సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను మార్చడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనంతటికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. తన చుట్టూ ఎలాంటి మార్పులు చేయకుండా, తన నియోజకవర్గంలో వారి పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు.
వైసీపీలో తనకు భవిష్యత్ లేదని, ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు సిద్ధం కావడంతోనే కోనేటి ఆదిమూలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడిపై విమర్శలు చేయడానికి సాహసించారు. నిజానికి పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో పెత్తనం చెలాయించడంపై ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వుంది. అయితే సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి సన్నిహితులు కావడంతో ఏ ఒక్కరూ నోరు మెదపడానికి సాహసించరు.
వైసీపీలో వుండకూడదని ఒక్కసారి ఎవరైనా నిర్ణయించుకుంటే, ఎవరైనా మొదట ఆరోపించేది మంత్రి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలపైనే అని చెప్పక తప్పదు. తండ్రీతనయుల పెత్తనం శ్రుతి మించిందనే అభిప్రాయం వైసీపీలో బలంగా వుంది. కోనేటి ఆదిమూలం ప్రశ్నించినట్టు చంద్రగిరి, తిరుపతి, నగరి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి జోక్యం చేసుకోగలరా? ఆయా నియోజక వర్గాలకు సంబంధించి సమావేశాలను పెద్దిరెడ్డి తనకిష్టమైన చోట నిర్వహించగలరా? అనే ప్రశ్న చాలా మంది రిజర్వ్‌డ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో వుంది.
వైసీపీ ప్రజాప్రతినిధులు తమ అంతర్గత సమావేశాల్లో రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిల పెత్తనంపై విమర్శలు చేస్తున్నారు. ఈ తండ్రీతనయులు తమ చెప్పు చేతల్లో లేని నాయకులను టార్గెట్ చేయడానికి ఏదో ఒక సాకు చెప్పి, జగన్ వద్ద పంతం నెగ్గించుకుంటున్నారనే చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగుతోంది.
ఉదాహరణకు మదనపల్లె సిటింగ్ ఎమ్మెల్యే నవాజ్‌బాషాను కాదని నిషార్ అహ్మద్‌కు టికెట్ ఇచ్చారు. తనకు టికెట్ దక్కకపోవడానికి మంత్రి పెద్దిరెడ్డే కారణమని నవాజ్ ఆరోపించడం గమనార్హం. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కూడా అదే ఆరోపణ చేశారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా తన సన్నిహితుల వద్ద మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జీడీనెల్లూరును కాదని, తనకు చిత్తూరు ఎంపీ స్థానానికి పెద్దిరెడ్డే కుట్ర చేసి పంపారనేది ఆయన ఆరోపణ.
పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న చోట సొంత పార్టీలోనే వర్గాలను పెంచి పోషిస్తారనే ఆరోపణ వుంది. వీళ్లున్న చోటే వైసీపీలో కుమ్ములాటలు ఎక్కువగా వుంటున్నాయని ఉదాహరణకు అనంతపురం, అలాగే ఉభయగోదావరి జిల్లాల్లోని పరిస్థితులను వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలను మార్చడం వెనుక మిథున్‌రెడ్డి కుట్ర ఉన్నట్టు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అంతెందుకు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వుందని, సిటింగ్‌లు లేదా వారి వారసులకు టికెట్లు ఇవ్వకూడదనే కుట్ర జరిగిందనే ప్రచారం వుంది. నగరిలో పెద్దిరెడ్డి రోజా వ్యతిరేక వర్గాన్ని బాగా ప్రోత్సహించారనే విమర్శ వుంది. రోజాకు వ్యతిరేకంగా పని చేసే వైసీపీ నాయకులకు భారీగా ఆర్థిక లబ్ధి కలిగించేందుకు మైన్స్, ఇతరత్రా పనుల్ని మంత్రి మంజూరు చేయించారని ఆమె వర్గీయుల ఆరోపణ. అంతెందుకు ఆమె నియోజకవర్గానికి సంబంధించి, రోజాకు గిట్టని నాయకులకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్, అలాగే ఈడిగ కార్పొరేషన్ చైర్మన్, ఇతరత్రా పదవులు ఎవరి వల్ల వచ్చాయో తెలుసుకుంటే, పెద్దిరెడ్డోళ్ల పెత్తనం ఏ స్థాయిలో వుందో అర్థమవుతుందని చెబుతున్నారు.
తన సొంత నియోజకవర్గం పుంగనూరుకు చెందిన ఏ ఒక్క నాయకుడికి నామినేటెడ్ పదవులు ఇప్పించిన దాఖలాలు లేవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల పరిశీలకులుగా మాత్రం తన వాళ్లనే నియమించి, పెత్తనం చేస్తున్నారనే ఆరోపణ లేకపోలేదు.
ఇదే సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలలో మంచి లక్షణాల గురించి మాట్లాడుకోవాలి. తమను నమ్ముకున్న వారి కోసం ఎందాకైనా నిలబడడానికి తండ్రీతనయులు సిద్ధంగా ఉంటారనే పేరు వుంది. తమను నమ్ముకున్నోళ్లను జీవితంలో ఆర్థికంగా స్థిరపరచడానికి ఏదో రకంగా పనులు చేస్తారనే పేరు వుంది. అందుకే పెద్దిరెడ్డి కుటుంబం కోసం అధికారులైనా, రాజకీయ నాయకులైనా గుడ్డిగా పని చేస్తారనే ప్రచారం వుంది.
తమను నమ్ముకున్నోళ్లను రాజకీయంగా అందలం ఎక్కించడానికి రామచంద్రారెడ్డి చొరవ చూపుతారని, తండ్రి వారసత్వాన్ని తనయుడైన మిథున్‌రెడ్డి కొనసాగిస్తున్నారని వారి వర్గీయులు చెబుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమే అని, వైసీపీకి అన్ని విధాలా మూలస్తంభంగా నిలిచే తమ పెద్దాయన పెద్దిరెడ్డి, అలాగే ఆయన తనయుడిపై విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పెద్దిరెడ్డి అనుచరులు అంటున్నారు.
పీ.ఝాన్సీ