నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ..ఆయన స్థానంలో అభ్యర్థి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ బరిలో దిగనున్నారు. ఆర్థికంగా బలవంతుడైన నారాయణను ఎదుర్కోవాలంటే వేమిరెడ్డి కుటుంబం మినహాయిస్తే, మరెవరూ తట్టుకోలేరని వైసీపీ భావన. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ పదవీ కాలం కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది. ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేయనున్నారు. నెల్లూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ప్రశాంతిని నిలబెడితేనే మరోసారి గెలుపు అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.
నెల్లూరులో వేమిరెడ్డి సామాజిక వర్గం బలంగా వుంది. వేమిరెడ్డి అజాత శత్రువుగా పేరు పొందారు. వివాద రహితుడు. పేదలకు సాయం చేసే నాయకుడిగా గుర్తింపు పొందారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతి కూడా సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక సంస్థల్లో ప్రశాంతి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నెల్లూరు అసెంబ్లీ బరి నుంచి నిలిపితే మంచి ఫలితాలు వుంటాయని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నారు. అయితే వేమిరెడ్డితో విభేదాలున్న మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాత్రం మరొకరిని తెరపైకి తెస్తున్నారని తెలిసింది. ఏది ఏమైనా వేమిరెడ్డి ప్రశాంతి వైపే వైసీపీ నేతలు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.