ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వైపు ఆయన చెల్లెలు షర్మిల మరో వైపు నిలిచి ఏపీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్న సంగతి తెలిసిందే. అయిదేళ్ళ క్రితం జగన్ పక్షాన ఉన్న షర్మిల ఇపుడు వైసీపీ తీవ్రంగా ద్వేషించే కాంగ్రెస్ శిబిరంలో చేరారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు పవన్ లతో సరిసమానంగానే కాదు ఇంకా ఎక్కువగానే జగన్ ని టార్గెట్ చేస్తున్నారు.
ఏపీలో కాంగ్రెస్ వట్టిపోయింది. దానికి ఊపిరిపోయాలని షర్మిల తాపత్రయం పడుతూనే వైసీపీని గద్దె దించితేనే అది సాధ్యం అనుకుంటున్నారు. ఈ విషయంలో ఆమె ఆశలు కోరికలు కూడా టీడీపీతో పాటుగానే ఉన్నాయి. టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య ఎలాగో షర్మిల రాజకీయ జీవితానికి కూడా ఈ ఎన్నికలు ప్రధానం అయినవి అని భావిస్తున్నారు.
కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదు, వైసీపీ ఓటమి కాంగ్రెస్‌కి షర్మిలకు ప్రధానం అయిపోయాయి. వైసీపీ ఓటమి పాలు అయితే అందులో ఉన్న వారంతా కాంగ్రెస్ వైపు వస్తారని అలా 2029 నాటికి కాంగ్రెస్ ఏపీలో పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పెద్దల భావన. అందుకే షర్మిల బాణాన్ని వైసీపీ మీద ప్రయోగించారు. ఈ బిగ్ టాస్క్ లో షర్మిల ఏ మాత్రం తడపడినా ఆమె రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.
కాంగ్రెస్ ని నోటా నుంచి పైకి లేపి కొద్దో గొప్పో ఓట్లు తెస్తే హస్తం పార్టీ పెద్దలకు అసలు కుదరదు. వైసీపీ ఓటమే వారి అసలు లక్ష్యం. దాన్ని షర్మిల బాణంతో చేదించాలి. అలా జరిగితేనే షర్మిలకు ఇచ్చిన పీసీసీ పదవి ఆమెకు కాంగ్రెస్ ఇచ్చిన ఈ హోదా గుర్తింపు అన్నీ కొనసాగే అవకాశం ఉంటుంది.
ఈ విషయాలు ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె పీసీసీ చీఫ్ కాగానే ఎక్కడా విరామం ఇవ్వకుండా వైసీపీ మీదనే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైసీపీని ఒక విధంగా చీల్చిచెండాడుతున్నారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలో ప్రత్యేక హోదా డిమాండ్ తో ఆమె ఒక రోజు నిరసన దీక్షను చేపడుతున్నారు.
ఆ తరువాత ఏపీలో ఫిబ్రవరి 5 నుంచి 11 వరకూ అనేక జిల్లాలలో సభలు రోడ్ షోలను నిర్వహించడానికి షర్మిల సమాయత్తం అవుతున్నారు. ఈ మొత్తం షెడ్యూల్ లో రాయలసీమ, కోస్తా, గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా కూడా ఉంది. ఈ నెల 10న ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరులో జరిగే సభలో పాల్గొననున్నారు.
ఇక్కడే రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. సరిగ్గా అదే రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన పెట్టుకున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరిట ఏపీలో మూడు నెలలుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం విశాఖలో జరగనుంది. దీనికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఆ రోజు మొత్తం జగన్ విశాఖలోనే ఉంటారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు.
అంటే అదే రోజున చెల్లెలు షర్మిల కూడా విశాఖలో ఉంటారు అన్న మాట. ఇలా అన్నా చెల్లెలు ఒకే జిల్లాలో ఒకే రోజు వేరు వేరు సభలలో పాల్గొంటున్నారు. జగన్ ప్రసంగంలో కూడా రాజకీయ మెరుపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. షర్మిల అయితే వైసీపీనే టార్గెట్ గా చేసుకుంటారు అన్నది వాస్తవం. ఆ రోజున డైరెక్ట్ గా అన్నా చెల్లెళ్ళు మాటల తూటాలు పేల్చుతారా అన్నది చూడాలంటే 10వ తేదీ వచ్చే వరకూ ఆగాల్సిందే.