జనసేనాని పవన్‌కల్యాణ్ దెబ్బకు టీడీపీ గిలగిలలాడుతోంది. ఇద్దరి మధ్య ఇగో అంతకంతకూ పెరుగుతోంది. అలాగని జనసేనతో పొత్తు తెంచుకోలేని నిస్సహాయ స్థితి టీడీపీది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంపై పవన్‌కల్యాణ్ మనస్తాపం చెందారు. చంద్రబాబుపైన్నే కాదు, తనపై కూడా బాగా ఒత్తిడి వుందని వెటకరిస్తూ, రిపబ్లిక్ డే నాడు రాజోలు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.
దీంతో టీడీపీ, జనసేన మధ్య పొత్తుపై విస్తృత చర్చకు తెరలేచింది. పొత్తుపై నీలి నీడలు అలుముకున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తమ పార్టీని, అలాగే అంతకు మించి రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబును కించపరిచేలా పవన్ వ్యవహరించారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కానీ పవన్‌ను ఏమీ చేయలేని దుస్థితి.
దీంతో రాజకీయ నష్ట నివారణకు పవన్ సామాజిక వర్గానికి చెందిన బొండా ఉమామహేశ్వరరావును టీడీపీ ముందుకు తెచ్చింది. అబ్బే.. పవన్ రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంలో ఏ మాత్రం తప్పులేదని సన్నాయి నొక్కులు నొక్కారు. పవన్ ప్రకటనతో తమకు ఇబ్బందేమీ లేదని, పైపెచ్చు స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. టీడీపీ, జనసేన ప్రకటనలో అవగాహనలో భాగంగానే ఈ ప్రకటనలో జరిగాయని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ముందే మాట్లాడుకున్న ప్రకారమే సీట్లపై ప్రకటనలు చేశారని ఆయన అనడం గమనార్హం. ఈ లెక్కన జనసేనకు 20, 25 లేదా గరిష్టంగా 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారనే ప్రచారం నిజమే అనుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే సీట్లపై అవగాహన ఉందని బొండా ఉమా చెబుతున్నారు.
ఏది ఏమైనా సీట్లు, నియోజకవర్గాల కేటాయింపుపై టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదు. అలాగని పరస్పరం విభేదాలను పెంచుకుని పొత్తు విచ్ఛిన్నం చేసుకోడానికి ధైర్యం చాలడం లేదు. జనసేనతో పొత్తు వల్ల గరిష్టంగా లబ్ధి పొందాలని అనుకుంటున్న టీడీపీ, ఇలాంటి అవమానాల్ని భరించాలని అనుకుంటోంది. కానీ లోలోపల పవన్ వైఖరిపై రగిలిపోతోంది. ముందు అధికారంలోకి వస్తే, ఆ తర్వాత పవన్‌ను ఓ ఆట ఆడుకోవచ్చని టీడీపీ కసిగా వుందనేది నిజం.