ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలు రచిస్తుంటాయి. ముఖ్యంగా బలహీనమైన అభ్యర్థిని ప్రత్యర్థిగా కోరుకోవడం సహజం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏర్పడింది. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిలప్రియకే తిరిగి టికెట్ దక్కితే బాగుంటుందని వైసీపీ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌రెడ్డి కోరుకుంటున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ అయితే… కళ్లు మూసుకుని ఇంట్లో కూచున్నా గెలిచిపోవచ్చని ఎమ్మెల్యే భావిస్తున్నారు.
తాజాగా భూమా కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అఖిలప్రియకు, భూమా కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రకటించారు. అఖిలప్రియ తమ ఇంటిపేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవడాన్ని భూమా కుటుంబ సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. ఈ దఫా ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్ కిషోర్‌కుమార్‌రెడ్డి బరిలో వుంటారని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది.
మద్దూరి అఖిలప్రియకు భూమా ఇంటి పేరుతో సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు. భూమా కుటుంబంలో నెలకున్న విభేదాలు రచ్చకెక్కడంతో ప్రత్యర్థులు ఖుషీ అవుతున్నారు. రాజకీయంగా, కుటుంబ పరంగా అఖిలప్రియ ఒంటరయ్యారు. ఇటు తండ్రి వైపు నుంచి అసలు భూమా ఇంటి పేరుతో అఖిలప్రియకు సంబంధమే లేదని తేల్చి చెప్పగా, అటు తల్లి వైపు నుంచి కూడా ఆమెకు ఎవరూ అండగా లేరు.
అఖిలప్రియ మేనమామ ఎస్వీ మోహన్‌రెడ్డి కుటుంబం వైసీపీలో వుంది. మరో మేనమామ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇటీవల అఖిలప్రియ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. దీంతో ఎస్వీ కుటుంబం ఆమెపై ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇంట గెలవని అఖిలప్రియకు టికెట్ ఇస్తే… గోవిందా అని టీడీపీ సర్వే నివేదికలు ఇప్పటికే చంద్రబాబుకు తెలియజెప్పాయి. అయితే అఖిలప్రియకే టికెట్ రావాలని ఆమె ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌రెడ్డి కోరుకుంటున్నారు. ఇందుకోసం ఆయన దేవుళ్లందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు….ఆళ్లగడ్డలో రాజకీయ పరిస్థితుల్ని.
మరోవైపు ఆళ్లగడ్డలో తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ సీటును జనసేనకు కేటాయించే అవకాశం వుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తద్వారా అఖిలప్రియకు చెక్ పెట్టే ఎత్తుగడను చంద్రబాబు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం రక్త సంబంధీకులతో కూడా సఖ్యతగా లేకపోవడం వల్ల అఖిలప్రియ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది.