వైసీపీ ఒక్కో జాబితా వస్తోంది అంటే గుండె దడగానే ఉంటోంది. ఇంచార్జిల మీద కూడా ఇంచార్జిలు వస్తున్నారు. వారికి కూడా ఎన్నికల దాకా ఆ చాన్స్ ఉంటుందని నమ్మకం లేకుండా పోతోంది. వైసీపీ మూడవ జాబితాలో కనిపించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పేరు అయిదవ జాబితాకు వచ్చేసరికి మాయం అయింది.
మూడవ జాబితాలో ఆమెను అరకు అసెంబ్లీకి ఇంచార్జిగా నియమించారు. ఆ సంబరం నెల రోజులు అవనూ లేదు ఇంతలోనే మాయమైంది. ఆమెని మార్చి రేగం మత్స్య లింగాన్ని నియమించారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అన్న మాట. అది కూడా ఆయన ఇంచార్జిగా తన పనితీరు చూపిస్తేనే.
దీనికి కారణం అరకు వైసీపీలో రాజకీయ చిచ్చు రేగడమే. అరకు కి గొడ్డేటి మాధవి నాన్ లోకల్ గా ఉన్నారు. ఆమెని తెచ్చి తమకు ఇంచార్జిగా చేస్తే తాము పనిచేయమని వైసీపీలో రగడ ఒక స్థాయిలో చెలరేగింది. దాన్ని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినా కూడా వారు ఆగలేదు.
దాంతో హై కమాండ్ లోకల్ క్యాండిడేట్ గా ఉన్న రేగం మత్స్యలింగాన్ని తెచ్చి పెట్టింది. ఆయనకు ఈ నియామకం బాగానే ఉన్నా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సంగతేంటి అన్నది ఆమె అనుచరులకు సందేహంగా ఉంది. అరకు పార్లమెంట్ కి ఇంచార్జిగా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్షిని నియమించారు.
అలా ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎటూ లేదు, ఇపుడు ఆమెకు ఎమ్మెల్యే గా పోటీ చేసే చాన్స్ కూడా పోయింది. ఆమె పాడేరు ఎమ్మెల్యే సీటు కోరుతున్నారు అని ప్రచారంలో ఉంది. అక్కడ మత్స్యరాస విశ్వేశ్వరరావుని ఇంచార్జిగా నియమించారు. అలా ఏజెన్సీలో ఎక్కడా చూస్తే మాధవికి అవకాశం లేకుండా పోయింది.
ఆమెకు నచ్చచెప్పి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కీలకమైన నామినేటెడ్ పదవిని ఇస్తారని అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే పాతికేళ్ళకే ఎంపీ అయిన మాధవి కురు వృద్ధుడు లాంటి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర దేవ్ ని రెండున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడించి రికార్డు సృష్టించారు. పార్లమెంట్ లో అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఆమె రాజకీయ ఇన్నింగ్స్ ఇక్కడితే ఆగినట్లేనా అంటే చూడాలి.