61 సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది! ఐదు విడతలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 61 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 14 ఎంపీ సీట్లకు అభ్యర్థులను మార్చింది!
ఒక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 సీట్ల వరకూ అభ్యర్థులను మారుస్తుందంటే.. అది పెను ప్రకంపనలను పుట్టిస్తుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే అలాంటి పెను సంచలనాలు ఏమీ లేకుండానే ఏకంగా 61 సీట్లకు అభ్యర్థులను మార్చేయడం గమనార్హం!
సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో రచ్చ జరిగింది, నర్సరావుపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను ప్రకటించారు. తిరుపతి ఎంపీ సీటు విషయంలో మార్పు చేసినా, ఇదే సమయంలో సత్యవేడు ఎమ్మెల్యే బెదిరింపులను అయితే లెక్కలోకి తీసుకోలేదు. అక్కడ నూతన అభ్యర్థిని ప్రకటించేశారు. తిరుపతి బాధ్యతలను తిరిగి గురుమూర్తికి అప్పగించారు. బహుశా ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్లో అసంతృప్తితో ఉన్నది కర్నూలు ఇన్ చార్జే కాబోలు! 14 ఎంపీ సీట్లకు కూడా మార్పుచేర్పులను చేసేశారు!
151 మంది సిట్టింగుల విషయంలో ఇప్పటికే 61 మందిని మార్చేశారు, బదిలీలు చేశారు. 90 మ్యాజిక్ ఫిగర్ మాత్రమే ఇక మిగిలింది. ఇప్పటి వరకూ అభ్యర్థుల మార్పులు జరగని నియోజకవర్గాల విషయంలో ఇక పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశా నెక్ట్స్ జాబితాలో.. కొనసాగించబోయే సిట్టింగుల జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించేయవచ్చు!
11 ఎంపీ సీట్లకు 114 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల జాబితా వెల్లడి కావాల్సి ఉంది. వీటిల్లో చాలా వరకూ సిట్టింగుల కొనసాగింపు, ఇన్ చార్జిల కొనసాగింపు ఉండే అవకాశం ఉంది.