ఏపీ రాజకీయాల్లో షర్మిల కేంద్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకుని, అక్కడి రాజకీయ పార్టీల నేతలను షర్మిల తిట్టని తిట్టు లేదు. పాలేరులో పోటీ చేస్తానని అక్కడి మట్టి సాక్షిగా ఆమె ప్రగల్భాలు పలికారు. ఏమైందో అందరికీ తెలిసిందే. తప్పని సరి పరిస్థితుల్లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొత్త అవతారమెత్తారు. తన అన్న ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వంద తిట్లలో కనీసం 10 తిట్లైనా చంద్రబాబుపై లేకపోతే, జనం నమ్మరని ఆమె గ్రహించారు. దీంతో జగన్‌పై 90 తిట్లు తిట్టి, ఓ 10 చంద్రబాబుపై ఏదో అలా నోరు పారేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రెండు మూడు రోజులుగా షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి వుందంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తెగ బాధపడి పోతోంది. వీళ్ల ఆవేదన చూస్తోంటే… షర్మిలకు టీడీపీ నుంచే ముప్పు పొంచి వుందనే అనుమానాలు వైసీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో షర్మిల ప్రాణాలకు ఏదైనా కీడు తలపెట్టే పనికి పాల్పడి, ఆ నిందను జగన్‌పై వేసి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రకు పాల్పడుతున్నారనే అనుమానం వైసీపీలో కలుగుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులే కేసులో ఉండడంతో, షర్మిలకు హాని తలపెట్టి, దాన్ని జగన్‌పై నెట్టేస్తే జనం నమ్ముతారని టీడీపీ వ్యూహంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. షర్మిల ప్రాణాలపై టీడీపీ నేతలు ఆరోపణలు, ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించడాన్ని గమనిస్తే… లైట్‌గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగట్టేందుకు టీడీపీ వెనుకాడదని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు షర్మిలకు భద్రత కుదించారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల అస్త్రాన్ని జగన్‌పై ప్రయోగించి, భారీగా రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకు షర్మిల వ్యవహార శైలి కూడా దోహద పడుతోంది.
అయితే షర్మిల ప్రాణాల విషయంలో టీడీపీ కుట్రల్ని వైసీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారీ తప్పు చేసినట్టే. గతానుభవాల దృష్ట్యా షర్మిల రక్షణ బాధ్యతను వైసీపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షర్మిలకు టీడీపీ నుంచే ప్రమాదం పొంచి వుందనే సంకేతాలు పరోక్షంగా వెల్లడవుతున్నాయి కాబట్టి.