ఆంధ్రలో త్వరలో కురుక్షేత్రం సంగ్రామం జరగబోతోంది. వైసిపి ఒకవైపు, టిడిపి నాయకత్వంలోని కూటమి మరో వైపు మోహరిస్తున్నాయి. ఎవరికి వారే తాము పాండవులమని, ఎదుటి వాళ్లు కౌరవులని అంటున్నారు. నాటి భారతయుద్ధంలో కృష్ణుడి సహాయం కోరదామని అర్జునుడు, దుర్యోధనుడు యిద్దరూ అతని దగ్గరకు వెళ్లారు. నేటి భారతంలో బిజెపి కృష్ణుడి పాత్ర పోషిస్తున్నట్లు కనబడుతోంది. తలచుకుంటే తనను ఆశ్రయించిన వాళ్లని గెలిపించడానికి ఏ మాయోపాయమైనా పన్నగల సామర్థ్యం ప్రస్తుతం దానికే ఉంది. జగన్ లోపాయికారీగా ఒప్పందమేదైనా కుదిర్చేసు కున్నాడేమో తెలియదు కానీ బిజెపి దగ్గరకు బహిరంగంగా వెళ్లటం లేదు. కానీ టిడిపి-జనసేన కూటమి మాత్రం కృష్ణుడి గుమ్మం దగ్గర పడికాపులు కాస్తున్నారు. కృష్ణుడేమో నిద్ర నటిస్తున్నాడు.
అవతల ఎన్నికల సమయం ముంచుకు వస్తోంది. సారథ్యం వహిస్తాడో, లేక క్యాడర్ నప్పగించి ఊరుకుంటాడో, యుద్ధమయ్యాక విజేతలతో కలిసి ఊరేగుతానులే, యిప్పణ్నుంచి ఎందుకు అడావుడి అంటాడో ఏదీ తేల్చడు యీ కన్నయ్య. ఏ సంగతీ కనుక్కుని వచ్చేస్తానుండండి అని తమ క్యాడర్‌ను వెయిటింగులో ఉంచారు బాబు. ఇవతల యీయన రామాలయం అంటాడు, రాజ్యసభ ఎన్నికలంటాడు, మరోటంటాడు, ఏదీ తేల్చకుండా గునపాన్ని నానబెట్టినట్లు పస్తాయిస్తున్నాడు. ఈ లోపున మన మధ్య సంగతేమిటో తేల్చండి అంటూ ఆరాట పడుతున్నారు టిడిపి, జనసేన శ్రేణులు. ఈ నెలాఖరులో దిల్లీ వెళ్లి అటోయిటో, అట్టోపెట్టో తేల్చుకుని వచ్చేస్తాం అని ఊరడించారు బాబు-పవన్. తీరా చూస్తే దిల్లీ ట్రిప్ వాయిదా పడింది.
ఛ, ఎందుకొచ్చిన రొష్టు, బిజెపిని దులిపేసుకుని, మన సంగతి మనం చూసుకుందాం అని గట్టిగా అనుకోవడానికి లేదు. రాయబారం కుదరదని తెలిసినా ‘అయినను పోయి రావలెను హస్తినకు’ అంటూ కృష్ణుడు అన్నట్లే వీళ్లూ హస్తినకు ఓ రౌండు కొట్టి రావల్సందే! ఎందుకంటే జనసేన అఫీషియల్‌గా ఎన్డిఏ కూటమిలో భాగస్వామి. ఆంధ్రలో ఉమ్మడి కార్యక్రమాలు చేయడం లేదు కాబట్టీ, టిడిపితో పొత్తు ఉంటుందని పవన్ ఏకపక్షంగా ప్రకటించాడు కాబట్టీ, బిజెపికి స్లీపింగ్ పార్ట్నరేమో అనుకుంటూ వచ్చాం కానీ, తెలంగాణ ఎన్నికల సందర్భంగా పవన్‌ను నిద్రలేపి, నువ్వు యాక్టివ్ పార్ట్నర్వే అని చెప్పారు బిజెపి వారు. అయినా పవన్ అంత యాక్టివిటీ ఏమీ చూపించలేదు.
