కుప్పంలో బాబు ఓడతారు.. ఈ సర్వే జగన్ ది!

టీడీపీ అధినేత ఈ రోజు దాకా మాజీ ముఖ్యమంత్రి 2024 ఎన్నికల తరువాత ఆయన మాజీ ఎమ్మెల్యే. ఇదే సత్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన సర్వే ఫలితాన్ని వినిపించారు. విశాఖపట్నం జిల్లాలోని…

టీడీపీ అధినేత ఈ రోజు దాకా మాజీ ముఖ్యమంత్రి 2024 ఎన్నికల తరువాత ఆయన మాజీ ఎమ్మెల్యే. ఇదే సత్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన సర్వే ఫలితాన్ని వినిపించారు. విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నంలో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. అటు నీలి సంద్రం ఇటు జన సంద్రం అంటూ జగన్ మొదలెట్టి టీడీపీని విపక్షాలను ఏకి పారేశారు.

చంద్రబాబుకు ఈసారి ఒక్క సీటు రాదంటే రాదు అని తేల్చేశారు. గతసారి కనీసం 23 మంది ఎమ్మెల్యేలను అయినా జనాలు ఇచ్చారు ఈసారి అది కూడా ఇవ్వరని జగన్ చెప్పుకొచ్చారు. అసలు చంద్రబాబు జనాల వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు అన్నది జగన్ పాయింట్. అయిదేళ్ళలో మేము ఫలనా చేశామని చెప్పుకునే పరిస్థితి ఒక్క వైసీపీయే ఉందని అన్నారు.

2014 ఎన్నికల వేళ 670కి పైగా ఎన్నికల హామీలు ఇచ్చి ఆనక వాటిని బుట్టదాఖలు చేసి అందరినీ మోసం చేసిన చంద్రబాబుని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు అని జగన్ లాజిక్ పాయింట్ తీశారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఆయన ఒంటరిగా రావడం లేదని దత్తపుత్రుడిని వెంట తీసుకుని వస్తున్నారు అని అన్నారు.

విపక్షాలు ఎన్ని కుత్రంత్రాలు చేసినా మరెన్ని కుట్రలు పన్నినా తాను ఎదురొడ్డి నిలుస్తాను గెలుస్తాను అని భీమిలీ సభ సాక్షిగా జగన్ గర్జించారు. వైసీపీ అంటే పాండవుల సేన అన్నారు. తాను అభిమన్యుడిని కానే కాదు పద్మవ్యూహాలను నిర్జించే అర్జునుడిని అని జగన్ చెప్పారు. తనకు తోడుగా శ్రీకృష్ణుడి పాత్రలో ప్రజలంతా ఉన్నారు అని జగన్ దృఢ విశ్వాసం ప్రకటించారు.

తాను ప్రజలకు చేసిన మేలే మళ్ళీ వైసీపీని గెలిపిస్తుందని ఆయన అన్నారు 175 సీట్లూ ఈసారి వైసీపీవే అని జగన్ అంటున్నారు. విపక్షాలలో ఉన్న ఒక్కోక్కరూ ఓటమి పాలు కావాల్సిందే 2024 ఎన్నికల్లో జరిగేది ఇదే అని ఆయన అంటున్నారు. విపక్ష కూటమికి లేనిది వైసీపీకి ఉన్నది ఆత్మ విశ్వాసం ప్రజల ఆశీస్సులు అని అన్నారు.

ప్రజలు ఎపుడూ మంచినే దీవిస్తారు అని జగన్ అన్నారు. చంద్రబాబు అయిదేళ్ళ పాలనతో పాటు అయిదేళ్ల వైసీపీ పాలనను బేరీజు వేసుకుని ఈసారి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని జగన్ అన్నారు చంద్రబాబు ఏ ఒక్క పధకాన్ని అమలు చేయలేదని తాము అధికారంలోకి వచ్చాక పేదవాడి బ్యాంక్ ఖాతాలలో నగదు ప్రవాహమే సాగిందని జగన్ గుర్తు చేశారు. ప్రతీ పల్లెతోనూ నేరుగా అనుసంధానం అయిన ప్రభుత్వం వైసీపీది అని జగన్ అన్నారు.

పాత హామీలను తుంగలోకి తొక్కి కొత్త హామీలతో 2024లో జనాల ముందుకు వస్తున్న చంద్రబాబుకి ఓటు వేసే వారుంటారా అని కార్యకర్తలను జగన్ ప్రశ్నించారు. ఏపీలో ఎవరూ టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదని ఆ సంగతి వారికీ తెలుసు అందుకే కుట్రలతోనే ఎన్నికల ముందు వస్తున్నారని అయినా జయం వైసీపీదే అన్నారు.