మనకు హత్యలు తెలుసు. అనుమానంతో, కక్షతో, భయంతో, అసూయతో, అత్యాశతో చేసే అనేకానేక రకాల హత్యలు మనకు తెలుసు. పరువు హత్యలు కూడా తెలుసు. కానీ విశ్వాసపు హత్యలేమిటి? పైన చెప్పుకున్న అన్నింటికంటె కూడా విభిన్నమైన హత్యలు ఇవి. అతి భయంకరమైన హత్యలు. కేవలం ఒక అసంబద్ధమైన విషయాన్ని విశ్వసించడంలో ఉండే మూఢత యొక్క గాఢత కారణంగా సంభవించే మరణాలకు.. ఇలా ‘విశ్వాస హత్యలు’ అని పేరు పెట్టుకోవాలి.
ఎంతో చదువుకున్న వాళ్లకు కూడా అసంబద్ధమైన నమ్మకాలు కొన్ని ఉంటాయి. వాటన్నింటినీ చక్కదిద్దడం, వారినందరినీ బయటకు తీసుకురావడం అనేది ఇక్కడ మన లక్ష్యం కాదు, ఆ అవసరం కూడా లేదు. ఆ విశ్వాసాలు ఎంత మూర్ఖంగా మారుతున్నాయి.. ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.. అనేది కొద్దిగా చర్చించి.. అలాంటి వారిలో చిన్న ఆత్మసమీక్షకు కారణం కాగలిగితే చాలు.
ముందుగా నా చిన్నతనంలో చదివిన ఒక నవలలోని విషయాన్ని ప్రస్తావిస్తాను. సుమారు మూడు దశాబ్దాలకు పూర్వం ఆంధ్రభూమి వీక్లీలో ‘ది ఎడిటర్’ అనే సీరియల్ ప్రచురితమైంది. మైనంపాటి భాస్కర్ రాశారు. మూఢనమ్మకాలు, అభూత కల్పనల చుట్టూ రాసే సీరియల్స్ కు మార్కెట్ బీభత్సంగా ఉన్న రోజులు అవి. ఈ సీరియల్ కూడా అలాంటిదే. అందులో ఎడిటర్ పురమాయింపు మీద ఒక రచయిత/జర్నలిస్టు ఒక పరిశోధనకు పూనుకుంటాడు. అడవులు పట్టుకుని తిరుగుతూ వెళతాడు. ఓ పని మీద మంత్రసిద్ధి కలిగిన వ్యక్తిగా పేరున్న ఓ వృద్ధుడితో కలిసి అడవిలో కాలినడకన ప్రయాణం చేస్తూ వెళుతుంటాడు. అలవాటు లేని నడక కారణంగా అతడికి మితిమీరిన దాహం వేస్తుంటుంది.
ఇద్దరూ కలిసి వెళుతుండగా.. బాట పక్కనే ఓ సరస్సు కనిపిస్తుంది. అందులో నీళ్లు తాగితేగానీ ప్రాణం కుదుటపడదని ఆ రచయిత అనుకుంటాడు. ఈలోగా అతడికంటె రెండు బారల ముందుండి నడుస్తున్న ఆ వృద్ధుడు, అతడి మనసులోని ఆలోచన గ్రహించినట్టుగా ‘ఆ సరస్సులో నీళ్లు తాగకూడదు.. జంతువులైపోతారు’ అని హెచ్చరిస్తాడు. రచయితకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్మే మూర్ఖులున్నారా? అని అనుకుంటాడు. అంతలోనే అతడి మనసులోని మాట తెలిసిపోయినట్టుగా ఆ పెద్దాయన ‘జంతువులైపోతారు అంటే.. అచ్చంగా కొమ్ములు, తోక గట్రా వచ్చేసి రూపం మారిపోతుందని కాదు. ఆ నీళ్లు తాగిన మనుషుల్లో పశుప్రవృత్తి పెరుగుతుం’దని చెబుతాడు.
ఒక్కో ప్రాంతంలో ఆయా ప్రాంతపు నేలలో ఉండే లవణాలను బట్టి, అక్కడి నీళ్లు ఏయే కొండలు, ఏయే అడవుల మీదుగా ప్రవహిస్తూ వచ్చాయో అక్కడి భూమి తత్వం, ఆ చెట్ల తత్వం బట్టి.. ఆ నీళ్లకు కొన్ని లక్షణాలు వస్తాయనేది ఆ వృద్ధుడి మాటల్లో సారం. కొన్ని చోట్ల నదుల్లోని నీళ్లు తాగితే, స్నానం చేస్తే రోగాలు నయమవుతాయనే నమ్మకాలు అలా పుట్టినవే అంటాడు. ఆ రకంగా, వారు చూసిన అడవిలోని సరస్సు నీటివల్ల మనిషిలో పశుప్రవృత్తిని పెంచే లక్షణాలు వస్తాయని వివరిస్తాడు. కొన్ని ప్రాంతాల నీళ్లకు ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మడానికి ఈ లాజిక్ ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కలిసిన నీళ్ల వల్ల మనుషుల రూపురేఖలే దారుణంగా మారిపోవడం అనేది మనకు కళ్లెదురుగా కనిపించే సంగతి. అలా పోల్చుకుంటే నీళ్లకు కొన్ని చోట్ల మంచి గుణాలున్నా ఆశ్చర్యం లేదు.
