అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులపై దాదాపు కసరత్తు కొలిక్కి వచ్చింది. నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయిలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల జాబితా వెలువడే అవకాశం వుంది.
ఇప్పటి వరకు టీడీపీ, జనసేన అభ్యర్థులపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఎవరికి వారే తామంటే తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. దీంతో కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్యే విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.
ఇదిలా వుండగా చంద్రబాబునాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇష్టానుసారం రెండు నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారనే కోపంతో జనసేనాని పవన్ కూడా రెండు నియోజక వర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తేల్చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల విషయమై వారం, పది రోజుల్లో స్పష్టత ఇచ్చేందుకు ఇరుపార్టీల ముఖ్య నేతలు కసరత్తు మొదలు పెట్టినట్టు వార్తలొస్తున్నాయి.
అయితే సీట్లు, నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు, పవన్‌లలో ఎవరు పైచేయి సాధిస్తారనే చర్చకు తెరలేచింది. జనసేనకు కనీసం 40 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాలు ఇస్తే తప్ప, ఆ పార్టీ నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ జరగదని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. 40 సీట్లు అనేవి కనిష్ట సంఖ్యగా కాపు నేతలు అంటున్నారు. సీట్ల విషయంలో ఏ మాత్రం అటూఇటూ అయినా పొత్తు వికటించే ప్రమాదం పొంచి వుందని జనసేన నేతలే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.
దీంతో జనసేనకు ఎన్ని సీట్లు? ఎక్కడెక్కడ ఇవ్వాలనే విషయమై మొదట తన పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారని తెలిసింది. అయితే జనసేన బెదిరింపులకు భయపడి, 20కి మించి అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలను కట్టబెడితే చేజేతులా అధికారాన్ని జగన్ చేతిలో పెట్టినట్టే అని చంద్రబాబును టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారని సమాచారం. దీంతో జనసేనకు సాధ్యమైనన్ని తక్కువ సీట్లు ఇవ్వడంపై చంద్రబాబు దృష్టి సారించారు.
అయితే చంద్రబాబు మోసపూరిత స్వభావం తెలిసిన కాపు ఉద్యమ నాయకులు.. కనీసం 60 సీట్లు అడిగితే, 40కి టీడీపీ దిగి వస్తుందని, లేదంటే అసలుకే ఎసరు వస్తుందని పవన్‌కు హితోపదేశం చేశారని తెలిసింది. అందుకే సీట్లు, బలమైన నియోజక వర్గాలను తీసుకునే విషయంలో బాబు మాయ మాటలకు లొంగిపోవద్దని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు జనసేన నాయకులు చెబుతున్నారు.
సొంత పార్టీలోనే అభ్యర్థుల ఎంపికపై చివరి వరకూ నాన్చివేత ధోరణిలో వ్యవహరించే చంద్రబాబు.. మిత్రపక్ష పార్టీకి ఉదారంగా సీట్లు కట్టబెడతారని అనుకోవడం అవివేకమే. అందుకే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లలో పైచేయి ఎవరు సాధిస్తారనే చర్చ జరుగుతోంది.