కాదేదీ కవితకు అనర్హం అని మహా కవి శ్రీశ్రీ అన్నారు. అందువల్ల రాజకీయాల్లో చూస్తే ఏమైనా చేయవచ్చు. ఎంతైనా చేయవచ్చు. దీనికి ఆకాశమే హద్దు. విశాఖ జనాలకు ఇప్పుడు కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డిని మరపించేలా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యవహరిస్తున్నారు.
ఆయన కొత్త ఏడాది ఎన్నికల సంవత్సరంలో వరస సంబరాలకు శ్రీకారం చుట్టారు. అయిదారు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సందడి చేశారు. ఒక విధంగా జనాలతో కనెక్ట్ అయ్యేందుకు అది బాగా ఉపయోపడింది.
ఇపుడు రిపబ్లిక్ డే వేళ రెండు రోజుల ఉత్సవాలకు తెర తీశారు. వీకెండ్ కావడం సెలవులు ఉండడంతో ఎంపీ తలపెట్టిన కల్చరల్ ఈవెంట్స్ కి జనాలు బాగానే వస్తున్నారు. దాంతో స్వామి కార్యం స్వకార్యం మాదిరిగా ఆయనకు అనుకూలంగా ప్రచారం సాగుతోందని అనుచరులు సంతోషిస్తున్నారు.
విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి కొద్ది నెలల క్రితం షిఫ్ట్ చేశారు. దాంతో ఆయన అక్కడికే పరిమితం అవుతున్నారు. బీజేపీ ఎంపీ దీని మీద విమర్శలు చేస్తున్నారు. లోకల్ ఎంపీ ఎక్కడైనా కనిపించారా అందుకే నేనే ప్రజా సమస్యల మీద జనంలోకి వస్తున్నాను అని ఆయన గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు.
విశాఖ నుంచి బీజేపీ అభ్యర్ధిగా జీవీఎల్ నరసింహారావు పేరు అయితే ఖరారు అయింది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నా ఆయనకే సీటు అని అంటున్నారు. దాంతో ప్రచారాన్ని ఆయన సంబరాలతోనే మొదలెట్టేశారు. జనాలకు రప్పించడంలో ఈ విధానం బాగుందని బీజేపీ నేతలు కూడా అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటులో పోరు ఆసక్తికరంగా సాగనుంది. జీవీఎల్ తనకు ఒక చాన్స్ అని అడుగుతున్నారు. ఉత్తరాది ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎంపీ సీటు కావడం, ఆలాగే అర్బన్ ఓటర్లు కూడా గణనీయంగా ఉండడంతో మోడీ ఇమేజ్ తో పాటు తాను కూడా జనాలకు తెలిస్తే గెలుపు సులువు అవుతుందని ఎంపీ సంబరాల జాతరకు తెర తీశారు అని అంటున్నారు.