తన పేరు షర్మిల కాదన్నట్టుగా రాజశేఖర రెడ్డి బిడ్డ అని పదే పదే చెప్పుకుంటున్నారు షర్మిల. అసలు తన పేరును ఆమె చెప్పడం లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డ.. రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నారు. ప్రతి వాక్యం చివరా ఈ మాట తప్పనిసరిగా వాడుతున్నారు!
మొన్నటి వరకూ తెలంగాణ కోడలు అన్నప్పుడు ఆమె రాజశేఖరరెడ్డి బిడ్డ అంటూ ఇంత విరివిగా చెప్పుకునే వారు కాదు! ఇప్పుడే.. ఇది తీవ్రమైంది!
మరి రాజశేఖర రెడ్డి బిడ్డను అని ఇలా ఒకటికి వెయ్యి సార్లు చెప్పుకుని.. ఏమైనా ఓట్లను పొందాలని షర్మిల భావిస్తున్నట్టుగా ఉంది. ఆ సంగతలా ఉంటే.. పులికి పులే పుడుతుందంటూ కూడా ఆమె స్టేట్ మెంట్ లు దంచుతున్నారు!
మరి షర్మిల తనను తాను పులిగా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి డైలాగులు వేసి కామెడీ అయిపోతున్నారు. అందులోనూ ఆమె గత కొన్నాళ్ల రాజకీయంలోనే మార్చిన మాటలు, వేసిన అడుగులు పచ్చిగా ఉండగానే ఇలా పులి, సింహం అనుకోవడం మరింత కామెడీ!
తెలంగాణలో పొలిటికల్ పార్టీని పెట్టి షర్మిల ఇష్టానికి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అయితే ఆమె అనని మాటంటూ లేదు! కాంగ్రెస్ లోకి పార్టీని విలీనం చేశాడంటూ చిరంజీవిని కూడా ఎద్దేశా చేశారు షర్మిల! అది అసంబద్ధంగా! చిరంజీవి ఏమీ యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు. తెలంగాణ రాజకీయంలో అయితే అసలే మాత్రమూ సంబంధం లేదు! అయినా తన నోటికి హద్దుల్లేవని నిరూపించుకోవడానికి షర్మిల చిరంజీవి చేసిన విలీనాన్ని కూడా తెగ ఎద్దేవా చేశారు.
కట్ చేస్తే ఆ తర్వాత ఈమెదీ అదే కథ! కాంగ్రెస్ నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు, తెలంగాణలో రాజకీయమన్నారు, తెలంగాణ కోడల్ని అన్నారు, చివరకు తను కాంగ్రెస్ లోకి విలీనమై, ఇప్పుడు తెలంగాను అనాథగా వదిలేసి, రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నారు!
మొన్నటి వరకూ తెలంగాణ కోడలు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ.. పులికి పులే పుడుతుందంటూ షర్మిల చెప్పడం వాస్తవమే కానీ, ఇలా రంగులు మారిస్తే దాన్ని ఊసరవెల్లి అంటారని ఆమె గ్రహించలేకపోతున్నట్టుగా ఉంది!