ఏపీ ప్రజల ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి స్కీములు ఇస్తున్న జగన్ ని మరో సారి ఎన్నుకోవడం. వద్దు అనుకుంటే చంద్రబాబుకు టీడీపీకి ఓటేయడం. ఇది క్లియర్ కట్ గా ఇచ్చే జడ్జిమెంట్. జగన్ సిద్ధం సభ నుంచి ఏపీలోని నాలుగు కోట్లకు పై చిలుకు ఉన్న ఓటర్లకు పక్కా క్లారిటీతో చెప్పేశారు.
పొరపాటున కానీ టీడీపీకి ఓటేసారో స్కీములు ఉండవు, సంక్షేమం ఊసు అంతకంటే ఉండదు అన్నది జగన్ ఇచ్చిన ప్రసంగంలోని అంతర్లీనంగా ఉన్న హెచ్చరిక లాంటి సందేశం అంటున్నారు. చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా సీఎంగా ఉన్నారు, ఒక్క సంక్షేమం అయినా ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు.
అలాంటి విపక్షం అధికారంలోకి వస్తే అన్నీ రద్దులే అని జగన్ హెచ్చరించారు. నాణ్యమైన విద్య వైద్యం కావాలన్నా ప్రజల వద్దకు పాలన రావాలన్నా వైసీపీనే మరోసారి గెలిపించాలని జగన్ పిలుపు ఇచ్చారు.
ఒక విధంగా జగన్ తారక మంత్రం లాంటి మాటలనే చెప్పారు. విపక్షానిది పెత్తందారీ ఆలోచనలు అని వారికి పేదలకు ఏమీ ఇవ్వడం ఇష్టం ఉండదని జగన్ తేల్చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఏమేమి చేసింది అన్నీ ఆయన విడమరచి చెప్పారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలలో వెళ్లడం ఎపుడైనా ఎక్కడైనా జరిగిందా అని ఆయన అంటున్నారు.
సిద్ధం సభలో వైసీపీ ఎన్నికల నినాదం సిద్ధం అయింది. విపక్షం వస్తే పధకాలు రద్దు అని వైసీపీ చేయబోతున్న ప్రచారం ప్రతిపక్షాలకు ఇబ్బందికరమే అవుతుంది. చంద్రబాబు హామీలు ఏవీ నెరవేర్చలేదని జగన్ అంటున్నారు. ప్రజలనే సరిపోల్చి చూసుకోమంటున్నారు. జనం కనుక ఈ విధంగా ఆలోచిస్తే వై నాట్ 175 అన్న వైసీపీ స్లోగన్ నిజం అయి తీరుతుందని నమ్ముతున్నారు.
అందుకే జగన్ పధకాలు అన్నీ ఏకరువు పెట్టడమే కాదు వీటి వల్ల ప్రయోజనం పొందేవారు అంతా వైసీపీనే అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. పేదవాడి జీవితం బాగుండాలి అంటే జగనే రావాలని ఆయన నినదించారు. సిద్ధం తొలి సభ విజయవంతం అయింది. నినాదం కూడా పవర్ ఫుల్ గా ఉంది. దీనికి విరుగుడు మంత్రం విపక్షం ఇపుడు చూసుకోవాల్సిందే.