ఇప్పుడు ఆంధ్రలో బిజెపితో మాత్రమే పొత్తు పెట్టుకుంటే తెలంగాణ రిజల్టు పునరావృతం అవుతుందేమోనని పవన్‌కు సంశయం. అందుకని టిడిపిని కూడా ఎన్డిఏ లోకి తీసుకుని వచ్చి తనకు యిబ్బంది లేకుండా చూసుకుందామని తాపత్రయ పడుతున్నాడు. కాదంటే తను ఎన్‌డిఏలోంచి బయటకు రావలసి వస్తుంది. పొత్తు కాకపోయినా కనీసం ఎన్నికల సర్దుబాట్లు (ఒకరు పోటీ చేసేచోట, అవతలి వాళ్లు పోటీలోంచి తప్పుకోవడం) చేసుకున్నా మహబాగే. కానీ ఏదో ఒకటి తేల్చి చెప్పాలి కదా! మాయదారి కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ మౌనం పాటిస్తున్నాడు. వెయిట్ చేయించడంలో ఘనుడని బాబుకి పేరుంది. ఇప్పుడు బాబునే వెయిట్ చేయించే ఘనాఘనుడు అవతరించాడు.
బాబు కావాలని వెయిట్ చేయిస్తారని అనుకోవడానికి లేదు. ప్రతీదీ స్వయంగా ఆలోచించి.. చించి, నిర్ణయం తీసుకోవడం ఆయన అలవాటు. వైయస్ ఐతే డెలిగేషన్ చేయడంలో దిట్ట. అధికారులనే బాగా ఆలోచించి ముందుకు వెళ్లిపోమనడం, పర్యవసానాలు బాగా లేకపోతే దిద్దుబాటు చర్య తీసుకుందాంలే అంటూ దూసుకుపోవడం ఆయన లక్షణంట. ‘ఫూల్స్ రష్ యిన్ వేర్ ఏంజిల్స్ ఫియర్ టు ట్రెడ్’ అని చిన్నపుడు చదివినది బాబుకి బాగా గుర్తుండిపోయింది. ఏదైనా ఆచి, తూచి అడుగులు వేస్తారు. అలా వేసిన స్టెప్సన్నీ కరక్టవుతాయన్న గ్యారంటీ ఏమీ లేదు. అది ఆయన అలవాటంతే! ఈసారి కెసియార్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఓడిపోయాడు కాబట్టి బాబు వ్యూహాత్మకంగా చివరి నిమిషం దాకా ప్రకటించ కూడదనుకుంటున్నారు అని ఎవరైనా చెపితే విని నవ్వేసి ఊరుకోండి.
ఒక్కో నియోజకవర్గం గురించి నాలుగైదు సర్వేలు చేయించి, (యిది యివాళ్టి వ్యవహారం కాదు, దశాబ్దాల నుంచి ఆయనకున్న అలవాటు), కాచి, వడపోసి, అభ్యర్థిని నిలుపడం ఆయన పాలసీ. బి ఫారం యిచ్చేదాకా ఆశావహుడు గాలిలో వేళ్లాడుతూనే ఉంటాడు. నామినేషన్ల విత్‌డ్రా తేదీ లోపున నిర్ణయం తీసుకుందాంలే అని ఒక్కోప్పుడు యిద్దరి చేత వేయించేవారు కూడా అని చదివాను. తన పార్టీ అభ్యర్థుల విషయంలోనే యింత డిల్లీడాలీయింగ్ ఉంటే పొత్తు ఉన్నపుడు చెప్పనే అక్కర్లేదు. ఏ పార్టీకి ఏ సీటు అనేదానిపై అంతులేని తర్జనభర్జనలుంటాయి. అవతలివాళ్లకు యిస్తే సీటు పోగొడతారేమో, ప్రతిపక్షానికి మేలు కలుగుతుందేమోనన్న సందేహం పీడిస్తుందీయనకు. వాళ్లకు కేటాయించిన సీటులో టిడిపి చేత కూడా నామినేషన్ వేయించి, చివరి తేదీన ఎవరో ఒకర్ని ఉపసంహరించేవారు.
బాబుతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు నామినేషన్ల పర్వం పూర్తయ్యేదాకా టెన్షన్ తప్పదు. 2009లో మహా కూటమి ఏర్పరచినపుడు మాత్రం బాబుకే టెన్షన్ కలిగించినవాడు కెసియార్! అర్ధరాత్రి మీడియాకు ఫోన్ చేసి, ఫలానా సీటు మాదే, నామినేషన్ వేస్తున్నాం అనేవాడు. ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి పొత్తు గురించి సందిగ్ధంగా మాట్లాడేవాడు. ఇలా బాబు నుదురు బాదుకునేట్లు చేశాడు. 2014కి వచ్చేసరికి బిజెపితో పొత్తు విషయంలో వెంకయ్య నాయుడు ధర్మమాని టిడిపికి ఆంధ్రలో స్మూత్‌గా సాగిపోయింది. టిడిపి వారే బిజెపీయులుగా అవతారమెత్తారు. తెలంగాణ బిజెపి మాత్రం సహాయనిరాకరణ చేసింది. జనసేన సీట్లు అడగలేదు కాబట్టి ఏ చిక్కూ లేకపోయింది. 2019లో మొట్టమొదటిసారిగా బాబు పొత్తు లేకుండా పోటీ చేసి, ఘోరంగా దెబ్బ తిన్నారు.
ఒంటరి పోరు ఆత్మహత్యాసదృశం, వీరమరణం అని పవన్ నిజాయితీగా చెప్పేసుకుంటున్నాడు. బాబుదీ సేమ్ ఫీలింగు కానీ పైకి అనరు. జనసేన మాత్రమే చాలదు, బిజెపి కూడా కావాలి అని నిశ్చయించుకున్నారు. పైకి మాత్రం మా ప్రమేయం లేకుండా వైసిపి పేకమేడలా కూలబోతోంది, జగన్ భారం వదుల్చుకునే రోజు ఎప్పుడెప్పుడా అని ప్రజలే చూస్తున్నారు. ఇది తెలిసి జగన్ బెదురుతున్నాడు, కంఠంలో వణుకు తెలుస్తోంది, నేను ఓడిపోయినా.. అని అన్నాడంటేనే అర్థమౌతోంది, ఓటమి గోడ మీద రాతే అని.. యిలా చెప్తూనే ఉంటారు. మళ్లీ మరు నిమిషంలో పొత్తుల గురించి మాట్లాడతారు. అచ్చెన్నాయుడు టిడిపికి 160 స్థానాలు వస్తాయంటారు. అలా వచ్చేట్టయితే పొత్తెందుకు? ఈ మధ్య లోకేశ్ 150 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అవన్నీ గెలిచినా, 160 రావుగా! కూటమికి 160 వస్తాయని సవరించి చదువుకోవాలన్నమాట.
సహజంగా కూటమి అనగానే అన్ని పార్టీల్లోనూ బేరసారాలూ, సీట్ల ఎంపిక సమస్యలూ సహజం. బాబుతో అయితే యింకాస్త ఎక్కువ! బాబుతో పొత్తు అనగానే ఏ విషయం ఓ పట్టాన తేల్చడనీ, చివరిదాకా త్రిశంకు స్వర్గంలో వేళ్లాడేస్తాడనీ, తన కాండిడేట్లనే భాగస్వామి పక్షపు అభ్యర్థులుగా ఫిరాయిస్తాడనీ.. యిలాటి భయాలు పొత్తుదార్లకు ఉన్నాయి. టిడిపి-జనసేన మధ్య పొత్తు ఎంత సజావుగా కుదురుతుందాని చూస్తూ ఉంటే మధ్యలో బిజెపి గొడవొకటి వచ్చి పడింది. ఆల్జీబ్రాలో ఎక్స్ లాగ అది తెలియని ఫ్యాక్టరై పోయింది. కూటమిలో ఉంటుందా? ఉంటే ఎన్ని అడుగుతుంది? వీళ్లెన్ని యిస్తారు? ఎక్కడ యిస్తారు? అన్నీ ప్రశ్నలే.
