గత కొన్నాళ్లుగా వార్తల్లో వెలిగి, కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్న వ్యక్తి కుమారి. ఈమె హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్ కి ఎదురుగా ఒక స్ట్రీట్ ఫుడ్ క్యాంటీన్ నడుపుకుంటోంది. సోషల్ మీడియా పుణ్యమా అని పాపులరైపోయింది. ఆమె క్యాంటీన్ వద్ద జనం గుమిగూడడం, ట్రాఫిక్ జాములౌతున్నాయి కాబట్టి ఆమెని ఆ క్యాంటీన్ ను అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు ఆదేశించడం ..ఇవన్నీ తెలిసిన విషయలే.
అయితే ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఆఫీషియల్ గా స్పందించడం, ఆమెను అదే స్థలంలో యథాతధంగా వ్యాపారం చేసుకోమని చెప్పడం, మరో రెండు మూడు రోజుల్లో ఆమె క్యాంటీన్ ను కూడా సందర్శిస్తానని ప్రకటించడం జరిగిపోయాయి.
దీనికి స్పందిస్తూ సోషల్ మీడియాలో పలువురు ఈ విధంగా కామెంట్లు పెడుతున్నారు!
– ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తాం. మన సీయం నిజంగా హీరో.
– అమ్మా కుమారి! రేవంతన్న ఫోటో నీ షాపులో పెట్టుకో. నిన్ను ఇంక ఎవ్వడూ ఏమీ చేయలేడు.
– సీయం స్పందన చూస్తే కళ్లవెంట నీళ్లొస్తున్నాయి. నిజంగా పేద వ్యాపారుల్ని ఇలా పట్టించుకునే సీయం రాష్ట్రానికి అవసరం.
– మనసున్న మారాజు మా రేవంతన్న
– పాత సీయం ఉన్నోళ్లకే!!..ఈయన పేదల సీయం.
– రేవంతన్నకి నాటుకోడి పులుసు ఇష్టం. నీ క్యాంటీనికి వచ్చినప్పుడు అది వండి పెట్టమ్మా!!
ఇలాంటి పోస్టులు, కామెంట్లు కోకొల్లలు. కుమారి ఆంటీ కూడా స్పందిస్తూ, “ఇది కదా ప్రజా పాలన అంటే..” అంది.
ఇదంతా సగటు అరవ సినిమాలోని సీనులాగే ఉంది. ఎమోషన్ తప్ప ఆలోచన, చట్టం, న్యాయం, పద్ధతి, బాధ్యత..ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా పెడుతున్న పోస్టులవి.
సోషల్ మీడియాలో నలుగుతున్న అంశంపై సీయం రేంజ్ వ్యక్తి స్పందించడం వెనుక మతలబేంటి? ఆయన స్పందనలో, తీర్పులో న్యాయమెంత? చట్టబద్ధత ఎంత? ఒక్కసారి చెప్పుకుందాం.
ఈ టాపిక్ రేవంత్ రెడ్డిపైనో, కుమారి ఆంటీపైనో వ్యతిరేకతతో కూడిన ఆలోచన కాదు. కేవలం డిస్కషన్ కోసం, ప్రజాస్వామ్యబద్ధమైన అవగాహన కోసం మాత్రమే అని వీక్షకులకి మనవి.
ఐటీసీ హోటల్ యాజమాన్యం కావొచ్చు, ఆ రోడ్డుపైన ఉన్న ఇతర పెద్ద వ్యాపారాలు కావొచ్చు..వాళ్లు ఆయా భూముల్ని కోట్లు పోసి కొని, వ్యాపారాలు చేసుకుని ట్యాక్సులు కడుతూ వేల మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్తున్నారు.
సరిగ్గా అదేరోడ్డులో వారికి ఎదురుగానో, పక్కగానో ఉన్న ఖాళీ స్థలంలో స్ట్రీట్ ఫుడ్ పేరుతో అనుమతుల్లేకుండా వ్యాపారం పెట్టేసుకోవడం ఎంత వరకు కరెక్ట్?
