జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. ఉద్యోగావకాశాలు కల్పిస్తాను అనే విషయంలో మాట తప్పారు. ఇన్నేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా డీఎస్సీ కూడా వేయనేలేదు.. అంటూ ప్రతిపక్షాలు మరియు పచ్చమీడియా పదేపదే ఊదరగొడుతూ వచ్చాయి.
తీరా ఇప్పుడు డీఎస్సీ వేయడం ద్వారా 6100 టీచరు ఉద్యోగాలను భర్తీ చేయడానికి జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. నోటిఫికేషన్ కు మంత్రిమండలి ఆమోదం తెలియజేస్తే పచ్చమీడియా మళ్లీ విషం కక్కుతోంది. ఈ నిర్ణయాన్ని కూడా భ్రష్టుపట్టించడానికి చూస్తోంది.
నాలుగేళ్లు డీఎస్సీ వేయకపోవడానికి సహేతుకమైన కారణాలు లేవు అని చెప్పలేం. ఎందుకంటే.. విద్యా విధానంలో జగన్ సర్కారు విప్లవాత్మకమైన అనేక మార్పులను తీసుకువచ్చింది. ఎలిమెంటరీ తరగతుల నుంచి ఇంగ్లిషు మీడియం తీసుకువచ్చింది.
సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తోంది. ఐబీ సిలబస్ ను కూడా ఇప్పుడు ఆమోదించింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో స్కూలు విద్య అనేది దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను అందుకుంటుందనేది నిజం. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రమాణాలతో విద్య మరెక్కడా అందుబాటులో ఉండబోదు అనేది కూడా నిజం.
అయితే ఈ ప్రమాణాలు నిర్ణయించిన తరువాత వాటికి తగినట్టుగానే టీచర్ల ఎంపిక ఉండాలి. ఆ ఉద్దేశంతోనే డీఎస్సీలు ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు తుది నిర్ణయాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతోంది. ఇదంతా కూడా విద్యావ్యవస్థను మెరుగుపరిచే ప్రక్రియలో భాగమే. అయితే.. పచ్చమీడియా డీఎస్సీ నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ద్వారా జగన్ కు మంచి పేరు వస్తుందనే ఏడుపు చూపిస్తోంది. జగన్ ను తిట్టడానికి ఒక అవకాశం మిస్సయిందనే దుగ్ద వారిలో కనిపిస్తోంది.
నాలుగేళ్లు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చినా సరే.. స్థిరమైన ఉద్యోగాల కల్పనకే కదా. ఇదేమీ చంద్రబాబులాగా.. ఎన్నికలకు నెల ముందు.. పసుపు కుంకుమ పేరుతో డబ్బు పంచి పెట్టే నీచమైన ఎత్తుగడ కాదు కదా. జగన్ సంక్షేమ పథకాలు తొలి ఏడాది నుంచి ఏవి ఉన్నాయో అవే కొనసాగుతున్నాయి. ఉద్యోగాల కల్పన విషయంలో డీఎస్సీ ఇప్పుడు వస్తోంది. ప్రభుత్వాన్ని అభినందించడానికి బదులుగా.. పచ్చ మీడియా నీచమైన విమర్శలకు దిగుతున్నదని ప్రజలు తలపోస్తున్నారు.