కమలాపురం మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డి గత రాత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరశివారెడ్డి తమ్ముని కుమారుడు జీ.ప్రవీణ్‌రెడ్డి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ నేతృత్వంలో వీరశివ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరడమే ఆలస్యం… కమలాపురం టికెట్ తనకే అంటూ ఆయన ప్రచారం మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌గా పుత్తా నరసింహారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి ఆయన 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారు. ఒకసారి కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ తరపున ఓడిపోవడం గమనార్హం. ఈ దఫా ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన సమాయత్తం అవుతున్నారు. ఇటీవల కమలాపురంలో రా..కదిలిరా సభకు చంద్రబాబునాయుడు హాజరయ్యారు.
ఈ సారి కూడా తనకే టికెట్ వస్తుందని, ఒకే ఒక్కసారి గెలిపించాలని కోరుతూ పుత్తా నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి వీరశివారెడ్డి టీడీపీలో చేరి కమలాపురం రాజకీయాల్లో ప్రవేశించారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఇకపై టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడనున్నాయి. టీడీపీ కండువా మెడలో పడ్డప్పటి నుంచి నియోజకవర్గంలో తనకు అనుకూలమైన టీడీపీ, వైసీపీ గ్రామనాయకులకు వీరశివారెడ్డి ఫోన్ చేస్తున్నారు.
టికెట్ తనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, టీడీపీలోకి రావాలని వైసీపీ నాయకులను వీరశివారెడ్డి ఆహ్వానిస్తున్నారని తెలిసింది. అలాగే టీడీపీ గ్రామ నాయకులతో మాట్లాడుతూ తనకు మద్దతు పలకాలని కోరుతున్నట్టు తెలిసింది. వీరశివారెడ్డి వ్యవహారం పుత్తా అనుచరులకి కోపం తెప్పిస్తోంది.
గెలిచినా, ఓడినా టీడీపీలోనే వుంటూ, వర్గాన్ని పుత్తా నరసింహారెడ్డి కాపాడుకున్నారని వారు చెబుతున్నారు. ఎన్నికల ముంగిట టీడీపీ కండువా వేసుకుని, టికెట్ తనకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదని పుత్తా అనుచరులు హెచ్చరించడం చర్చనీయాంశమైంది.