జ‌గ‌న్ దిద్దుబాటు.. వైసీపీ వెరీ హ్యాపీ!

అభ్య‌ర్థుల ఎంపిక‌లో భాగంగా దొర్లిన త‌ప్పుల్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌రిదిద్దుకుంటున్నారు. ఇందులో భాగంగా తిరుప‌తి ఎంపీ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తినే ఎంపిక చేయ‌డం విశేషం. నాలుగో జాబితాలో స‌త్య‌వేడు ఎమ్మెల్యే…

అభ్య‌ర్థుల ఎంపిక‌లో భాగంగా దొర్లిన త‌ప్పుల్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌రిదిద్దుకుంటున్నారు. ఇందులో భాగంగా తిరుప‌తి ఎంపీ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తినే ఎంపిక చేయ‌డం విశేషం. నాలుగో జాబితాలో స‌త్య‌వేడు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి పేరు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తిరుప‌తి లోక్‌స‌భ ప‌రిధిలో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ అభివృద్ధి ప‌నులు చేసిన ఏకైక పార్ల‌మెంట్ స‌భ్యుడిగా గురుమూర్తి మంచి పేరు సంపాదించుకున్నారు.

అవినీతికి దూరంగా, ప్ర‌జ‌ల‌కు చేరువైన ఎంపీగా గురుమూర్తి గుర్తింపు, గౌర‌వం పొందారు. పేద కుటుంబానికి చెందిన గురుమూర్తి నిత్యం ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌రిత‌పిస్తాడనే మంచి పేరు సాధించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను స‌త్యవేడు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డంపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెల‌కుంది. గురుమూర్తి విష‌యంలో రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

ప‌నిమంతుడు, వివాద ర‌హితుడైన గురుమూర్తిని కొన‌సాగించ‌కుండా, స‌త్య‌వేడుకు పంపాల్సిన అవ‌స‌రం ఏంట‌నే విమ‌ర్శ బ‌లంగా ముందుకొచ్చింది. గురుమూర్తి విష‌యంలో వైసీపీ అధిష్టానం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటే బాగుంటుంద‌నే సూచ‌న‌లు పార్టీ పెద్ద‌ల‌కు వెల్లువెత్తాయి. ఇదే స‌మ‌యంలో స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఆదిమూలం త‌న‌కు తిరుప‌తి ఎంపీ సీటు వ‌ద్ద‌ని, పార్టీపై ధిక్కారాన్ని ప్ర‌క‌టించారు.

ఇదే గురుమూర్తికి క‌లిసొచ్చింది. స‌త్య‌వేడు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నూక‌తోటి రాజేష్‌ను ఎంపిక చేశారు. గురుమూర్తిని తిరిగి తిరుప‌తి లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయించ‌నున్న‌ట్టు ఐదో జాబితాలో ఆయ‌న పేరు ప్ర‌క‌టించడం విశేషం. దీంతో అభివృద్ధిని ఆకాంక్షించే ప్ర‌తి ఒక్క‌రూ వైసీపీ అధిష్టానం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ‌ళ్లీ గురుమూర్తి విష‌యంలో త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డాన్ని పార్టీ శ్రేణులు ప్ర‌శంసిస్తున్నాయి.