నాకు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఉరేసుకుంటా!

టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ నోరు తెరిస్తే సంచ‌ల‌న‌మే. బీకామ్‌లో ఫిజిక్స్ చ‌దివిన అరుదైన నాయ‌కుడిగా ఆయ‌న‌కు గుర్తింపు వుంది. ఇలాంటి అరుదైన మేధావి వైసీపీలో కాదు, టీడీపీలో వుండాల‌ని ఏరికోరి ఆయ‌న్ను…

టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ నోరు తెరిస్తే సంచ‌ల‌న‌మే. బీకామ్‌లో ఫిజిక్స్ చ‌దివిన అరుదైన నాయ‌కుడిగా ఆయ‌న‌కు గుర్తింపు వుంది. ఇలాంటి అరుదైన మేధావి వైసీపీలో కాదు, టీడీపీలో వుండాల‌ని ఏరికోరి ఆయ‌న్ను త‌న పార్టీలో చంద్ర‌బాబు చేర్చుకున్న  సంగ‌తి తెలిసిందే. జ‌లీల్‌ఖాన్ అంటే చాలా మంది గుర్తు ప‌ట్ట‌లేక‌పోవ‌చ్చు. కానీ బీకామ్‌లో ఫిజిక్స్ స్టూడెంట్ అంటే చాలు పేరుతో సంబంధం లేకుండా.. ఓ ఆయ‌నా అని అంటారు.

మ‌న బీకామ్ ఫిజిక్స్ సారూ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. ఈయ‌న గారు విజ‌య‌వాడ వెస్ట్ టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సీటును టీడీపీకి చెందిన మ‌రో ఇద్ద‌రు నేత‌ల‌తో పాటు జ‌న‌సేన కూడా కోరుకుంటోంది. దీంతో విజ‌య‌వాడ వెస్ట్‌పై ఇప్పుడే పంచాయితీ తేలే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ వెస్ట్ టికెట్‌పై జ‌లీల్‌ఖాస్ త‌న మార్క్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

విజ‌య‌వాడ వెస్ట్ టికెట్ త‌న‌దే అని, గెలిచి తీరుతాన‌ని ఆయ‌న అన్నారు. అంత‌టితో ఆయ‌న ఆగితే స‌మ‌స్యే లేదు. అబ్బే, ఆయ‌న వివాదం లేకుండా ఏదీ మాట్లాడ‌రు. బ‌హుశా జ‌లీల్‌ఖాన్ మాట్లాడితే వివాదం కావడం శాపం ఉన్న‌ట్టుంది. త‌న పార్టీ నేత‌ల‌తో పాటు జ‌న‌సేన నాయ‌కుడు కూడా విజ‌య‌వాడ వెస్ట్ టికెట్ అడ‌గ‌డాన్ని దృష్టిలో పెట్టుకున్న జ‌లీల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

టికెట్ అంద‌రూ అడుగుతార‌న్నారు. కానీ గెలిచే స్తోమ‌త వుండాల‌న్నారు. మంచి విలువ‌ల‌తో కూడిన క్యారెక్ట‌ర్ వుండాల‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆ క్వాలిటీస్ త‌న‌కే ఉన్నాయ‌ని, అందుకే టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌నేది ఆయ‌న మాట‌ల సారాంశం. ఒక‌వేళ త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే ఉరేసుకుంటాన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారాయ‌న‌. ఈ మాట అన్న త‌ర్వాత నోరు జారాన‌ని ఆయ‌న భావించిన‌ట్టున్నారు.

త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోడానికి సిద్ధంగా ఉన్నార‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గురు ఆ ప‌ని చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా, తాను అడ్డుకున్న‌ట్టు జ‌లీల్‌ఖాన్ పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇలాంటి హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో టీడీపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అనే చ‌ర్చ‌కు దారి తీసింది.