అయిదువందల ఏళ్ల నాటి స్వప్నం అంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిందువుల్లో ఒక ఐక్యభావనను రెచ్చగొట్టగల రీతిలో భావోద్వేగపూరితమైన ప్రసంగం కూడా జోడించి, అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించారో లేదో.. అప్పుడే.. జాతీయ రాజకీయాల్లో గ్రహాలన్నీ ఆయనకు అనుకూలంగా మారిపోతున్నట్టున్నాయి.
మోడీని గద్దె దించడం, మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవడం ఒక్కటే లక్ష్యంగా ఏర్పడిన ఇం.డి.యా. కూటమి సమూలంగా విచ్ఛిన్నం అయిపోతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ కూటమి నుంచి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పక్కకు వెళ్లింది. పొత్తులు లాంటివి ఏమైనా ఉంటే.. ఎన్నికల తర్వాత చూసుకుందాం అని మమతా బెనర్జీ చాలా విస్పష్టంగా తేల్చిచెప్పారు.
ఇప్పుడు అసలు ఇం.డి.యా. కూటమికి ఆవిర్భావం వెనుక కీలకంగా వ్యవహరించిన బీహార్ ముఖ్యమంత్రి జెడియు నేత నితీశ్ కుమార్ కూడా కూటమినుంచి వైదొలగుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇండియా కూటమి కన్వీనర్ గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసుకున్న నాటినుంచి నితీశ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగని నితీశ్ ను ఆ హోదా తీసుకోమని అడిగినప్పుడు ఆయన తిరస్కరించారు.
నిజానికి కూటమి ఆవిర్భావానికి ముందు నుంచి కాంగ్రెస్ సారథ్యంలో, రాహుల్ ను ప్రధానిచేసే లక్ష్యంగా ఎన్డీయే వ్యతిరేక కూటమిగా దేశంలోని పార్టీలన్నీ కలిసి కట్టుగా ఏర్పడాలని నితీశ్ ప్రయత్నించారు. ఆయన అప్పట్లో కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ఉన్నారు. ఈలోగా ఏం పరిణామాలు చోటు చేసుకున్నాయో ఏమో తెలియదు గానీ.. ఇప్పుడు ఏకంగా కూటమినుంచే బయటకు వెళ్లిపోతున్నారు.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన భారత్ జోడో 2 న్యాయ్ యాత్రను ప్రారంభించారో గానీ.. అన్నీ అవాంతరాలే! మణిపూర్ లోనే నానా రచ్చ అయింది. అసోంలో అనేక వివాదాలు చెలరేగాయి. ఆయన పశ్చిమ బెంగాల్ లో అడుగుపెట్టే సమయానికి మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారు. 29 నుంచి బీహార్ లో ఆయన యాత్ర సాగనుంది. ఇప్పుడు జెడియూ నితీశ్ కూడా కూటమికి గుడ్ బై కొట్టేయబోతున్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జననాయక్ కర్పూరీ సింగ్ కు మరణానంతరం భారతరత్న ప్రకటించిన మోడీ సర్కారు నిర్ణయం కూడా నితీశ్ ను బిజెపికి దగ్గర చేస్తున్నదనే వార్తలున్నాయి. అందుకు ఆయన మోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం గమనార్హం.
ఇండియా అని నామకరణం చేసిన నాటినుంచే నితీశ్ అయిష్టంగా ఉన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లూ ఏదో కూటమిలో కొనసాగారు. తీరా ఇప్పుడు వైదొలగుతున్నారు. అదే జరిగితే.. కూటమిలో కీలకమైన ప్రధాన పార్టీలన్నీ ఒక్కొక్కటిగా జారుకుంటున్నట్గుగా కనిపిస్తోంది. ఇవన్నీ మోడీ 3.0 సర్కారుకు సానుకూల సంకేతాలే అని పలువురు భావిస్తున్నారు.