పవన్ కల్యాణ్.. రోషమూ సగమే.. పౌరుషమూ సగమే!

పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. కాదు కాదు.. రోషం వచ్చింది. పౌరుషం పొంగుకొచ్చింది. కానీ ఎంత? ఆయన పౌరుషాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది సగమే! సగం పౌరుషం మాత్రమే ఆయన ప్రదర్శించారు. పూర్తి…

పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. కాదు కాదు.. రోషం వచ్చింది. పౌరుషం పొంగుకొచ్చింది. కానీ ఎంత? ఆయన పౌరుషాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది సగమే! సగం పౌరుషం మాత్రమే ఆయన ప్రదర్శించారు. పూర్తి పౌరుషం ప్రదర్శించడానికి ఆయనకు మనసురాలేదో, ధైర్యం చాలలేదో అర్థం కావడం లేదు.

పైగా పవన్ కల్యాణ్ ఏదో సంచలనంగా కనిపించడానికి చంద్రబాబునాయుడు మీద ఒక ఆరోపణ చేసి, తమ పార్టీకి రెండు సీట్లు ప్రకటించుకున్నారు గానీ.. చంద్రబాబునాయుడు ఇంకా చాలా స్థానాల విషయంలో అభ్యర్థులను ప్రకటించేస్తూ ముందుకు సాగిపోతున్నారు. జనసేన కూడా అలాంటి పనిచేసేస్తోంది. అవేవీ ఆయనకు తోచినట్లు లేదు.

ఇంతకూ పవన్ కు రెండు సీట్లు ప్రకటించుకునేంత కోపం ఎందుకు వచ్చినట్టు? మమ్మల్ని సంప్రదించకుండా, పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబునాయుడు మండపేట, అరకు సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు గనుక.. ఆయనకు కోపం వచ్చింది. అదే సంగతి సెలవిచ్చి.. ఆర్ఆర్ఆర్ తరహాలో.. ఆర్ సెంటిమెంటు తనకు ఉన్నదని.. రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లలో తమ పార్టీ పోటీచేస్తుందని సెలవిచ్చేశారు. అయితే ఈ ప్రకటనతో ఆయన చంద్రబాబుకు సమానమైన కౌంటర్ ఇచ్చినట్టేనా?

చంద్రబాబునాయుడు మండపేట సీటుకు సిటింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును, అరకుకు దొన్ను దొరను ప్రకటించారు. మరి పవన్ కల్యాణ్ ఊర్ల పేర్లు చెప్పారు తప్ప అభ్యర్థుల పేర్లను ఎందుకు చెప్పలేకపోయారు? ఆయన వద్ద ఆ సీట్లలో కూడా అభ్యర్థులు లేరా? అనే సందేహం పలువురికి కలుగుతోంది.

బయటకు ఆయన ఎలా మాట్లాడినప్పటికీ.. చంద్రబాబునాయుడు అనుమతితోనే ఆ రెండు సీట్లను పవన్ ప్రకటించారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రెండు సీట్లలో కాపు కమ్యూనిటీ ఓటు బ్యాంకు పరంగా తమ పార్టీ తప్పకుండా గెలుస్తుందనే భావన పవన్ కు ఉన్నదని అంటున్నారు.

అయితే అభ్యర్థులను ప్రకటించకపోవడం అనేది స్ట్రాటజీగా కనిపిస్తోంది. సీట్లను ప్రకటించి వదిలేయడం వలన.. ఆయా సీట్లపై ఆశ పెంచుకునే వారి మధ్య పవన్ కల్యాణ్ వేలం పాట ప్రారంభించినట్టే అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఆ సీట్లనుంచి ఎవరు ఎక్కువ ఫండింగ్ తో ముందుకు వస్తే వారికి టికెట్ ప్రకటిస్తారని, అందుకే చంద్రబాబుకు పోటీగా ప్రకటించినట్టు రోషమైన ప్రకటన చేసినా.. అభ్యర్థుల పేర్లు లేని సగం రోషాన్ని మాత్రమే ఆయన చూపించారని జనం నవ్వుకుంటున్నారు.