జ‌గ‌న్ నీ ఎంపీ సీటుకో దండం…వైసీపీ ఎమ్మెల్యే!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎట్ట‌కేల‌కు వైసీపీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇవాళ ఆయ‌న కుమారుడు సుమ‌న్‌తో క‌లిసి మీడియా ముందుకొచ్చారు. చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్ది దిక్కు అయిన మంత్రి పెద్దిరెడ్డి…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎట్ట‌కేల‌కు వైసీపీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇవాళ ఆయ‌న కుమారుడు సుమ‌న్‌తో క‌లిసి మీడియా ముందుకొచ్చారు. చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్ది దిక్కు అయిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడైన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. దీంతో వైసీపీతో బంధాన్ని తెంచుకోడానికే ఆయ‌న సిద్ధ‌మ‌య్యార‌ని తేలి పోయింది.

త‌న‌ను బ‌ల‌వంతంగా తిరుప‌తి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. త‌న‌కు స‌త్య‌వేడు టికెట్ రాక‌పోవ‌డానికి మంత్రి పెద్దిరెడ్డే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించడం గ‌మ‌నార్హం. రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు మిథున్‌రెడ్డి పెత్త‌నం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు.

త‌నకు ఇష్టం లేక‌పోయినా తిరుప‌తి ఎంపీ స్థానం ఇన్‌చార్జ్‌గా ప్ర‌క‌టించార‌ని ఆయ‌న ఆరోపించారు. స‌త్య‌వేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. అక్ర‌మాల‌న్నింటిని త‌న‌పై నెట్టేసి, నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న‌ను త‌ప్పించార‌ని ఆయ‌న ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు. 1989లో మోటార్ సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడెంత‌? అని ఆయ‌న నిల‌దీశారు. మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి ఆస్తుల సంగ‌తి చెబుతార‌ని ఆయ‌న అన్నారు.

మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర‌స్థాయిలో ఆదిమూలం విరుచుకుప‌డిన నేప‌థ్యంలో ఆయ‌న తిరుప‌తి ఎంపీ సీటు వ‌ద్ద‌నుకున్న‌ట్టే. అన్నింటికి సిద్ధ‌మ‌య్యే ఆదిమూలం మీడియా ముందుకొచ్చి మ‌రీ పెద్దిరెడ్డిపై, ఆయ‌న త‌న‌యుడిపై ఆరోప‌ణ‌లు గుప్పించార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసినా, ఆదిమూలం మాత్రం తిర‌స్క‌రించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. తిరుప‌తి ఎంపీ బరిలో పోటీకి కొత్త అభ్య‌ర్థి కోసం వైసీపీ వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి.