తెలుగుదేశం పార్టీలో సీటు కోసం ఫైటింగ్ మొదలైపోయింది. చాలా చోట్ల తమ్ముళ్ళు బాహాటంగా ముందుకు వచ్చి తమకు నచ్చని వారికి టికెట్లు ఇవ్వవద్దు అని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావుకు టికెట్ ఇవ్వవద్దు అంటూ సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు నివాసంలో అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు.
కోండ్రుకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని తమ్ముళ్ళు అంటున్నారు. అధినాయకత్వం కోండ్రుకే టికెట్ ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. రాజాం, రేగిడి, సంతకవిటి, వంగరలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, కీలక నేతలు అంతా కోండ్రు వద్దే వద్దు అని అంటున్నారు.
రాజాం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయినా ఇక్కడ కళా వెంకటరావుకు బలం ఉంది. ఆయనకు ప్రత్యేక వర్గం ఉంది. కళా మద్దతు ఇవ్వకపోతే టీడీపీ అభ్యర్ధికి గెలుపు కష్టం. కోండ్రుతో గతంలో కళాకు మంచి సంబంధాలే ఉండేవి. ఎక్కడ చెడిందో తెలియదు కానీ ఆయన రివర్స్ అయ్యారని అంటున్నారు.
కోండ్రు విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ తరఫున 2004, 2009లలో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారు. 2019లో టీడీపీ నుంచి ఓడారు. ఈసారి కూడా తనకే టికెట్ అని ఆయన ధీమాగా ఉన్నారు. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ కూడా ఈ టికెట్ ని ఆశిస్తున్నారు.
టీడీపీ అధినాయకత్వం కోండ్రు వైపు మొగ్గు చూపుతున్న వేళ ఇపుడు పార్టీలో వ్యతిరేక వర్గం ఆయనకు టికెట్ వద్దు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో వర్గ పోరు ఉంది. ఒకనాడు టీడీపీకి కంచుకోట లాంటి చోట ఇపుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. దీన్ని సరి దిద్దకపోతే ఇబ్బందులు తప్పవని తమ్ముళ్ళు అంటున్నారు.