వైసీపీకి ఉత్తరాంధ్రా సెంటిమెంట్ 2019 ఎన్నికల్లో బాగా కలసి వచ్చింది జగన్ తన సుదీర్ఘ పాదయాత్రను 2019 జనవరి 9న ఇచ్చాపురం వద్ద ముగించారు. ఆ రోజున అక్కడ భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఇక అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయ్యాక జగన్ మరోసారి ఉత్తరాంధ్రా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆయన విశాఖ జిల్లా నర్శీపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. ఆ ఎన్నికల్లో ఏపీలో మొత్తం 151 సీట్లతో పాటు ఉత్తరాంధ్రాలోనూ 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లను వైసీపీ గెలుచుకుంది.
దాంతో ఈసారి సైతం అదే సెంటిమెంట్ ని వైసీపీ నమ్ముకుంది అని అంటున్నారు. జగన్ 2024 ఎన్నికల శంఖారావాన్ని విశాఖ జిల్లా భీమునిపట్నంతో మొదలెట్టారు. సిద్ధం పేరుతో ఎన్నికల యుద్ధానికి తాము రెడీ అన్న సంకేతాలను విపక్షాలను బలంగా పంపించారు.
భీమునిపట్నంలో జరిగిన సిద్ధం సభ అంతా జన సందోహంతో నిండిపోయింది. అటు నీలి సంద్రం ఇటు జన సంద్రం అన్నట్లుగా పోటీ పడుతూ కనిపించింది. జగన్ స్పీచ్ లోనూ హుషార్ వచ్చింది. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడుగడుగునా కార్యకర్తలు ఈలలతో గోల చేస్తూ ఉత్సాహం ప్రదర్శించారు.
వైసీపీ ఏమి చేసింది అయిదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటి అన్నది జగన్ సోదాహరణంగా ఈ సభ ద్వారా కార్యకర్తలకు ప్రజలకు ప్రతిపక్షాలకు తెలియచేశారు. అయిదేళ్ల తమ పాలనను చూసి జనాలు ఓటేస్తారు అని ఆయన చెప్పారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనతో వైసీపీ అయిదేళ్ళ పాలనే పోటీ అని ఆయన ప్రకటించారు.
ఈ రెండు పాలనను సరిచూసుకుని జనాలు 2024 ఎన్నికల్లో ఓటేస్తారు అని సీఎం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరు వందల యాభైకి పైగా ఎన్నికల హామీలను 2014 ఎన్నికల్లో ఇచ్చి ఏ ఒక్క హామీని తీర్చని తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని జనాలు నమ్మరంటే నమ్మరు అని జగన్ ఢంకా భజాయించి మరీ చెప్పారు.
గత అయిదేళ్లలో పేదల బ్యాంకులలో పెరిగిన బ్యాలెన్స్ సాక్షిగా వైసీపీకి మరోసారి విజయాన్ని అందిస్తారని ఆయన అంటున్నారు. ప్రజలకు కళ్ల ముందు అంతా ఉంది. వైసీపీ చేసినది ఏమిటి అన్నది ఎదురుగా కనిపిస్తోంది, అదే చంద్రబాబు తాము ఏమి చేశామన్నది చెప్పలేని స్థితిలో ఉన్నారని జగన్ ఎద్దేవా చేస్తున్నారు.
ప్రతిపక్షం కొత్త హామీలతో ముందుకు వస్తోంది తప్ప 2014 నాటి హామీలను ప్రస్తావించడం లేదని జగన్ చురకలు అంటించారు. తాము చేసిన మేలు చెప్పుకోవడానికి లేకనే ఈ విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని ఆయన విమర్శించారు. ప్రజలంతా ఆలోచించుకుని సరైన తీర్పు ఇస్తరని అది వైసీపీకి అనుకూలంగా ఉంటుందని జగన్ చెప్పారు.
ఇప్పటిదాకా కురుక్షేత్ర సమరం అంటున్న జగన్ అందులో తాము పాండవులు ప్రజలు శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తారని, విపక్ష కౌరవ సేన మీద విజయం వైసీపీదే అని జగన్ మహా భారత గాంధను అన్వయించి చెప్పారు. తనది పాండవులలో మధ్యముడు అయిన గర్జించే అర్జునుడి పాత్ర అని ఆయన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సమర శంఖారావాన్ని జగన్ పూరించడం విశేషం.