టీడీపీ అధినేత చంద్రబాబు స్టైలే వేరు. ఆయన ఏ విషయంలో అయినా రాజకీయాన్ని నిండుగా చూడగలరు. సందర్భం ఏదైనా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలరు. అది భోగీ పండుగ కానీ సంక్రాంతి అవనీ రిపబ్లిక్ డే అవనీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే కానీయ్. కానీ వాటితో ముడిపెడుతూ జగన్ మీద చెడుగుడు ఆడడం అంటే బాబుకు మహా ఇష్టం.
అందుకే ఆయన మహాత్ముని వర్ధంతిని కూడా అసలు వదలలేదు. మహాత్ముని వర్ధంతికి బాబు ఇచ్చిన నివాళిలో కూడా వైసీపీ ప్రస్తావన ఉండడం అంటే బాబు టాలెంట్ కి మురిసిపోవాల్సిందే. దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన దేశభక్తులను ఈ రోజున తలచుకోవాలని బాబు అంటూనే బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు ఆనాడు మహాత్ముడు అనుసరించిన మార్గంలోనే నేడు పోరాటం చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
అలా పోరాటం చేసి ఏపీలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలని బాబు ముక్తాయింపు ఇచ్చారు. మంచికి మద్దతు పలుకుతూ బాపూజీ కోరుకున్న రామ రాజ్యం స్థాపనకు మనమంతా కృషి చేయాలని చంద్రబాబు అంటున్నారు అదే గాంధీకి అంతా ఇచ్చే నివాళి అని ఆయన తెలియచేశారు.
ఇదొక్కటేనా ఏ పండుగ వచ్చినా ఆ పండుగకు అన్వయిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని దునుమాడడమే బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. నిజానికి ఏ విషయం అయినా సూటిగా చెప్పకుండా అందులో ఏదో రకంగా వైసీపీని తీసుకుని వస్తే కానీ బాబుకు నిద్ర పట్టదు అని అధికార పార్టీ వారు అంటున్నారు. బాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఏ సందర్భానికి తగినట్లుగా అలా మాట్లాడడం ఆయనకు తెలియనిది కాదు. కానీ అందులో కూడా ఏ మాత్రం చాన్స్ ఉన్నా వైసీపీ మీద విమర్శ చేస్తే అది జనాలకు గుర్తుంటుంది అన్నదే ఆయన తాపత్రయం.
ఇలా దేశంలో ఎవరూ ఏ పండుగ వేళ కానీ ఏ సందర్భం వేళ కానీ ట్వీట్లు వేసిన దాఖలాలు ఉండవు. ఎందుకంటే అందరూ బాబు మాదిరి కాదు. ఆ టాలెంట్ ఒక్క బాబుకే సొంతం. ఏది ఎలా చెప్పుకున్నా బాబు లాంటి వారు ఉండాల్సిందే. ఆయనను వైసీపీ నేతలు ఏమైనా అనవచ్చు. కానీ బాబు లాంటి వారు లేకపోతే ఇలాంటివి ఎవరూ పదే పదే చెప్పుకోరు కదా. సో ఆయన ఉండాల్సిందే.