పోనీ ఆ వ్యాపారం ద్వారా జీ.హెచ్.ఎంసీ కి గానీ, ఆదాయపు పన్ను గానీ, జె.ఎస్.టీగానీ కడుతున్న పరిస్థితి ఉందా? రోజుకి రెండు గంటల్లో 100 కేజీల అన్నాన్ని రకరకాల నాన్-వెజ్ వంటకాలతో అమ్మేసే ఆవిడ ఆదాయం ఎంతుంటుంది? ఆమె సొంతంగా ఒక ప్లేసుని రెంట్ కి తీసుకుని వ్యాపారం చేసుకోలేదా? ఆమె ఇల్లు, వాకిలి, కట్టు బొట్టు బిలో మిడిల్ క్లాసు లెవిల్లో ఉంటే ఆమెపై సీయం గారు కరుణ కురిపించి మహరాజులాగ అదే భూమిలో వ్యాపారం చేసేసుకోవచ్చని చెప్పేయడమేనా? ఇదెక్కడి ప్రజాస్వామ్యమండి?
ఇది ఒక్క కుమారి విషయంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతి స్ట్రీట్ ఫుడ్ వెండార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే కదా!
ఒకపక్క ప్రభుత్వానికి వీళ్ల ద్వారా ట్యాక్సులు, రెంట్లు రావా? ఇంకోపక్క ఇతర వ్యాపారులు మాత్రం పద్ధతిగా అన్నీ కట్టి వ్యాపారాలు చేసుకోవాలా?
ఫుడ్ కేటరింగ్ బిజినెస్సులో హీనాతిహీనపక్షం లాభం శాతం 100% అంటారు. అంటే రూ100 ఖర్చుకి రూ 200 వసూళ్లు చేయొచ్చు. ఖర్చులు పోను రూ 100 లాభమన్నమాట. ఆ లెక్కన చూసుకుంటే రోజుకి బస్తా బియ్యంతో పాటూ అనేకమైన నాన్-వెజ్ ఐటంస్ వగైరాలు వండి అమ్మే ఆవిడకి రోజువారీ ఖర్చు ఎంత? ఆదాయం ఎంత? లాభమెంత? ఒక అంచనా ప్రకారం ఎలా చూసుకున్నా ఈమె నెలకి లక్షల్లో సంపాదిస్తుందని ఎవ్వరైనా చెప్తారు. అంత సంపాదిస్తున్నప్పుడు ఆమెను పేద వ్యాపారస్తురాల్లా చూడడం దేనికి? చట్టాన్ని వర్తింపజేయకపోవడం ఎందుకు?
ఈమె పక్కన ఇదే తరహా రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. వారిలో ఒకావిడ, “టీ బండి నడుపుకుంటూ రోజుకి 2000-3000 మించి ఇంటికి పట్టుకెళ్లలేకపోతున్నాం. మీడియా వాళ్లు కుమారినే కాదు. మాకు కూడా న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి రేపు ఆమె షాపుకొచ్చి తినడం కాదు..మాకందరికీ కలిపి ఇక్కడ ఒక ఎకరం భూమి ఇచ్చేసి అందులో మమ్మల్ని వ్యాపారం నడుపుకోమంటే బాగుంటుంది” అని చెప్పింది.
రోజుకి 3000 అంటే నెలకి 90,000. ట్యాక్సులు కూడా కట్టరు. పాపం అక్కడికొచ్చి టీ తాగే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఎంతమందికి ఆ మాత్రం జీతముంటుంది. కానీ వాళ్లు మాత్రం 30000 వేలు సంపాదిస్తున్నా, 60000 సంపాదిస్తున్నా ట్యాక్సులు కడతారు. ఈ టీ బండి దగ్గర టీ తాగి పది రూపాయలిచ్చి గొప్పగా ఫీలౌతారు పాపం ఈ వెర్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈ లెక్క తెలిస్తే వాళ్లేమైపోతారు?
