అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తీవ్రతరం చేసింది. ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేసి దాదాపు 70 మంది ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. మరోవైపు టీడీపీ-జనసేన కూటమి ఇంత వరకూ చెరో రెండు చోట్ల తప్ప, మరెక్కడా అభ్యర్థులను ప్రకటించలేదు. అది కూడా నాటకీయ పక్కీలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
రిపబ్లిక్ డేని పురస్కరించుకుని పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదని విమర్శించారు. తనతో మాట మాత్రం కూడా చర్చించకుండా రెండు చోట్ల అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారని పవన్ తప్పు పట్టారు. ఇదే సందర్భంలో తనపై కూడా ఒత్తిడి వుందంటూ రాజోలు, రాజానగరంలలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి రాజకీయ దుమారానికి తెరలేపారు. దీంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైతే రెండు పార్టీల మధ్య వ్యవహారం చెడిపోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో టీడీపీ అనుకూల పత్రికలో టీడీపీ-జనసేన కూటమి జాబితా అంటూ 13 మంది పేర్లను వెల్లడించడం గమనార్హం. ఈ 13 మంది పేర్లను పరిశీలిస్తే… టీడీపీ, జనసేన అవమాన భారంతో తలదించుకోవాల్సిన దయనీయ స్థితి. టీడీపీ-జనసేన కూటమికి అభ్యర్థులు లేరనే వాస్తవాన్ని ఈ జాబితా బయట పెట్టింది. టీడీపీకి సంబంధం లేని వారి పేర్లు దాదాపు సగం ఉన్నాయని అంటున్నారు.
ఈ జాబితాలో రఘురామకృష్ణంరాజు (నరసాపురం), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసారావుపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం) పేర్లు ఉన్నాయి. వీళ్లలో బాలశౌరి మాత్రమే జనసేనలో చేరారు. కృష్ణదేవరాయలు విషయానికి వస్తే ఇంకా టీడీపీలో చేరలేదు. రఘురామృష్ణంరాజు పరిస్థితి కూడా అంతే. వైసీపీ పుణ్యమా అని లభించిన ఎంపీ పదవితో, అధికారాన్ని అనుభవిస్తూ మళ్లీ ఆ పార్టీనే నిత్యం తిడుతున్నారు. టీడీపీ-జనసేన కూటమికి అభ్యర్థులు కావాలంటే పక్క పార్టీలపై ఆధారపడాల్సిందే అనేందుకు ఉదాహరణలు చెప్పొచ్చు.
నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ కూటమికి సరైన అభ్యర్థే లేరు. దీంతో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి పేరును పరిశీలించడం ఆ కూటమికే చెల్లింది. శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి. ఈయన టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ అంటూ అన్నీ పార్టీల్లోకి వెళ్లడం, తిరిగి వాటినే తిట్టి బయటికి రావడం తెలిసిందే. బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఊరికే అందరిపై నోరు పారేసుకుంటే, రోజుకో పార్టీ మారుతూ విలువ పోగొట్టుకున్నారు.
ప్రస్తుతం బైరెడ్డి కుమార్తె శబరి బీజేపీలో వుంటూ రాజకీయ ఉనికి చాటుకుంటున్నారు. నంద్యాల లోక్‌సభకు ఈమె పేరును టీడీపీ-జనసేన కూటమి పరిగణలోకి తీసుకోవడం ఏంటో ఆ పార్టీల నేతలకే తెలియాలి. ఇంకా ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ స్థానాలకు కూడా వైసీపీ నుంచి వచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ను సీఎం జగన్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ఎదురు చూడడం గమనార్హం.
నెల్లూరులో కూడా అదే పరిస్థితి. ఇక్కడ టీడీపీకి సరైన నాయకులు లేరు. దీంతో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వస్తారేమో అని టీడీపీ ఆశ పెట్టుకుంది. అంతేకాదు, చిత్తూరు రిజర్వ్డ్ ఎంపీ స్థానానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేరు కూడా పరిశీలిస్తుండడం టీడీపీ-జనసేన కూటమి బలహీనతకు నిదర్శనం. వైసీపీకి రాజీనామా చేసి వుంటే వారిని తమ అభ్యర్థులుగా ఎంపిక చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా వైసీపీలో లేదా బీజేపీలో ఉన్న నేతలను తమ వాళ్లగా పరిగణిస్తూ వీళ్లే కూటమి అభ్యర్థులుగా ప్రచారం చేసుకోవడం సిగ్గనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.