గులాబీ దళపతిలో సమరోత్సాహం మిగిలుందా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనేది భారత రాష్ట్ర సమితి నాయకులకు అనూహ్యం అయి ఉండకపోవచ్చు గానీ.. వారు దానిని జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిజం. సహించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఈ…

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనేది భారత రాష్ట్ర సమితి నాయకులకు అనూహ్యం అయి ఉండకపోవచ్చు గానీ.. వారు దానిని జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిజం. సహించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఈ ప్రభుత్వాన్ని బొందపెడుతున్నారని, వందరోజుల్లోనే కూలిపోతున్నదని.. తమ ఊహల్లో కలల్లో మెదలుతున్న విషయాలు అన్నింటినీ వారు ప్రసంగాల రూపంలో వెలిబుచ్చుతున్నారు.

అయితే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రేవంత్ సర్కారు ప్రజాదరణ తగ్గిందని నిరూపించడానికి గులాబీ దళాలకు ఇదొక అవకాశం. దీనిని వారు సమర్థంగా వాడుకోవాలనే చూడొచ్చు. ఎంపీ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోరాడవచ్చు.

కానీ, గులాబీ దళపతి పరిస్థితి ఏమిటి? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో, ఖచ్చితంగా కేంద్రమంత్రిగా మళ్లీ వెలగాలని, కుదిరితే ప్రధాని పదవికి తానొక అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో తన తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత ముద్రతో జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ లో అప్పటి సమరోత్సాహం ఇంకా మిగిలి ఉన్నదా? ఈ ఎంపీ ఎన్నికల్లో ఆయన భారాసను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ముందుకు నడిపించడానికి పూనుకోబోతున్నారా? అనేది సందేహంగా ఉంది.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఆ పదవిని కేసీఆర్ ఇవాళ స్వీకరించబోతున్నారు. తుంటిఎముక విరగడంతో, సర్జరీ చేయించుకుని మంచానికి, విశ్రాంతికి పరిమితమైన కేసీఆర్.. మొత్తానికి ఇవాళ అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో ప్రజలకు కొంత అవగాహన కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఆయనకు తుంటిఎముక సర్జరీ చేసినప్పుడు.. కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరం ఉంటుందని వైద్యులు అప్పట్లో ప్రకటించారు. కానీ.. ఇప్పుడు రెండునెలలు పూర్తి అవుతుండగా ఆయన వచ్చి పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్నారు. ఆయన ఎంత మేర ఆరోగ్యంగా, ఎంత మేర సమరోత్సాహంతో ఉన్నారో ఈరోజున కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా ప్రమాణం తర్వాత.. కేసీఆర్ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.  కుదిరితే పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది.

గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కేసీఆర్ అసెంబ్లీ వద్ద మీడియాతో క్లుప్తంగా మాత్రమే మాట్లాడతారని తెలుస్తోంది. కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందనే సామెత చందంగా.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోతున్న సందర్భంలోనే కేసీఆర్ మాటలను బట్టి.. రాబోయే రెండు మూడు నెలల్లో ఆయన ఎంత మేర యాక్టివ్ గా ఉండబోతున్నారు.. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారో అర్థమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.