నిరపాయకరమైనంత వరకు ఏ నమ్మకంతోనూ ఇబ్బంది లేదు. శ్రీకాళహస్తి (పాత నార్త్ ఆర్కాడు జిల్లా ప్రాంతం)లో ప్రతిఏటా ధర్మరాజుల తిరణాల జరుగుతుంది. మహాభారత కథ చెబుతారు. వీధి బాగోతం ఆడుతారు. అందులో భాగంగా ఒక రోజున, అర్జునుడు తాడి చెట్టు ఎక్కి శివుడికోసం తపస్సు చేస్తాడు. తిరణాలలో అర్జున తపస్సు గా చెప్పే ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పోటెత్తుతారు. ఈ సమయంలో.. తన జోలెలోంచి అర్జునుడు నిమ్మపండ్లు, విభూదిపండ్లు తీసి జనం మీదికి విసురుతాడు. పిల్లలు లేని మహిళలు నిమ్మపండు తింటే కూతురు పుడుతుందని, విభూది పండు తింటే కొడుకు పుడతాడని ఆ ప్రాంతంలో ఒక నమ్మకం. ‘తపసుమాను’ అనే శీర్షికతో రాసిన కథలో ఈ వైనం మొత్తం ప్రస్తావించాను నేను. ‘ఈ రోజుల్లో ఇంత మూఢనమ్మకమా’ అని హరిత అనే పాత్ర ప్రశ్నిస్తుంది. దానిని సమర్థించే పెద్దమనిషి మాత్రం.. ‘బిడ్డలు పుట్టడం బాగా ఆలస్యం అయి, నైరాశ్యంలో ఉండే ఆడదానికి, ఆత్మహత్యే మేలనుకునే పరిస్థితి నుంచి ఇలాంటి కీడు చేయని మూఢ నమ్మకం ఆశను కొంతకాలం పొడిగిస్తుంది కదా. ఈలోగా పిల్లలు కలగవచ్చు కదా..’ అనే లాజిక్ చెబుతాడు. అలా కీడు చేయనంత వరకు మంచిదే. నమ్మకాలతో మనకు ఇబ్బంది లేదు.
కానీ ఆ నమ్మకాలు ప్రాణాలను బలితీసేసుకుంటే ఎలా అర్థం చేసుకోవాలి. విశ్వాసం కారణంగా అమాయకంగానూ, మూర్ఖంగానూ చేసే పనులు ప్రాణాంతకం అయితే ఎలాగ? నమ్మకాల పుణ్యమాని తల్లిదండ్రులే ఇలాంటి హత్యలకు పాల్పడితే? బిడ్డలను చంపేస్తే మళ్లీ చిరంజీవులుగా బతికి వస్తారని భావించేవారిని, రోగం నయం కావడానికి నది నీళ్లలో ముంచి వారిని కడతేర్చే వారిని ఎలా అర్థం చేసుకోవాలి. ఇలాంటివే విశ్వాసపు హత్యలు!!
* * *
ఢిల్లీకి చెందిన ఓ కుటుంబంలో అయిదేళ్ల పసివాడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈలోగా వారి బుర్రల్లోకి ఎవరు విషం ఎక్కించారో తెలియదు. మొత్తానికి గంగానదిలో స్నానం చేయిస్తే క్యాన్సర్ తగ్గిపోతుందని ఆ కుటుంబం నమ్మింది. చికిత్స మధ్యలో ఆపు చేయించి, ఢిల్లీనుంచి ట్యాక్సీలో పసివాడిని హరిద్వార్ తీసుకువెళ్లే సమయానికే ఆరోగ్యం మరింత క్షీణించింది. గంగ ఒడ్డున మంత్రాలు పఠించి, కొన్ని పూజలు చేసి.. ఆ బాలుడిని స్వయంగా తల్లి గంగనీటిలో ముంచడం ప్రారంభించింది. పిల్లాడు భయంతో ఏడుస్తూ విలవిల్లాడాడు. అయినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఆ గంగలో అదే పనిగా ముంచడంతో పసివాడు ఊపిరాడక అసువులు బాశాడు. మూఢనమ్మకం పర్యవసానంగా ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా దీనిని పరిగణిస్తే తప్పు. దీనినే ‘విశ్వాసపు హత్య’ అని అనాలి.
