ఫిబ్రవరి బాక్సాఫీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సినిమాల సందడి ముగుస్తుంది. సమ్మర్ సినిమాల చర్చ మొదలవుతుంది. ఈ సంధి కాలంలో ఉంటుంది ఫిబ్రవరి బాక్సాఫీస్. అయినప్పటికీ ఈ నెలలో ఊహించని సక్సెస్ ఒకటి ఏటా కనిపిస్తూనే ఉంటుంది. గడిచిన నాలుగేళ్లుగా ఈ మేజిక్ రిపీట్ అవుతూనే ఉంది.
ఉదాహరణకు 2023 ఫిబ్రవరినే తీసుకుంటే సర్ సినిమా ఊహించని విజయాన్నందుకుంది. ఇక 2022 ఫిబ్రవరిలో డీజే టిల్లూ, 2021 ఫిబ్రవరిలో ఉప్పెన, 2020 ఫిబ్రవరిలో భీష్మ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇలా ప్రతి ఏడాది ఫిబ్రవరికి ఓ సర్ ప్రైజ్ హిట్ పడుతోంది. మరి ఈ ఏడాది సంగతేంటి? ఈ నెలలో ఆ మేజిక్ రిపీట్ చేసే సినిమా ఏది?
ఫిబ్రవరి మొదటివారంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బూట్ కట్ బాలరాజు, ధీర, హ్యాపీ ఎండింగ్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ పై ఓ మోస్తరు అంచనాలున్నాయి. కలర్ ఫొటో మేజిక్ రిపీట్ అవుతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిజల్ట్ తేలిపోతుంది.
ఇక ఫిబ్రవరి రెండో వారంలో.. యాత్ర-2, ఈగల్, లాల్ సలామ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వైఎస్ జగన్ రాజకీయ జీవితం నేపథ్యంలో తీసిన యాత్ర-2పై మంచి అంచనాలున్నాయి. మహి వి రాఘవ్ ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ చూపించాడనే టాక్ నడుస్తోంది.
ఇక సంక్రాంతి బరి నుంచి తప్పుకొని, సోలోగా రిలీజ్ అవుతోంది ఈగల్ సినిమా. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. జనంలో పెద్దగా అంచనాల్లేకపోయినా, సినిమాకు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అటు రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన లాల్ సలామ్ కూడా వస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు అనే సినిమాను కూడా ఇదే వారంలో రీ-రిలీజ్ చేస్తున్నారు.
మూడో వారంలో.. ఆపరేషన్ వాలంటైన్, ఊరు పేరు భైరవకోన సినిమాలు పోటీ పడబోతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్, ఎయిర్ ఫోర్స్ గొప్పదనాన్ని చాటిచెప్పే చిత్రం కాగా.. మిస్టిక్ థ్రిల్లర్ గా సందీప్ కిషన్ హీరోగా ఊరు పేరు భైరవకోన సినిమా వస్తోంది. ప్రస్తుతానికైతే ఈ రెండింటిలో భైరవకోనకే ఎడ్జ్ ఉంది. ఎందుకంటే, ట్రయిలర్ హిట్టవ్వడంతో పాటు 2 పాటలు బాగా వైరల్ అయ్యాయి.
నాలుగో వారంలో.. ప్రస్తుతానికి సుందరం మాస్టర్, మస్తు షేడ్స్ ఉన్నాయిరా లాంటి చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. అప్పటికి మరికొన్ని సినిమాలు యాడ్ అవ్వడం ఖాయం. మొత్తమ్మీద ఫిబ్రవరిలో ఓ మోస్తరు నుంచి భారీ అంచనాలతో కొన్ని సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో 'ఫిబ్రవరి మేజిక్' ను రిపీట్ చేసే సినిమా ఏదనేది ఆసక్తికరంగా మారింది.