నూతిలో గొంతుకగా ప్రత్యేక హోదా నినాదం!

ఏపీకి ప్రత్యేక హోదా కావాలా వద్దా అంటే జనాలు అదేమిటి అసలు అని అడిగే పరిస్థితి. అదేదో ఈవీవీ సత్యనారాయణ సినిమాలో ఏవీఎస్ బ్రహ్మానందం మధ్య ఒక కామెడీ సీన్ ఉంటుంది. టైమెంత అని…

ఏపీకి ప్రత్యేక హోదా కావాలా వద్దా అంటే జనాలు అదేమిటి అసలు అని అడిగే పరిస్థితి. అదేదో ఈవీవీ సత్యనారాయణ సినిమాలో ఏవీఎస్ బ్రహ్మానందం మధ్య ఒక కామెడీ సీన్ ఉంటుంది. టైమెంత అని ఏవీఎస్ అడిగితే బ్రహ్మానందం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొడుతూనే ఉంటాడు.

అలా ఎప్పటి హోదా ఎప్పటి కధ. ఈ రోజుకు కూడా దాని పేరు చెబుతూ ఉంటే వింటున్న జనాలకు విసుగు పుట్టదా. ఇంతకీ హోదాను ఇప్పుడు తెచ్చి ఏమి చేసుకోవాలని కూడా తెలివైన వారు అడుగుతున్నారు. కాస్తా గడుసు వారు అయితే మళ్లీ ఎన్నికల్లో వాడుకునే నినాదమా అని వెటకారం ఆడుతున్నారు. అందరికీ హోదా విషయంలో ఒక క్లారిటీ అయితే ఉంది.

ప్రత్యేక హోదా అన్నది ఒక బ్రహ్మ పదార్ధం అని. అది ఎన్నికల వేళకే వినిపిస్తుంది అని. ఆనాడు పదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ కూడా హోదా అన్నది విభజన చట్టంలో పెట్టకుండా ప్రధాని చేత నోటి మాట అనిపించి మమ అనేసిందని. ఇక తరువాత వచ్చిన బీజేపీకి అంతే చిత్తశుద్ధి ఉంది కాబట్టే అది ముగిసిన అధ్యాయం అని చెప్పి ఎవరినీ నోరెత్తకుండా చేసిందని.

అయినా ఇప్పుడు హోదా వచ్చి ఏమి చేసుకోవాలోయ్ అంటున్నారు. అప్పుల కుప్పకు అమ్మ మొగుడుగా ఏపీ తయారు అయింది. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ఇప్పటికి మరిన్ని దశాబ్దాలు గడవాల్సి ఉంటుంది. ఏదో కాలానికి ఏపీ బాగుపడుతుంది. అప్పటికి ఈ తరం చూసేందుకు ఉండదు. ఎవరో చూస్తారు. అదీ సగటు జనం అనుకునే వేదాంతం మాట.

పచ్చిగా రాష్ట్రాన్ని విడగొట్టినపుడు హోదా ఇస్తే ఈపాటికి ఫలితాలు వచ్చేవి ఇప్పుడు ఎందుకు ఎన్నికలలో ఓట్ల కోసం తప్ప అని ఒక వెర్రి నవ్వు నవ్వుతూ జనం పక్కకు తప్పుకుంటున్నారు. అయినా సరే హోదాతో ఏదో సాధించాలని తాపత్రయంతో కొందరు విశాఖలో ఒక రోజు దీక్ష అని చేపట్టారు. అక్కడకు కాంగ్రెస్ తో పాటు కొత్తగా పార్టీ పెట్టిన సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు వచ్చారు.

వీరంతా కేంద్రం హోదా ఇవ్వాలని విభజన హామీలు నెరవేర్చాలని అంటూ దీక్ష చేశారు, ప్రసంగాలు చేశారు. అయితే హోదా నినాదం మాత్రం నూతిలో మూలుగులా బలహీనంగానే వినిపిస్తోంది. 2014, 2019లలో బలంగా వినిపించిన ఈ నినాదానికి ఈ కాస్తా ఊపిరి 2024లో మిగిలింది. ఈ ఎన్నికలు దాటాక బీజేపీ నేతలు చెప్పినట్లుగా నిజంగా ఇది చాప చుట్టేసిన అధ్యాయంగా మారుతుందేమో. ఎందుకంటే అది ఎవరికీ అర్ధం కానీ ఒక బ్రహ్మా పదార్ధం కాబట్టి.