జనసేనది మరీ కన్ఫ్యూజన్. ఎన్‌డిఏలో భాగస్వామి అయి వుండి, భాగస్వామి కాని టిడిపితో పొత్తు పెట్టుకోవడాన్ని బిజెపి ఆమోదిస్తుందా, లేదా అన్న సంశయం పీడిస్తోంది. తెలంగాణలో ఆ సమస్య రాలేదు, టిడిపి పోటీ చేయలేదు కాబట్టి! ఆంధ్రలో టిడిపి పోటీ చేస్తోంది. కూటమిలో బిజెపి చేరని పక్షంలో ఒక నియోజకవర్గంలో టిడిపి, బిజెపి రెండూ పోటీ చేస్తూంటే జనసేన ఎవరికి మద్దతిస్తుంది? ప్రచారంలో భాగంగా బిజెపి వైసిపితో పాటు టిడిపినీ తిడుతూంటే, పవన్ ఏం చేస్తారు? వాళ్లతో వేదిక పంచుకుంటారా? లేక విభేదిస్తున్నానని చెప్తారా? తన ప్రయాణం బిజెపితోనో, టిడిపితోనో నిర్ణయించు కోవాల్సింది పవన్ మాత్రమే. కానీ ఆయన తన రోడ్‌మ్యాప్‌ను యిమ్మనమని బిజెపిని అడుగుతూ వచ్చాడు. అది ఆ మ్యాప్ దాచిపెట్టుకుని కూర్చుంది. దీని సంగతి యిలా ఉందాని రాజమండ్రి జైలు బయట జనసేన-టిడిపి పొత్తుని పవన్ బాహాట పరిచేశారు. బిజెపి కూడా మాతో కలిసి వస్తుందనుకుంటున్నాను అని మొహమాట పెట్టేశారు కూడా.
అయినా బిజెపి తొణకలేదు, బెణకలేదు, స్పందించలేదు. విభజన సమయంలో కాంగ్రెసులో ‘సరైన సమయంలో సరైన నిర్ణయం’ అంటూ అలాగే, దిమ్మచెక్కలా కూర్చుంది. ఇకనైనా ప్రాణం విసిగి, ఫలానా రోజు లోపున పొత్తు విషయం తేల్చకపోతే నా దారి నాదే అని ప్రకటించవలసినది పవనే. కానీ ఆ మాట అనడానికి ఆయనకు జంకుగా ఉంది. బహుశా బాబు ఆగు, ఆగు, తెగతెంపుల దాకా తెచ్చుకోవద్దు. మన కోవర్టుల ద్వారా నయానో, మీడియా ద్వారా భయానో బిజెపిని మన దారికి తెద్దాం, అది కూడా కలిసి వస్తే మనది ఫర్మిడబుల్ కాంబినేషన్ అవుతుంది. లేకపోతే గట్టెక్కడం కష్టం, అంచుల దాకా వచ్చి ఆగిపోతాం అని నచ్చచెపుతూ ఉండవచ్చు.
