మూలిగే టీడీపీపై పొత్తు విచ్ఛిన్న బాంబు!

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు గాలిలో దీపంలా ఉంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రితో అస‌లే టీడీపీ మూలిగే న‌క్క మాదిరి ఆవేద‌న‌లో వుంది. అలాంటి టీడీపీపై కాపు కురువృద్ధుడు, ఆ రెండు పార్టీల పాలిట…

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు గాలిలో దీపంలా ఉంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రితో అస‌లే టీడీపీ మూలిగే న‌క్క మాదిరి ఆవేద‌న‌లో వుంది. అలాంటి టీడీపీపై కాపు కురువృద్ధుడు, ఆ రెండు పార్టీల పాలిట జోరీగ అయిన మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య మ‌రోసారి విశ్లేష‌ణ పేరుతో బాంబు పేల్చారు.

ఒక‌వేళ జ‌న‌సేన‌కు 20-25 ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే టీడీపీ ఇస్తే… ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు విఫ‌ల ప్ర‌యోగ‌మే అని ఆయ‌న తాజా విశ్లేష‌ణ‌లో హెచ్చ‌రించి, గ‌ట్టి షాక్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. కాస్త క‌ఠినంగానే ఆయ‌న నిజాలు రాశారు. చేగొండి విశ్లేష‌ణ టీడీపీ, జ‌న‌సేన అధినేత‌ల్ని భ‌య‌పెట్టేలా వుంది. అయితే ఆయ‌న రాత‌ల్లో నిజాయ‌తీ, నిజాలున్నాయ‌నే అభిప్రాయం కాపుల వైపుల నుంచి వ్య‌క్తం కావ‌డం విశేషం.

చేగొండి విశ్లేష‌ణ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్ర‌స్తావించారు. 2014, 2019ల‌లో ఏం జ‌రిగిందో ఆయ‌న వివ‌రించారు. ఇదే సంద‌ర్భంలో 2024లో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆకాంక్ష ఏంటో ఆయ‌న వెల్ల‌డించారు. చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య చెప్పిందాంట్లో మొత్తం సారాంశం ఏంటో తెలుసుకుందాం.
 
“పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు అతి స్వల్పంగా సీట్లు కేటాయిస్తారనే ప్రచారం ఆ పార్టీ కేడర్, ఆ పార్టీ అభ్యర్థులుగా గతంలో పోటీ చేసిన, చేయాలనుకుంటున్న ఆశావహుల్లో తీవ్ర నిరాశ‌నిస్పృహ‌లు మిన్నంటుతున్నాయి. జనసేకు 15 నుంచి 25 లేదా 28 సీట్లు ఇవ్వొచ్చ‌ని ప‌లు మీడియాల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. జనసేన బలాన్ని తక్కువగా చూపి తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని చూస్తే ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేకపోలేదు.

జనసేనను టీడీపీ వాడుకుని వదిలేస్తుందనే  ప్ర‌చారం క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా అంటుకుంది. జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించకుండా టీడీపీ అవమానిస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే… పవన్  మౌనం వహించినా, వారించినా జనసేన కేడ‌ర్ ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రమాదాన్ని కాదనలేం. ఇదే జరిగితే పొత్తు విఫలమై మరోసారి జగన్మోహ‌న్‌రెడ్డి  అధికారం చేబడతాడనటంలో ఎంతమాత్రం సందేహం అక్కరలేదు.  

చంద్రబాబు చర్య‌కు విరుగుడుగా పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలోని జనసేనకు పట్టుగొమ్మలైన‌ రాజోలు, రాజానగరం నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుంద‌ని ప్రకటించినా జన సైనికులకు అంత సంతృప్తిని కలుగచేయని మాట వాస్తవం. వీటి కంటే సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని పవన్  ప్రకటించి వుంటే జ‌న‌సేనాని నిబ‌ద్ధ‌త తేట‌తెల్ల‌మ‌య్యేది.

జనసేనకు 25 నుంచి 30 సీట్ల వరకు కేటాయించే పరిస్థితి వస్తే ఇంతకాలం 25 సంవత్సరాల భవిష్యత్ కోరి యువతకు పెద్ద పీట వేస్తామన్న జనసేన అధ్యక్షుడు పవన్ మాటలకు, ఆశయాలకు, సిద్ధాంతాలకు నిజంగానే అర్ధం లేకుండా పోతుంది. ఇంత తక్కువ సీట్లు కేటాయించే పరిస్థితే ఉంటే దానిని జన సైనికులు, ఆయన అభిమానులు, యువత‌ జీర్ణించుకొనే పరిస్థితి ఎంతమాత్రం ఉండదు. అయినప్పటికీ పెద్ద మనస్సుతో, రాష్ట్ర భవిష్యత్ కోసం సర్దుకుపోయి ఈ స్థాయీ సీట్లకు గాని, అధికారంలో అగౌరవమైన వాటాకు కాని పవన్ ఒప్పుకుంటే సదరు పొత్తు విఫల ప్రయోగంగా మారే ప్రమాదం లేకపోలేదు” అని చేగొండి హ‌రిరామ జోగ‌య్య గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు నాట‌కం డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తున్న త‌రుణంలో నిప్పులాంటి నిజాల్ని బ‌య‌ట పెట్టారు. 20 నుంచి 30 సీట్లు ఇచ్చినా ప్ర‌యోజనం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. అలాగే అధికారంలో వాటా విష‌యాన్ని తేల్చి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు, రాజోలు, రాజాన‌గ‌రంల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌నే ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న సంతృప్తి ప‌ర‌చ‌లేదంటూ ఆయ‌న వ్యాఖ్యానించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల కంటే మ‌రో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు చెప్పి, అక్క‌డ జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని చెప్పి వుంటే, ప‌వ‌న్ నిజాయ‌తీ తెలిసి వుండేద‌ని ఆయ‌న పేర్కొన‌డం విశేషం.

ఏది ఏమైనా కాపు కురువృద్ధుడైన చేగొండి తాజా విశ్లేష‌ణ టీడీపీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. అలాగే త‌క్కువ సీట్ల‌కు ఒప్పుకుంటే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీకి ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌ద‌ని చేగొండి చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. ఇక నిర్ణ‌యం ఆ రెండు పార్టీల అధినేత‌ల‌దే.