మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సత్యవేడు వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలకు సత్యవేడు అభ్యర్థి అయిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని పెద్దిరెడ్డి పరిచయం చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలానికి వచ్చిన మెజార్టీ కంటే ఈ దఫా మరింత ఎక్కువ రావాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కార్యకర్తలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులే సైన్యమన్నారు.
ఎన్నికల్లో ప్రచారం చేసుకోడానికి చంద్రబాబుకు ఏదీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదన్నారు. అసలు కుప్పం నుంచి ఆయన పోటీ చేయకపోవచ్చని సంచలన కామెంట్స్ చేశారు. ఒకవేళ కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేసినా, మరో నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశం వుందన్నారు.
ఎన్నికల నేపథ్యంలో వైసీపీపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందన్నారు. టీడీపీ, ఎల్లో మీడియా విష ప్రచారాన్ని వైసీపీ కేడర్ సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్‌పై షర్మిలను చంద్రబాబు ఉసిగొల్పారని తప్పు పట్టారు. తమకు షర్మిలంటే ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ, ఆమె మాత్రం చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సత్యవేడులో గురుమూర్తిని, తిరుపతి ఎంపీగా ఆదిమూలాన్ని గెలిపించాలని ఆయన కోరారు.