అసలే ఆయనది తాత్సారగుణం. దానికి తోడు కొన్ని వర్గాల్లో బిజెపి ఓటు బ్యాంకు, టిడిపి ఓటు బ్యాంకు ఒకటే. జగన్ వ్యవహారం చూడబోతే ఛాయిస్ మీద ఆధారపడే స్టూడెంటులా ఉంది. కొందరు విద్యార్థులు చూడండి, పరీక్షకు వెళ్లేటప్పుడు సిలబస్సంతా ప్రిపేరు కారు. అంతా చదివితే గుర్తు పెట్టుకోవడం కష్టమని, కొంత పోర్షన్ వదిలేస్తారు. ప్రశ్నాపత్రంలో ఎలాగూ ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఆ పోర్షన్ తాలూకు ప్రశ్నలు వదిలేసి, తక్కినవి ఎటెంప్ట్ చేస్తే చాలు, పాసయిపోతాం అనుకుంటారు. జగన్‌కు గతంలో దాదాపు 50% ఓట్లు వచ్చాయి, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి! ఈ సారి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఓ 45% వస్తే ఓ 100, 110 సీట్లు వచ్చి గట్టెక్కేయవచ్చు అనే ప్లానులో ఉన్నట్టున్నాడు.
అబ్బే, అతను 175 అంటూంటే మీరు 110 చాలనుకుంటున్నాడని ఎలా అంటారు? అని అడగకండి. అతను చెప్పినది ‘వై నాట్ 175?’ అది అనుచరులను ఉత్సాహపరచడానికి! చావుకి పెడితే లంఖణానికి వస్తుందనే లెక్కతో! ఏ తండ్రీ పిల్లాడికి 35 మార్కులు తెచ్చుకోరా చాలు అనడు. నూటికి నూరు తెచ్చుకోవాలి అంటాడు. అలా అంటే ఏ ఏభయ్యో వస్తాయని తండ్రి ఆశ. 35 అంటే ఏ 17 దగ్గరో ఆగిపోవచ్చు. స్టూడెంటు తండ్రి వై నాట్100 అనే టార్గెట్ పెట్టినా, పేపరు దిద్దేవాడు పట్టించుకోడు, తను వేద్దామనుకున్న మార్కులే వేస్తాడు. అలాగే యిక్కడ ఓటరూనూ. ఆ నినాదాలు తమ అనుచరులకే. ప్రతి ప్రతిపక్ష పార్టీ ‘రాబోయేది మా ప్రభుత్వమే’ అని ప్రకటించేస్తుంది. నాలుగు ప్రతిపక్షాలుంటే నాలుగూ అవే మాట అంటాయి. ఇదంతా ప్రచార హోరు, జోరు తప్ప మరేమీ కాదు.
ఇంతకీ చెప్పవచ్చేది జగన్ ఉద్యోగి వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, ఆలోచించే వర్గాలు, ధనిక వర్గాలు యిలాటి వారందరినీ తన సిలబస్ లోంచి తీసి పక్కన పెట్టేశాడు. తక్కిన పోర్షనే బట్టీ పడుతున్నాడు. ఆ విస్మృత వర్గాలు జగన్‌కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నాయి. వాళ్లకి టిడిపితో పాటు, బిజెపిపై కూడా ప్రేమ ఉంది. పైగా యిప్పుడు అయోధ్యా పూనకంలో ఉన్నారు. అందుచేత 2019లో 1% ఓటు తెచ్చుకున్న పార్టీకి యీసారి పార్లమెంటు స్థానాలకైనా అంతకు మించి ఓట్లేయవచ్చు పనిలో పనిగా అసెంబ్లీకి కూడా కమలం గుర్తుపై గుద్దేస్తే? – అనే భయం బాబును పీడిస్తోంది. తాము అసెంబ్లీకి పోటీ చేసే చోట ఇవిఎమ్లో కమలం గుర్తు కనబడకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జనసేనకు అలాటి ప్రమాదం లేదు. దాని ఓటు బ్యాంకంతా ఆవేశపరులూ, అభిమాన ధురంధరులూ. పవన్ కావాలంటే నిమిషంలో బిజెపికి గుడ్‌బై చెప్పగలడు. కానీ బిజెపి కలిసి రాకపోతే నష్టపోయేది టిడిపియే. అందుకే బాబు నిదానిస్తున్నారు.
