పదిహేనేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత 2024 ఎన్నికల్లో అయినా చట్ట సభలలో కూర్చోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆరాటపడుతున్నారు. ఆయన 2009లో ఓడిపోయిన దగ్గర నుంచి రాజకీయ జీవితం సాఫీగా సాగలేదు.
ఆయన కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలను తిరిగిన మీదట జనసేనలో చేరారు. అది కూడా అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ చేయాలన్న ఆశతోనే అని అంటున్నారు. టీడీపీ- జనసేన పొత్తులో అనకాపల్లి ఎంపీ సీటు సునాయాసంగా గెలుచుకోవచ్చు అని కొణతాల భావించారు. ఆయన రాజకీయ నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించారు.
అయితే ఇంత చేసినా ఆయనకు ఎంపీ టికెట్ దక్కదనే మాట వినిపిస్తోంది. పారిశ్రామికవేత్త దిలీప్ చక్రవర్తికి అనకాపల్లి ఎంపీ టికెట్ ని ఖరారు చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన దిలీప్ చక్రవర్తి టీడీపీకి జనసేనకు కావాల్సిన వారే. ఆయన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున గుంటూరు జిల్లాలో పోటీ చేశారు.
ఆయన ఇపుడు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన కనుక ఎంపీ అభ్యర్ధి అయితే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలోనూ అభ్యర్ధులకు అంగబలం అర్ధబలం సమకూరుతుందని లెక్కలు ఉన్నాయట. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వడానికి టీడీపీ చూస్తోంది. పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైన చిరంజీవిని అభినందించడానికి ఇటీవల హైదరాబాద్ లో ఆయన్ని కలసి వచ్చిన దిలీప్ చక్రవర్తి జనసేన వైపు నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకున్నారని అంటున్నారు.
అలా అనకాపల్లి ఎంపీ టికెట్ దిలీప్ కే ఖాయం అయింది అని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇబ్బంది పడేది ఎవరు అంటే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అని అంటున్నారు. ఆయనకు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీకి ఆప్షన్లు ఉన్నాయి. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు టీడీపీ అభ్యర్థికి కన్ ఫర్మ్ చేశారు. ఎంపీ సీటు అయినా జనసేనకు వదిలిపెడతారు అనుకుంటే దాని మీద కూడా టీడీపీ కర్చీఫ్ పడింది అంటున్నారు.
దాంతో కొణతాల భవిష్యత్తు హామీలను అందిపుచ్చుకుని టీడీపీ జనసేన కూటమి విజయానికి పనిచేయడమే అని అంటున్నారు. ఆయన 2019లో కూడా టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన అజ్ఞాత వాస్తంలోకి చాన్నాళ్ళు వెళ్ళిపోయారు. ఇపుడు మళ్ళీ రాజకీయ చురుకుదనం తెచ్చుకుని ఆయన జనసేనలో చేరినా సీనియర్ గా ప్రచారానికే పరిమితం అయితే ఇక పదవులు దక్కేది ఎపుడు అన్నది అనుచరుల ఆవేదనగా ఉందిట.