మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టికెట్ కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఆయన విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అలాగే ఇంద్రకీలాద్రి దిగువున ఉన్న కామధేను అమ్మవారికి వెంకన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. టికెట్ కోసం కోటి తిప్పలు అని చెప్పక తప్పదు. చంద్రబాబు, లోకేశ్ గుడ్ లుక్స్‌లో పడేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నానిపై నిత్యం విమర్శలు చేస్తున్నారాయన. అయితే బుద్దాను లీడర్‌గా గుర్తించి, స్పందించే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరలేచింది. ఔను టీడీపీ రసగుల్లకు టికెట్ వద్దా? గతంలో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ఓవరాక్షన్ చేసి, పోలీసుల చేతల్లో దెబ్బలు తిన్న వైనాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ఎంతో ముందే తాను పోటీ చేస్తానని, ఓడిస్తానని ప్రగల్భాలు పలికి, తీరా ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం ఉలుకు పలుకు లేదేం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సదరు నాయకుడికి రసగుల్ల అని దర్శకుడు రాంగోపాల్ వర్మ ముద్దు పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అనవసరంగా వర్మతో గెలుక్కుని ఆ టీడీపీ నాయకుడు అభాసుపాలయ్యాడు. సీఎం జగన్ మొదలుకుని, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర అధికార పార్టీ నేతలపై ఆయన నోరు పారేసునేవాడు. ఓపిక నశించిన వైసీపీ నేతలు బడిత పూజ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా నోటిని అదుపులో పెట్టుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ అప్పుడప్పుడు నోరు జారుతూ, మళ్లీ కట్టేసుకుంటూ వుంటాడు.
ఎన్నికల సమయంలో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే మాట ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. ఎవరెన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అలాంటి వారికి ప్రాధాన్యం వుంటుందని లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లెక్కన వర్మ మాటల్లో చెప్పాలంటే రసగుల్ల అన్ని రకాలుగా టికెట్ పొందడానికి అర్హుడని చెబుతున్నారు. కేసులతో పాటు పోలీసుల చేతల్లో చావు దెబ్బలు తిన్నాడని, అలాంటి నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే, మరెవరికి ఇస్తారని చంద్రబాబు, లోకేశ్‌ను ఆయన పక్షాన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.