమేష్ కుమార్ పై కేసులు, అరెస్టులు వంటివి ఉంటే, తమ స‌న్నిహితుల ఆస్తుల విలువ‌ల‌ను పెంచేలా అలైన్ మెంట్ ను మార్చుకోవ‌డం నేర‌మే అవుతుంది.

ఏపీలో అయితే ఇది క‌క్ష సాధింపు అంటూ గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ‌లో దొరికింది ఒక ఐఏఎస్ కాబ‌ట్టి.. అది రాజ‌కీయ క‌క్ష సాధింపు కాదు, ఏపీలో డైరెక్టుగా సీఎం లెవ‌ల్లోనే అంతా సెట్ చేశార‌నే అభియోగాలు న‌మోదైతే మాత్రం..క‌క్ష అంటూ గ‌గ్గోలు!