సింగీతం శ్రీనివాసరావు తీసిన “పుష్పక విమానంలో” ఒక సీనుంటుంది ఇలాగే. నిరుద్యోగి అయిన కమల్ హాసన్ జేబులోంచి రూపాయి బిళ్ల తీసి ఎదురుకుండా ఉన్న బిచ్చగాడికి కనిపించేలా టాస్ ఎగరేసి తన ఆత్మన్యూనతా భావాన్ని తగ్గించుకునే పని చేస్తాడు. కానీ ఆ బిచ్చగాడు పీ.ఎల్.నారాయణ తన జేబులోను, చిరుగుల చొక్కా మడతల్లోనూ, తాను కూర్చున గోనెపట్టా కిందా దాచుకున్న వేలాది నోట్లు చూపించి కమల్ ని వెక్కిరిస్తాడు. దాంతో కమల్ హాసన్ భంగపడి తనకంటే బిచ్చగాడే ఎన్నో రెట్లు బెటరుగా ఉన్నాడని తెలుసుకుని అక్కడి నుంచి బిక్కమొహంతో వెళ్లిపోతాడు. ఇక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ల, టీకొట్టు వాళ్ల ఆదాయాలు చూసి అలాగే ఫీలౌతారేమో.
అన్నట్టు అదే పక్క షాపావిడ మరొక షాకింగ్ విషయం నోరు జారి చెప్పి నీళ్లు నమిలింది. ఆమె తన కొట్టుకి రోజుకి రూ 800 రెంటు కడుతోందట.
“రెంట్ ఎవరికి కడుతున్నారు?” అని యాంకర్ తెలివిగా వెంటనే అడిగింది.
“ఎందుకులేవమ్మా..అవన్నీ చెప్పకూడదు. చెబితే మళ్లీ వాళ్లు గొడవకొస్తారు” అని నసిగింది ఈ వ్యాపారస్తురాలు.
అంటే ఇక్కడ ప్రతి షాపు నుంచి రోజూవారి రెంట్లు వసూలు చేసే రౌడీ ముఠా ఒకటుంది. ఇది ఇక్కడే కాదు..ప్రతి స్ట్రీట్ వెండర్ దగ్గర ఈ వసూళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇది ఓపెన్ సీక్రెట్. మరి రేవంత్ రెడ్డి ఈ వ్యాపారాలు ఇలాగే కొనసాగొచ్చని చెబితే ఆ రౌడీల చీకటి దందాని కూడా ప్రోత్సహిస్తున్నట్టే కదా!
అసలు వాస్తవమిదైతే సోషల్ మీడియాలో నెలకి 90000 నుంచి లక్షల్లో సంపాదించే వాళ్లని పేద వ్యాపారుల్లా చూడడం, ట్రాఫిక్ జాం పేరుతో పోలీసులు కేంటీన్ ని తొలగించడమంటే వాళ్ల మీద పడి ఇదెక్కడి ప్రజాపాలన అనడం, ముఖ్యమంత్రి కలగజేసుకుని ఆమెకు సపోర్టిస్తే “ఇదే ప్రజాపాలన” అని పొగడడం ఏమిటో ప్రజల అమాయకత్వం, గొర్రెమందతనం కాకపోతే!
ఈ పిచ్చిగోలకి వత్తాసు పలుకుతూ మెగా తమ్ముడు నాగబాబు కూడా ఒక పోస్ట్ పెట్టాడు. రేవంత్ రెడ్డి కలగజేసుకుని ఇలా కుమారికి సపోర్టివ్వాలని తాను అనుకున్నట్టే ఆయన సపోర్టివ్వడం బాగుందని రాసుకొచ్చాడు. ప్రతివాడు ఆలోచన లేని జనాల చప్పట్ల కోసం పరితపించేవాళ్లే తప్ప బుర్ర పెట్టి ఆలోచించి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించేవాళ్లు లేరు.
రేవంత్ రెడ్డి మాంసాహారప్రియుడు. ఎన్నికల ముందు రాజదీప్ సర్దేసాయ్ తో బ్రేక్ ఫాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా పొద్దున్న లేస్తూనే చికెన్, మటన్ దోసెల్లో నంజుకుని తింటున్న రేవంత్ ని చూసి ఆశ్చర్యం వ్యక్తపరిచాడు రాజదీప్.
రేపో మాపో రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ క్యాంటీన్ కి రావడం, ఆయన ఆ వంటకాల్ని లొట్టలేస్తూ తినడం, దానితో నెలకి లక్షలు సంపాదించే ఆ సగటు “పేద(?)” వ్యాపారస్తురాలికి అండగా నిలిచిన వ్యక్తిగా మైలేజి సంపాదించడం కూడా జరుగుతాయేమో.
హరగోపాల్ సూరపనేని