జగన్ పరువు తీస్తున్నది సలహాదారులేనా?

పార్టీ అవసరాలను బట్టి, అభ్యర్థుల బలాబలాను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాదరణను బట్టి, పార్టీకి మేలు చేయగల- పార్టీ ప్రతిష్ఠను పెంచగల సామాజిక వర్గ సమీకరణాలను బట్టి.. నాయకులను అటుఇటుగా మార్చడం ముఖ్యమంత్రి…

పార్టీ అవసరాలను బట్టి, అభ్యర్థుల బలాబలాను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాదరణను బట్టి, పార్టీకి మేలు చేయగల- పార్టీ ప్రతిష్ఠను పెంచగల సామాజిక వర్గ సమీకరణాలను బట్టి.. నాయకులను అటుఇటుగా మార్చడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న కసరత్తు. సిటింగులకు కొత్త నియోజకవర్గాలను కేటాయించడం.. ఎమ్మెల్యేలను ఎంపీలుగాను, ఎంపీలను ఎమ్మెల్యేలుగాను బరిలోకి దించాలని అనుకోవడం కూడా ఇలాంటి కసరత్తులో భాగంగానే జరుగుతోంది.

ఎలాంటి ప్రయత్నమైనా సరే.. అంతిమంగా పార్టీ ప్రయోజనాలను, ప్రజా ప్రయోజనాలను లక్ష్యించే ఉంటుంది. మరోసారి విజయం దక్కించుకోవాలనే కోరికతోనే సాగుతుంది. ఈ కసరత్తులో చోటు చేసుకుంటున్న అపసవ్యతలు, వాటిని దిద్దుకోవడానికి పడుతున్న పాట్లు, రోజుల వ్యవధిలోనే నిర్ణయాలను వెనక్కు తీసుకుంటూ వేస్తున్న తడబాట్లు, తప్పటడుగులు ఇవన్నీ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇమేజిని దెబ్బతీసేలా మారుతున్నాయి. ఆయన నిర్ణయాత్మక శక్తిపై ప్రజల్లో సందేహాలు కలిగేలా చేస్తున్నాయి.

‘నిర్ణయం తీసుకోవడానికి ముందు వందరకాలుగా ఆలోచించు, అవసరమైతే ఆలస్యం చేయి.. కానీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత దృఢంగా దానికి కట్టుబడి ఉండు’ అని తెలియజెప్పే ఇంగ్లిషు సామెత ఒకటి ఉంటుంది. జగన్ ఈ సామెతను తెలుసుకోవాలి. తడబడుతున్న నిర్ణయాలు కొన్నే అయినప్పటికీ.. ఆయన నిర్ణయాత్మక శక్తి మీద ప్రజలకు, అభిమానులకు ఉండే నమ్మకానికి గండి కొట్టడానికి అవిచాలు. కొన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో తెలియదు. అలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు. సలహాదారుల ముసుగులో ఆయనకు రాజకీయ మార్గదర్శనం చేస్తున్నవారు.. అచ్చంగా పరువు తీయడానికే సలహాలు ఇస్తున్నారా? లేదా, వారి అవగాహన లేమి పర్యవసానంగా జగన్ పరువు పోతున్నదా? అనేది అర్థంకాని సంగతి.

కొన్ని ఉదాహరణలే చూద్దాం. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తాను ఆ స్థానంలో ఉండడం అనేది అదృష్టంగా భావించి.. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపన పడుతున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలో సహజంగా ఉండే చిన్నచూపు లాంటి ఇబ్బందులు ఆయనకు పుష్కలంగానే ఉన్నా.. ఎంపీగా తన నియోజకవర్గంలో తన ముద్ర చూపించడానికి ఎంతెంతో కష్టపడుతున్నారు. అలాంటి నాయకుడిని హటాత్తుగా షిఫ్ట్ చేసి సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ అసమర్థుడుగా పేరుతెచ్చుకున్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీగా ప్రకటించారు. అలాగని గురుమూర్తికి సత్యవేడు సొంత నియోజకవర్గం కూడా కాదు. ఈ మార్పు పట్ల ఆయన నోరు మెదపలేదు. కానీ.. కోనేటి ఆదిమూలం.. జగన్ మీద అలిగి చంద్రబాబు పంచన చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో నిర్ణయాల్ని మార్చుకున్నారు. గురుమూర్తిని తిరుపతి ఎంపీగానే ఉంచి, సత్యవేడుకు మరొకరిని వెతుక్కున్నారు. ఏమిటీ తడబాట్లు.

కర్నూలు ఎంపీ సంగతి కూడా అంతే. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా ప్రకటించారు. ఆయన నియోజకవర్గంలో మీటింగులు పెట్టుకుని, ఎమ్మెల్యేగానే పోటీచేస్తానని, చివరి నిమిషం దాకా ఏమైనా జరగవచ్చునని బీరాలు పోయారు. పార్టీని బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఆయన తెలుగుదేశంలోకో, కాంగ్రెసులోకో వెళతారనే పుకార్లున్నాయి. ఈ నిర్ణయం కూడా జగన్ వెనక్కు తీసుకున్నారు. దీని అర్థం ఏమిటి? అక్కడి రాజకీయ సమీకరణాలను గౌరవించి నిర్ణయం మార్చుకున్నట్లా? లేదా, జయరాం ధిక్కారానికి, బెదిరింపునకు జడిసి నిర్ణయం మార్చుకున్నట్లా? ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి?

