అవార్డ్ ఎఫెక్ట్.. మళ్లీ ‘చిరు’ ఊహాగానాలు

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై కథనాలు, ఊహాగానాలు తెలుగు ప్రజలకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఆయన విస్పష్టంగా ప్రకటన చేస్తూనే ఉన్నప్పటికీ, ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకున్న…

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై కథనాలు, ఊహాగానాలు తెలుగు ప్రజలకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఆయన విస్పష్టంగా ప్రకటన చేస్తూనే ఉన్నప్పటికీ, ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకున్న వేళ చిరంజీవి రాజకీయ పునఃప్రవేశంపై కథనాలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు కట్టబెట్టింది. దీంతో చిరంజీవిని తాజా రాజకీయాలతో ముడిపెడుతూ మరోసారి కథనాలు మొదలయ్యాయి.

రాజ్యసభకు చిరు..?

త్వరలోనే రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, తెలంగాణ నుంచి చెరో మూడేసి చొప్పున సీట్లు ఉన్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. ఉత్తర ప్రదేశ్ లేదా బిహార్ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

అలా రాజ్యసభకు పంపించి, చిరంజీవి రాజకీయ జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టేలా చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల బీజీపీకి వచ్చే లాభం ఒకటే. రాబోయే ఏపీ ఎన్నికలతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో చిరంజీవి సేవల్ని వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోందట.

చిరంజీవి సేవలు ఫలించి, బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చే ఆలోచనలో కమలనాధులు ఉన్నట్టు సాక్ష్యాత్తూ నేషనల్ మీడియా స్టోరీలు అల్లేస్తోంది.

చిరు మనసులో ఏముందో.. ప్రస్తుతం పద్మవిభూషణ్ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి. ప్రతి రోజూ తన ఇంటికొస్తున్న ప్రముఖుల్ని కలుస్తూ, వాళ్ల శుభాభినందనలు అందుకుంటూ, బిజీగా ఉన్నారు. రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు.

మొన్నటివరకు ఆయన రాజకీయాలకు దూరం. మరోసారి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, తను ప్రస్తుత పాలిటిక్స్ కు సెట్ కానని కూడా చిరు ప్రకటించుకున్నారు. తను సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీలోనే ఉంటానని కూడా ఆయన గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అలాంటి వ్యక్తి మనసు మార్చడంలో బీజేపీ పూర్తిగా సక్సెస్ అయిందంటున్నారు కొంతమంది. అయితే చిరంజీవి మాత్రం ఇంకా బయటపడలేదు. తన మనసులో మాటను బయటపెట్టలేదు.

సినిమాల సంగతేంటి.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో స్పీడ్ పెంచారు చిరు. వాల్తేరు వీరయ్య సక్సెస్ ఆయనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మధ్యలో భోళాశంకర్ లాంటి డిజాస్టర్లు వచ్చినా వాటిని ఆయన పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా విశ్వంభర సినిమాను స్టార్ట్ చేశారు.

ఆయన ప్రస్తుతం విశ్వంభర పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు పూర్తిస్థాయిలో కాల్షీట్లు కేటాయించే ఉద్దేశంలో కూడా ఉన్నారు. త్వరలోనే మరో ప్రాజెక్టు ప్రకటించే ఆలోచన కూడా ఉంది. ఇలాంటి టైమ్ లో పద్మవిభూషణ్ అవార్డ్ రావడం, ఆయన రాజకీయ పునఃప్రవేశంపై వెల్లువలా కథనాలు రావడం చకచకా జరిగిపోయాయి.

మరి ఈసారి మెగాస్టార్ ఏం చేయబోతున్నారు? దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ ఊపందుకున్న వేళ తన పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి మరోసారి ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది ఆయన ఇష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రకటన చేయడం అత్యవసరం.