విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తొందరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇది ఆయనకు వింత అనుభవం. ఆయన 2014 నుంచి పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగానే పోటీకి దిగారు. ఆ గౌరవం ఈసారి దక్కుతుందా అంటే డౌటే అంటున్నారు.
ఆయన టీడీపీలో గెలిచి వైసీపీ వైపుగా వచ్చారు. ఆయన ఒక విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యే కిందనే లెక్క. ఆయనకు స్పీకర్ కార్యాలయం నుంచి ఇటీవల నోటీసులు జారీ అయ్యాయని తెలిసింది. ఎందుకు మీ మీద అనర్హత వేటు వేయకూడదని వారం రోజుల క్రితం నోటీసులు పంపించారు. ఆ గడువు 26వ తేదీతో ముగియడంతో మరోసారి నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది.
ఈసారి స్పీకర్ ఎదుట ఈ నెల 29లోగా వచ్చి వివరణ ఇవ్వాలని అందులో కోరారు. దాంతో వాసుపల్లి సహా మిగిలిన వారికి కూడా ఇది ఇబ్బందికరమే. ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నికలకు వెళ్లే చాన్స్ అయితే వారికి లేదు. దాంతో వాసుపల్లి మాజీ ఎమ్మెల్యే కావడం ఖాయమని అంటున్నారు.
మూడు సార్లు టీడీపీ నుంచి విశాఖ దక్షిణం నియోజకవర్గంలో పోటీ చేసిన వాసుపల్లి రెండు సార్లు గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ వస్తుందా అంటే అది కూడా సందేహంగా ఉంది అని అంటున్నారు. దాంతో వాసుపల్లి సన్నిహిత నాయకులు ఇటీవల మీడియా ముందుకు వచ్చి వైసీపీ తమ నాయకుడికి టికెట్ కేటాయించాలని కోరారు.
ఆయన బీసీ నేత అని మత్య్సకార నాయకుడని, నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు అని వారు పేర్కొన్నారు. నిన్నటిదాకా ధీమాగా ఉన్న ఎమ్మెల్యే వర్గం ఇపుడు ప్రెస్ మీట్లు పెట్టడంతో సౌత్ టికెట్ విషయంలో వైసీపీ హై కమాండ్ ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు. దానికి తగినట్లుగా ఆయన వివాదాలలోకి కూరుకుపోవడం వైసీపీలో వర్గ పోరు అన్నీ కలసి ఆయన టికెట్ కి ఎసరు పెట్టేలా ఉన్నాయని అంటున్నారు.