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిర్ణయాలు అనేకం ఉంటున్నాయి. ఈ తడబాట్లు పార్టీ ఇమేజిని పలుచన చేస్తాయి. ఒక నిర్ణయానికి అధినేత కట్టుబడి ఉండలేకపోతున్నారని, నిర్ణయాల్లో లోపాలుంటే ముందే గుర్తించలేకపోతున్నారని పార్టీ కార్యకర్తలు చులకనగా అనుకుంటారు. జగన్ వ్యూహకర్తల సలహాదారుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది అందరికీ తెలుసు. మరి పార్టీ పరువు, జగన్ పరువు ఉమ్మడిగా తీసేలా సలహాలు ఇస్తున్న ఇలాంటి వారిని ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నారు.. అనేది కార్యకర్తలకు, నాయకులకు కలుగుతున్న సందేహం.

సలహాదారులు ఏం పనిచేస్తున్నారో… ఏరకంగా పార్టీ స్థిరత్వానికి ఉపయోగపడుతున్నారో జగన్ సమీక్షించుకోవాలి. ఉదాహరణకు ఒక ఎమ్మెల్యేను మరో ఎంపీ సీటుకు, ఒక ఎంపీని మరొక ఎమ్మెల్యే స్థానానికి మారుస్తున్నప్పుడు.. వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ పని చేసేంత అమాయకత్వం మూర్ఖత్వం ఉంటుందని అనుకోలేం. అయితే ఇలాంటి పని జగన్ స్థాయిలోనే జరగాలి. ఆ పనికి కూడా ఇతరుల మీద ఆధారపడడం.. అవతలి ప్రజాప్రతినిధిని చులకనచేయడం అవమానించడం అవుతుంది. అలాంటి నిర్ణయాలను జగన్ వారికి తెలియజెప్పిన తర్వాత.. అదే అభ్యర్థులతో సలహాదారులు వ్యక్తిగతంగా భేటీ అయి.. ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో.. పార్టీ ప్రయోజనాలకు ఏ రకంగా అది అవసరమో.. పార్టీకోసం, పునరధికారం కోసం ఏ రకంగా వారు ఆ నిర్ణయాన్ని గౌరవించాలో.. తెలియజెప్పాలి. కన్విన్స్ చేయాలి. కానీ అలాంటి ప్రయత్నం కనిపించడం లేదు.

నిర్ణయాలు ప్రకటించేయడమూ.. అలిగిన వారిని బుజ్జగించడమూ జరుగుతోంది. ఆ రకంగా పార్టీ పరువు మొత్తం బజార్న పడుతోంది. ఇలాంటి కసరత్తు జరగడం వలన అలగక ముందే పరిస్థితుల్ని చక్కదిద్దినట్లు అవుతుంది. ఆ సంగతి తెలుసుకోవాలి. 

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని వ్యవహారం సలహాదారుల వైఫల్యానికి పరాకాష్ట. ఒకే వ్యక్తితో ముడిపడిన వ్యవహారాన్ని ఇన్ని రోజులు, వారాల పాటూ సాగతీయడం అనేది జగన్ వైఫల్యం. ఇంత సాగతీత రాజీ చర్చలు.. జగన్ కు పార్టీ మీద ఉన్న పట్టును ప్రశ్నార్థకం చేసేస్తున్నాయి. బాలినేనితో వ్యవహారాన్ని సాగతీస్తున్న కొద్దీ.. బంధువు గనుక జగన్ జంకుతున్నారని, బాలినేని లేకపోతే ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారని రకరకాల పుకార్లకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది.

వేగిరం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో జాప్యం వల్ల ఒక్కోసారి చాలా పెద్ద చేటు జరుగుతుంది. ఇళ్లపట్టాలకు నిధులు విడుదల చేయాలని బాలినేని పట్టుపట్టారు. జగన్ నిధులు విడుదల చేశారు. కానీ.. మద్యలో చాలా ఆలస్యం అయింది. ఈలోగా వ్యవహారం రచ్చరచ్చ అయింది. బాలినేని మీడియా ముఖంగా కాకుండా, వ్యక్తిగతంగా అడిగిన తొలి సందర్భంలోనే ఆ నిధుల విడుదల జరిగి ఉంటే.. పార్టీకి పరువునష్టం తప్పేది. ఇలాంటి అనాలోచిత పోకడలు తప్పకుండా పార్టీకి చేటు చేస్తాయి.

జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్న సలహాదారుల విషయానికి వస్తే..  రాజకీయేతర అంశం అయినప్పటికీ ఓ తాజా పరిణామం గురించి కూడా చెప్పుకోవాలి. కుమారి ఆంటీ మెస్ మూసివేత, తిరిగి తెరవడానికి సీఎం రేవంత్ అనుమతి- అనేది తాజాగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న అంశం. అయితే సీఎం రేవంత్ అనుమతిలవ్వడాన్ని కూడా తమ ఘనతగా వైసీపీ సోషల్ మీడియా దళాలు జగన్ వద్ద బిల్డప్పులు ఇచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.

విషయం ఏంటంటే.. గతంలో కుమారి ఆంటీ జగన్ కు అనుకూలంగా మాట్లాడిందని, ఆ కక్షతోనే రేవంత్ సర్కారు మూసేయించిందని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ లు ప్రచారం చేశాయి. కారణాలేవైనా రేవంత్ తిరిగి తెరవడానికి అనుమతిచ్చారు. తమ ప్రచారానికి జడిసి ఆయన తెరిపించారని వైసీపీ దళాలు మురిసిపోతున్నాయి. ఇలాంటి సిల్లీ విషయాలను కూడా తమ ఘనతగా జగన్ వద్ద చెప్పుకుంటూ తప్పుదారి పట్టిస్తున్నారని కూడా నాయకులు భావిస్తున్నారు.