ఇది వరకటి లాగా కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం ఠాగూర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఫాలో అయ్యేవారికి బాగానే తెలుసు. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు వెల్లువెత్తించేవరకు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలకు ఆయన ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ వ్యవహారాలను చూస్తున్నారు.
అలాంటి మాణిక్యం ఠాగూర్.. ఇప్పుడు తన వ్యాఖ్యలు చేతలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన ముద్ర చూపిస్తున్నారు. తెలంగాణలో కేటీఆర్ మీద కోర్టు కేసుకు సిద్ధపడుతూ, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద దుస్సాహసంతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలవడం గమనార్హం.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవిని పొంది, ప్రస్థానం సాగించిన తొలిరోజుల్లో.. అక్కడ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ నే. ఆయన అండదండలు రేవంత్ కు పుష్కలంగా ఉన్నాయనే పుకార్లుండేవి. పార్టీ లోనే రేవంత్ ను వ్యతిరేకించే వాల్లంతా మాణిక్యం ఠాగూర్ ను కూడా వ్యతిరేకిస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మారింది. ఆయనను మార్చేశారు. అయితే.. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నాయకుడు కేటీఆర్ తాజాగా మళ్లీ మానిన గాయాన్ని రేపుతున్నట్లుగా తన పేరు ప్రస్తావించి విమర్శలు చేసేసరికి మాణికం కు కోపం వచ్చింది.
ఇటీవల కేటీఆర్ ఓ సభలో ‘ఢిల్లీ మేనేజిమెంట్ కోటా’ కింద రేవంత్ రెడ్డి ముడుపులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నారంటూ.. తనను ఉద్దేశించి ఆరోపణలు చేశారని మాణిక్యం ఠాగూర్ అంటున్నారు. ఈ మేరకు ఆయన కేటీఆర్ కు నోటీసు కూడా పంపారు. దానికి కేటీఆర్ నుంచి సంజాయిషీ వచ్చినా రాకపోయినా.. ఆయన మీద కోర్టులో పరువునష్టం దావా నడిపే ఉద్దేశంతో ఉన్నారు.
అటు ఏపీ రాజకీయాల్లో కూడా మాణిక్యం ఠాగూర్ తనదైన ముద్ర చూపించేలా కొత్త వివాదానికి తెరతీస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యవహారాలకు ఆయనే ఇన్చార్జి. ఆయన తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక వ్యాఖ్య చేశారు. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగలబోతున్నారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వైసీపీలో మార్పుచేర్పుల పర్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలకలు వహించిన ముగ్గురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేశారు. తమ భవిష్యత్తు రాజకీయం గురించి సమాలోచనలు చేసుకుంటున్నారు. మరికొందరు ఎంపీలను రాబోయే ఎన్నికల సమయానికి ఎమ్మెల్యేలుగా బరిలో నిలబెట్టడానికి జగన్ నిర్ణయించారు.
అయితే మాణిక్యం ఠాగూర్ తన వ్యాఖ్యల్లో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే వైసీపీలో మిగలతారని అనడం తమాషాగా ఉంది. 22మంది ఎంపీలను గెలిచిన వైసీపీలో ముగ్గురు ప్రస్తుతానికి వెళ్లినా, మిగిలేది ముగ్గురే అని ఎలా అనగలుగుతున్నారో మరి. వైసీపీలో ఉన్న ఎంపీలకు మాణికం ఎర వేస్తున్నారా? ఆయన ఎరకు పడేవారు ఉన్నారా? అనే చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.