తిరుమల దేవుడితో పవన్ నీచ రాజకీయం!

మనం ఎవరినైనా పెద్దవాళ్లని కలవడానికి వెళుతున్నాం అనుకోండి.. ఉత్తి చేతులతో వెళ్లకుండా వారి కోసం మన తాహతుకు తగ్గట్టుగా ఒక చిన్న కానుక తీసుకువెళతాం. ఆ కానుక వారికి నచ్చేదిగా ఉండాలని అనుకుంటామే తప్ప..…

మనం ఎవరినైనా పెద్దవాళ్లని కలవడానికి వెళుతున్నాం అనుకోండి.. ఉత్తి చేతులతో వెళ్లకుండా వారి కోసం మన తాహతుకు తగ్గట్టుగా ఒక చిన్న కానుక తీసుకువెళతాం. ఆ కానుక వారికి నచ్చేదిగా ఉండాలని అనుకుంటామే తప్ప.. మనకు నచ్చేదిగా ఉండాలని కోరుకోం. మనం ఇష్టపడేది ఎదుటివాళ్ల మీద రుద్దాలని అనుకోం. ఇది సాధారణంగా ఎవ్వరైనా సరే అనుసరించే పద్ధతి. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం.. ఇలాంటి కానుకల విషయంలో కూడా నీచ రాజకీయానికి పాల్పడుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా బురద చల్లడం తప్ప.. తనకు వేరే జీవితాశయం ఏదీ లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్.. తిరుమల వేంకటేశ్వరస్వామి వారితో ముడిపెట్టి లేకి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా క్రిస్టియన్లతో ఒక సమావేశం నిర్వహించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం బాగా అలవాటైన పవన్.. తాను బైబిలు వాక్యాలను పాటిస్తానని, క్రీస్తు జీవితంనుంచి స్ఫూర్తిని పొందానని, తన ఇంట్లో క్రిస్ మస్ కూడా జరుపుకుంటాం అని.. ఇలా వారిని మెప్పించడానికి అనేకానేక మెరమెచ్చు మాటలు చెప్పారు. ఇదంతా ఓకే. కానీ.. జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి ఆయన క్రిస్టియన్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని బురద చల్లే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో 97 వేల మంది పాస్టర్లకు గౌరవవేతనం ఇస్తానని చెప్పి కేవలం 8500 మందికే ఇచ్చారని అది మోసమని అభివర్ణించే ప్రయత్నం చేశారు. అలాగని తమ ప్రభుత్వం వస్తే.. ఇచ్చేలా ఏర్పాటుచేస్తాం అనే హామీ మాత్రం ఇవ్వలేదు. కేవలం జగన్ మీద బురదకే ఆ పాయింటును వాడుకున్నారు. 

అదే సమయంలో.. తిరుమల దేవుడిని వివాదంలోకి లాగుతూ.. ‘జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ వద్దకు వెళ్లిన ప్రతిసారీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు మాత్రమే తీసుకువెళతారని’ పవన్ అనడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. దీనికి తోడు జగన్ క్రిస్టియానిటీని వాడుకుంటున్నారని పవన్ ఆరోపిస్తున్నారు. ఇదేం లెక్కో అర్థం కావడం లేదు.

మోదీ హిందువు కాబట్టి, జగన్ ఆయన వద్దకు వెళితే వెంకటేశ్వరస్వామి ఫోటో ఇస్తారు. అలా కాకుండా.. జగన్ క్రిస్టియన్ కాబట్టి శిలువనో, ఏసు విగ్రహాన్నో తీసుకువెళ్లి ఇవ్వాలని పవన్ కోరుకుంటున్నారా? అనేది ఇక్కడ ప్రజల ప్రశ్న. పవన్ కల్యాణ్ రేపు ఏ ప్రముఖ క్రిస్టియన్ మత పెద్దలను, క్రిస్టియానిటీ అవలంబించే ప్రముఖులను కలవడానికి వెళితే.. తాను హిందువు కాబట్టి.. వెంకటేశ్వరస్వామి ఫోటో తీసుకువెళ్లి వారికి కానుకగా ఇస్తారా? వెటకారంగా ఉండదా అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

క్రిస్టియన్లలో జగన్ పట్ల విద్వేషం రగిల్చడం లక్ష్యంగా, బురద చల్లడానికి పవన్ మతిలేకుండా మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.