సంక్రాంతి ముందు మొదలైంది నైజాంలో థియేటర్ల రగడ. గుంటూరుకారం, హనుమాన్ సినిమాలు వేరు వేరు డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారు. దీంతో నైజాంలో పట్టు వున్న రెండు పంపిణీ సంస్థలు కలిసి హనుమాన్ కు థియేటర్లు లేకుండా చేసాయి. పెద్ద సినిమా..చిన్న సినిమా అనే రీజన్ వుండనే వుంది. ఇలాంటి టైమ్ లో ముందుగా సలార్ విడుదల సమయంలో అగ్రిమెంట్ చేసిన మూడు నాలుగు థియేటర్లు, దానిని ఉల్లంఘించి హనుమాన్ సినిమా ప్రదర్శించలేదు.
దీంతో ఈ విషయం ఛాంబర్ లో కేసు వరకు వెళ్లింది. కొంత జరిమానా విధించాలని ఛాంబర్ పెద్దలు నిర్ణయించారు. తరువాత అంత కాదు.. తగ్గించాలి అనే డిమాండ్ వచ్చింది. సరే అని కొంత తగ్గించారు. కానీ అది కూడా కట్టలేదు. నైజాంలోని ఓ వర్గం అసలు ఆ జరిమానా కట్టవద్దని, అవసరం అయితే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యవర్గం మొత్తం రాజీనామా చేద్దామని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో మొత్తం వ్యవహారం మొదటికి వచ్చినట్లు అయింది. ప్రస్తుతం రెండు సంస్ధల మధ్య అంతా పోటా పోటీగా వుంది. థియేటర్లు అక్వైర్ చేయడం, సినిమాలు కొనుగోలు చేయడం, ఇలా ప్రతి విషయంలో గట్టి పోటీ వుంది. 2025 సంక్రాంతికి ఇప్పటి నుంచి రిజర్వ్ చేసుకుంటూ ప్రకటనలు చేసే వరకు వచ్చింది వ్యవహారం.
ఇప్పటి వరకు నైజాంలో వరంగల్ శ్రీను వగైరా జనాలు వచ్చి అదృష్టం కలిసిరాక నష్టపోయి వెనక్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం మాత్రం సరైన వర్గం పోటీకి దిగడంతో, పరిస్థితి పోటా పోటీగా మారుతోంది.