ఇలాంటి మూర్ఖత్వం ఒక్క మతానికి పరిమితమైనది కాదు. కొన్ని దర్గాలలో తీర్థం కింద ఇచ్చే నీళ్లు తాగితే సకల రోగాలు నయమవుతాయని, స్వస్థత కూటముల్లో మతపెద్దలు ప్రార్థన చేస్తే రోగాలు నయం కావడమే కాదు- లేని కంటిచూపు కూడా వచ్చేస్తుందని నమ్మేవాళ్లంతా ఈ కోవకు చెందిన వాళ్లే. హైందవం, ఇస్లాం, క్రిస్టియానిటీ ఏ మతమూ అతీతమైనది కాదు. బహుశా మతాలను ప్రతిపాదించిన వాళ్లు.. అప్పటి పురాతనమైన రోజులకు తగ్గట్టుగా, తాత్కాలిక మానసిక ఉపశమనం కోసం ఇలాంటి నమ్మకాలను ప్రచారంలో పెట్టి ఉండొచ్చు. కాలక్రమంలో మతాలను పాటించే వారి విద్యాబుద్ధుల స్థాయి, విజ్ఞత, తార్కికత పెరుగుతున్న కొద్దీ అవి బలహీనపడాల్సింది బదులుగా విశృంఖలంగా మారితే ఏం అనుకోగలం?
మూడేళ్ల కిందట చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇంతకంటె ఘోరమైన ఒక ఉదంతం చోటుచేసుకుంది. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తండ్రి కాలేజీ లెక్చరర్. తల్లి ప్రెవేటు స్కూలు కరస్సాండెంట్. ఇద్దరూ గొప్ప విద్యావంతులు. వారికి ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరూ కూడా బాగా చదువుకున్న వారే. అందరితో మంచిగా మెలిగేవాళ్లే. వారికి ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎక్కువే అని అందరికీ తెలుసు గానీ, మూర్ఖత్వం శృతిమించిందని వారిని ఎరిగిన వారు గ్రహించలేకపోయారు. ఆ తల్లిదండ్రులు కలిసి తొలుత 22 ఏళ్ల చిన్న కూతురును ఇంట్లోనే శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పూజగదిలో 27 ఏళ్ల పెద్దకూతురు నోట్లో రాగిచెంబు పెట్టి తలమీద డంబెల్ తో కొట్టి చంపేశారు. కూతుళ్లిద్దరూ మరునాటికి చిరంజీవులుగా తిరిగి వస్తారనేది వారి నమ్మకం.
ఆ లెక్చరర్, కాలేజీలో సహచరుడికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారిస్తున్న సమయంలోనూ వారు పిచ్చితనం ట్రాన్స్ లోనే ఉన్నారు. పిల్లల శవాలను కదిలించవద్దు.. వాళ్లు తిరిగివస్తారు అంటూ పోలీసులతో తగాదా పెట్టుకున్నారు. ఇలాంటి విశ్వాసపు హత్యల్లో అదే పరాకాష్ట అనుకోవాలి. వారి మూర్ఖత్వాన్ని వారి విద్యాబుద్ధుల స్థాయి ఆపలేకపోయింది. ఫలానా మతం అని కాకుండా ఇలాంటి మూర్ఖత్వపు, పిచ్చితనపు ఆనవాళ్లు మనకు ప్రతిచోటా కనిపిస్తాయి.
మనది చాలా ఎక్కువ జనాభా ఉన్న దేశం. విద్య ద్వారా జ్ఞానాన్ని పెంచుకోగల అవకాశాలు అందరికీ సమానంగా లేని దేశం. విద్య, జ్ఞానం ఎంత ఎక్కువగా ఉన్నా మతపరమైన విశ్వాసాలను తార్కికదృష్టితో చూసే అలవాటు లేని వారు పుష్కలంగా విలసిల్లే దేశం. మన దేశంలో మతాలు పుట్టించిన మూఢ విశ్వాసాల అవ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టేయడం అనేది.. ఆదర్శంగా చెప్పుకోడానికి మాత్రమే బాగుంటుంది. ఆచరణలో అంత సులువు కాదు. అయితే నమ్మకాలు ముదిరిన వారిలో ఒక ఆత్మావలోకనం లాంటిది వస్తే చాలు.
‘ఆవేశంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దు, ఎలాంటి ప్రతిస్పందనా వద్దు’ అని చెబుతుంది భగవద్గీత. ‘కోపాన్ని నియంత్రించుకునే వాడిని అల్లా ప్రేమిస్తా’డని ఖురాన్ (సూరా 3:134) చెబుతుంది. ‘ఆవేశం పిచ్చితనం’ అని బైబిలు చెబుతుంది. ఆ ఆవేశం లాంటిదే.. ఈ మూర్ఖత్వం, పిచ్చితనం, విశ్వాసాల ఉన్మాదం కూడా! విశ్వాసాలను పూర్తిగా విడచిపెట్టమంటే ఎవరు ఊరుకుంటారు..? కానీ వాటిమీద అదుపు ఉండాలి. విశ్వాసం ఉచ్ఛస్థాయికి చేరినప్పుడు తీసుకునే నిర్ణయాల్లో జాగరూకత ఉండాలి. ఆ విశ్వాసాలపై నియంత్రణ ఉండాలి. అప్పుడే మానవాళి మనుగడలో నిశ్చింత చోటు చేసుకుంటుంది. ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ మళ్లీ మనల్ని కలచివేయడం తగ్గుతుంది.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె