ఏడు కొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరుడంటే అందరికీ ఎంతో భక్తి. ఈ విషయంలో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. దేవదేవుడికి భక్తితో సమర్పించుకున్న కానుకలకు కొదవలేదు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీ సొంతం.
దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న ఆధ్యాత్మిక ట్రస్టుల్లో ఒకటిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. దేశంలో దేవదేవుడికి ఇప్పటివరకు మరో దేవుడు పోటీకి రాలేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా ఎవ్వరికీ రాలేదు. కానీ ఇప్పుడు అందరికీ ఆ ఆలోచన కలిగేలా చేశాడు శ్రీరాముడు.
అయోధ్యలో భవ్య రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. అందులో బాలక్ రామ్ సుందరంగా కొలువుదీరాడు. మొదటి రోజు నుంచి ప్రతి రోజు రామమందిరానికి లెక్కలేనన్ని కానుకలు వస్తూనే ఉన్నాయి.
కొన్నేళ్లకు దేశంలో ఖరీదైన ట్రస్ట్ గా రామమందిరం ట్రస్టు అవతరిస్తుందంటూ ఉత్తరాదిన అప్పుడే కథనాలు మొదలయ్యాయి. అవి నిజమేనా? తిరుమల గిరిపై వెలసిన దేవదేవుడి కంటే ఎక్కువ ఆస్తులు అయోధ్య రామమందిరానికి వస్తాయా?
దేవదేవుని ఆస్తులివి… ప్రస్తుతానికి ఇది అతిశయోక్తి అనుకోవచ్చు, ఊహాతీమైనది కూడా కావొచ్చు. ఎందుకంటే, టీటీడీ భారీగా ఆస్తులు కలిగి ఉంది. 2022లో టీటీడీ విడుదలచేసిన శ్వేతపత్రం ప్రకారం చూసుకుంటే, దేవదేవుని ఆస్తుల విలువ అక్షరాలా 2.5 లక్షల కోట్లు. అదింకా తక్కువని, చాలా చోట్ల ఉన్న స్థిరాస్తుల గురించి టీటీడీకి కూడా తెలియదని, ఎన్నో ఆస్తి కాగితాలు మిస్సయ్యాయని వాదించేవాళ్లు కూడా ఉన్నారు.
ఈ వాదనలు పక్కనపెడితే, ఈ ఏడాదిలో శ్రీవారి ఆస్తి విలువ 3 లక్షల కోట్లు దాటిందనేది వాస్తవం. ఎందుకంటే తిరుమలలో హుండీ వార్షిక ఆదాయమే అక్షరాలా 1400 కోట్ల రూపాయలు. వీటితో పాటు బంగారం, ఇతర స్థిరాస్తులు కలుపుకుంటే వెంకన్నసామి ఎప్పుడో 3 లక్షల కోట్ల రూపాయలు దాటేసి ఉంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి వివిధ బ్యాంకుల్లో 11,225 కేజీల బంగారు నిల్వలున్నాయి. టీటీడీ పేరిట దేశవ్యాప్తంగా 6వేల ఎకరాల అటవీ భూమి, 75 చోట్ల 7636 ఎకరాల స్థిరాస్థులు, 1226 ఎకరాల వ్యవసాయ భూమి, 6409 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉంది.
అయోధ్యకు వెల్లువలా విరాళాలు… ఈ స్థాయిలో మరో ట్రస్టుకు ఆదాయం సమకూరడం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. కాకపోతే అంత సామర్థ్యం మాత్రం అయోధ్య రామయ్యకు ఉందంటున్నారు. ఎందుకంటే, దేశం మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. దేశవ్యాప్తంగా రామభక్తులున్నారు. వీటన్నింటినీ మించి శ్రీరాముడంటే ఉత్తరాదిన కేవలం దేవుడు మాత్రమే కాదు, అతడొక ఎమోషన్.
అందుకే అయోధ్యకు ఇప్పటికే కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వ్యక్తి తన ఆస్తులన్నీ శ్రీరాముడికి ధారదత్తం చేశాడు. ఇప్పటికే వందలాది మంది తమ భూమి కాగితాలు తెచ్చి ట్రస్టుకు అప్పగించారు. మరో వ్యక్తి ఏకంగా 64 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అందించాడు. ఇలా కేజీల కొద్దీ బంగారం, వెండితో పాటు స్థిరాస్తులు పోగుపడుతున్నాయి. త్వరలోనే అయోధ్యకు సంబంధించి ముఖేష్ అంబానీ ఓ పెద్ద కార్యాచరణతో రాబోతున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి.
ఇదంతా ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో అయోధ్యకు కనెక్టివిటీ పెరిగితే దేశంలోనే నంబర్ వన్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం రేంజ్ లో కాకపోయినా, కళ్లు చెదిరే రేంజ్ లో అయోధ్య ట్రస్టు కూడా తయారుకావడం ఖాయం. ఇకపై అంతా రామ మయం.