ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి బెదిరించేది ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయ్యన్న అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయనతో పెట్టుకోవడం అంటే కొరివితో తలగోక్కోవడం అని అందరూ అంటారు. అయ్యన్న మాటల దూకుడు అలా ఉంటుంది. అయిదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీకి చెందిన ఎందరో సీనియర్ నేతలను అగ్ర నేతలను అరెస్ట్ చేయగలిగింది. ఆఖరుకు చంద్రబాబుని కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టగలిగింది.
కానీ అయ్యన్నపాత్రుడిని మాత్రం ఏమీ చేయలేకపోయింది అంటేనే ఆయన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. అలాంటి అయ్యన్న తన నోటి ధాటితో ఎవరినైనా కట్టిపడేస్తారు. ఆయన మైకు అందుకోవాలే కానీ విమర్శలతో ఎక్కడా తగ్గేది ఉండదు.
ఇంతటి ఘన కీర్తిని కలిగిన అయ్యన్నపాత్రుడు తనను ఎవరో బెదిరిస్తున్నారు అని మీడియా ముందు చెబుతున్నారు. తనను చంపేస్తామని ప్రతీ రోజూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. నిజంగా ఇది నిజమా అని టీడీపీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు.
అయ్యన్నది నిన్నా మొన్నటి రాజకీయ జీవితం కాదు, ఆయనది నాలుగు దశాబ్దాల పైబడిన జీవితం. టీడీపీతోనే ఆయన రాజకీయ అవతారం ఎత్తారు. ఎన్నో సార్లు మంత్రిగా పనిచేశారు. ఏపీలో సీనియర్ లీడర్ల లిస్ట్ లో అయ్యన్న ముందుంటారు.
అటువంటి అయ్యన్నను బెదిరించడం అంటే వారు ఎవరో కానీ ఆయనను మించిన వారే అయి ఉండాలి. భయమంటే తెలియని అయ్యన్నకు భయం పెడుతున్నారు అంటే ఆ విషయాన్ని సీరియస్ గా చూడాల్సిందే. అయితే తనకు వరసగా వస్తున్న బెదిరింపు కాల్స్ తో అప్రమత్తం అయినట్లుగా అయ్యన్న చెబుతున్నారు.
తనకు గన్ లైసెన్స్ కావాలని కలెక్టర్ ని కోరాను అని ఆయన చెబుతున్నారు. తనకు ప్రాణ భయం ఉందని చెబుతూ అయ్యన్న గన్ లైసెన్స్ కి అప్లై చేశారు అన్న మాట. ఆయన మంచి ఫైటర్. ఆయనకు గన్ కావాలని కోరుతున్నారు. మాటల తూటాలను పేల్చే అయ్యన్నకు గన్ లైసెన్స్ అవసరమా అంటే ఆయన కోరుతున్నారు కాబట్టి ఇచ్చి తీరాల్సిందే.