తెలంగాణలో తన పార్టీని బరిలో నిలిపి, విజయమో, వీరస్వర్గమో అన్నట్టుగా తలపడి .. ఆ తర్వాత తన ఏపీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉంటే నిస్సందేహంగా షర్మిల ఒక రాజకీయ నేత అనిపించుకునేదే! అయితే తెలంగాణ ఆటలో మధ్యలో ఆగిపోయి, ఆటలో అరటిపండుగా మిగిలిపోవడం షర్మిల తన రాజకీయానికి తనే పెట్టుకున్న చెక్! తెలంగాణలో తన సొంత పార్టీని పెట్టిన తర్వాత ఆమె కాంగ్రెస్ ను తిట్టినట్టుగా మరే పార్టీనీ తిట్టలేదు! కాంగ్రెస్ నే తిట్టలేదు, కాంగ్రెస్ నేతలను తిట్టింది, కాంగ్రెస్ లోకి ఇది వరకటి విలీనాలను ఎత్తుకుని మరీ అందరినీ విమర్శించింది! కట్ చేస్తే.. అదే పార్టీలోకి తన పార్టీని విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ నేతగా ఇప్పుడు ఏపీలో రాజకీయం చేస్తున్నారు!
ఇక తను తెలంగాణ కోడలన్ని, తనది తెలంగాణ అంటూ ఇన్నాళ్లూ ఆమె అక్కడ చెప్పిన ఆమె ఇప్పుడు ఉన్న ఫలంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలయ్యారు! మరి తెలంగాణ కోడలు ఏపీ రాజకీయంలో ఏంపని? పెళ్లి తర్వాత పుట్టినింటితో కన్నా, మెట్టినింటితోనే పయనం అన్నట్టుగా ఆమె థియరీ చెప్పారు! ఆడపిల్ల, ఈడపిల్ల అంటూ ఆమె ట్రోల్ అయ్యారు. మరి అప్పటికీ ఇప్పటికీ తేడా కేవలం ట్రోల్ కావడమే తప్ప మరేం లేదు! ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా.. గతంలో మాట్లాడినదానికి విరుద్ధంగానే ఉంటుంది. దీంతో షర్మిల పొలిటికల్ ట్రోలర్స్ కు మెటీరియల్ ఇవ్వడమే తప్ప సాధించేది అయితే శూన్యంగానే కనిపిస్తూ ఉంది.
మీడియా మైకు కనపడగానే.. షర్మిల ఏదేదో మాట్లాడుతున్నారు! ఇదంతా పెద్ద ప్రహసనంగా మారుతోంది. మరో రెండు నెలల పాటు షర్మిల ఇలాంటి హడావుడి చేయవచ్చు. ఆ తర్వాత ఏమిటి? అంటే.. బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా షర్మిల రాజకీయం ఉండబోతోందనే విషయం చిన్నపిల్లాడికి కూడా అర్థమయ్యేలా సాగుతోంది ఆమె పయనం!
ఏపీ ఎన్నికలు అయిపోతే.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను ఉద్ధరించేది ఏమీ ఉండదు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యేలా కూడా కనిపించడం లేదు, రామమందిరం వ్యవహారం లో బీజేపీ హడావుడి చూశాకా.. ఉత్తరాదిన ఆ పార్టీ సునామీ వచ్చేలా ఉంది! గత ఎన్నికల్లో యూపీ, బిహార్ లలో ఎస్పీ, కాంగ్రెస్, ఆర్జేడీ ఇచ్చిన కనీస పోటీని అయినా ఈ సారి ఇవ్వగలవా? అనే సందేహం రేగుతోంది.
రామమందిర నిర్మాణం పూర్తి కాకపోయినా.. ఎన్నికల ముందు కమలం పార్టీ దాన్ని గట్టిగానే వాడేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన ఆ పార్టీ స్వీప్ చేసిందంటే.. కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయాంగానే తయారుకావొచ్చు! మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కోలుకుంటే తప్ప ఏపీ వంటి చోట నాయకులను ఆ పార్టీ ఉద్ధరించే అవకాశాలు ఉండవు! అలాంటప్పుడు షర్మిలకు దక్కేది శూన్యమే!
మరి ఇదంతా తెలియక షర్మిల ఏపీ రాజకీయంలోకి దిగి హడావుడి చేస్తోందా అంటే.. తెలంగాణలో ఆమె రాజకీయ పయనం చూశాకా.. అసలు ఆమెకు ఏమీ తెలియకపోవచ్చు, ఎవరో చెప్పిన మాటలను వింటూ ఆమె తను నవ్వుల పాలవుతున్నట్టుగా ఉందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆమె సమస్య ఇంట్లోనే మొదలైందని స్పష్టం అవుతోంది. మరి అది పరిష్కరించుకునే రూటును మాత్రం ఆమె భిన్నంగా చూసుకున్నట్టుగా ఉన్నారు.
మొండిపట్టుదలలకు పోయి ఏదో సాధించగలనని ఆమె తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టారు! తీరా అక్కడ ఆ మొండిపట్టుదల ఎలాంటి ప్రయోజనాన్నీ ఇవ్వలేదు! శారీరకంగా శ్రమను, ఆర్థికంగా భారాన్ని తప్ప ఆమెకు అదేమీ ఇవ్వలేదు! ఏపీలో కూడా అంతకు మించి సాధించే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ విషయం స్వానుభవపూర్వకంగా షర్మిలకు అర్థం కావడానికి కూడా మరెంతో సమయం పట్టకపోవచ్చు కూడా!
ఇప్పుడు షర్మిల ఎవరిని సంతోషపెడుతోందంటే తెలుగుదేశం వీరాభిమానులను, చంద్రబాబును! వారికి ఇలాంటి రాజకీయాలు పరమఇష్టం. షర్మిల నవ్వులపాలు కావడం, జగన్ కు ఏదైనా నష్టం చేయగలిగితే చేయడం.. ఈ రెండూ వారికి ఆనందాన్ని ఇచ్చే అంశాలే! మొత్తానికి తను ప్రహసనం పాలవుతూ కూడా.. తనను విపరీతంగా ద్వేషించే వారికి ఆనందాన్ని పంచడం షర్మిలకే సాధ్యం అవుతున్నట్టుగా ఉంది!
-హిమ