వీళ్లను వెయిట్ చేయబెట్టి తను సాధించేదేమిటో బిజెపికే తెలియాలి. ఆలస్యం చేయడానికి గల కారణాన్ని ఊహించగలం. ఆంధ్ర రాజకీయం కమ్మ, రెడ్డి ప్రధాన పార్టీల మధ్య చీలిపోయింది. తక్కిన కులాలు వీళ్ల చొక్కా అంచు పట్టుకుని నడవాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయంగా మూడో ప్రధానమైన కాపులను ముందు పెట్టుకుని సాగితే, తక్కిన కులాలకు ఛాయిస్ యిచ్చినట్లవుతుంది, తామూ ఎదిగినట్లు ఉంటుంది అనుకుని బిజెపి కాపు నాయకులను రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టుకుంది కానీ ప్రయోజనం లేకపోయింది. కాపు ముద్ర ప్రబలంగా ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకుని సాగుదామనుకుంది. తీరా చూస్తే పవన్ మళ్లీ కమ్మనే ముఖ్యమంత్రి చేస్తానంటున్నాడు. ఇక యీ వలయం లోంచి బయటపడడం ఎలా? కాస్త ఓపిక పట్టు, 2029 నాటికి మనమే ఎదుగుదాం అని చెప్పినా పవన్ వినిపించుకోవటం లేదు. జగన్‌ను ఓడించి యింటికి పంపడమే ‘తక్షణ కర్తవ్యం’ అని పంతం పట్టి కూర్చున్నాడు. పవన్ బదులు వేరెవరైనా గ్లామరస్ లీడరున్నాడా అని చూడబోతే ఎవరూ కనబడలేదు. జూనియర్ని కదలేస్తే బాబోయ్ అనేశాడు.
ఇదీ బిజెపి సందిగ్ధానికి కారణం. ఒంటరిగా వెళితే ఏ సీటూ నెగ్గకపోవచ్చు. పొత్తులో వెళితే ప్రత్యామ్నాయంగా ఎప్పటికీ ఎదగలేక పోవచ్చు. డైలమా ఉన్న మాట నిజమే కానీ, ఏదో ఒకటి చప్పున తేల్చుకోవాలి కానీ తటపటాయింపు వలన సుఖమేమిటి? ఇప్పుడు వాళ్ల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి బిజెపి ఏం చేసినా ఏదో పెద్ద వ్యూహంతో చేశారని మనం అనుకుంటున్నాం కానీ తెలంగాణలో పవన్‌కు ఆఖరి నిమిషంలో పిల్చి 8 సీట్లు అప్పగించి సాధించినదేమిటి? అప్పగించకపోతే కూకట్పల్లి సీటు గెలిచేదేమో! అందువలన నిర్ణయం ఆలస్యం చేయడం ద్వారా అంతిమంగా బిజెపి లాభపడుతుందని మనం తీర్మానించలేము.
ఓ పక్క వైసిపి ‘సిద్ధం’ అంటూ ఉరకలు వేస్తూ యుద్ధంలోకి దిగుతూంటే, మరో పక్క టిడిపి, జనసేన ‘నీది రెండా? అయితే నాదీ రెండు’ అంటూ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే, బిజెపి ‘అయ్యో ఆ సీటు మాదిరా బాబూ’ అని అనడానికి కూడా లేకుండా ఉంది. టిడిపి-జనసేన కూటమిలో చేరడం మాట అలా ఉంచినా, కనీసం తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కోసమేనా బిజెపి నోరు విప్పితే మంచిది. ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారో చెపితే, ఆ నియోజకవర్గాలపైనైనా ఫోకస్ పెట్టడానికి వీలుంటుంది. నెగ్గినా, నెగ్గకపోయినా, గతంలో కంటె ఓట్ల శాతం పెంచుకోవడానికైనా బిజెపి క్యాడర్ యింట్లో అటక మీద నుంచి కత్తీ, డాలూ దింపుకుని, దుమ్ము దులిపి, పదును పెట్టుకుని రెడీగా ఉండాలి కదా! అందువలన కపటనిద్ర చాలించి బిజెపి కృష్ణుడు లేచి కూర్చుని పద్యం ఎత్తుకోవాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2024)