ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చెల్లి షర్మిల తీవ్రంగా రగిలిపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు మించి జగన్ పతనాన్ని ఆమె కోరుకుంటున్నారు. సహజంగా అన్నదమ్ముల మధ్య పగలు, ప్రతీకారాలుంటాయి. ఆడబిడ్డలెప్పుడూ అన్న లేదా తమ్ముళ్లకు ఓటమి కలగాలని, పతనం కావాలని ఎట్టి పరిస్థితుల్లో కోరరు. కానీ షర్మిల అతీతంగా కనిపిస్తున్నారు.
అందుకే షర్మిలపై జనంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతకాలం తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేస్తుంటే, ఏపీలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఏదోలే ఆమె అగచాట్లు ఆమెవి అని సరిపెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్లో చేరడం, వెంటనే ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, అన్న జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడాన్ని జనం జాగ్రత్తగా గ్రహిస్తున్నారు. ఇదంతా అన్నపై అక్కసుతోనే షర్మిల చేస్తున్నారనే అభిప్రాయం బలపడింది.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో షర్మిలపై జనాభిప్రాయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా షర్మిల సొంత జిల్లా కడపలో ఆమెను తిట్టని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అన్న వద్దన్నా తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వెళ్లారని, ఇప్పుడు మళ్లీ ఎందుకు తిరిగొచ్చారని జనం ప్రశ్నిస్తున్నారు. వచ్చీ రాగానే జగన్ను తిట్టాల్సిన పనేంటని జనం నిలదీస్తున్నారు. పనీపాటా, పెద్దాచిన్నా లేకపోవడంతోనే షర్మిల ఇష్టానుసారం నడుచుకుంటున్నారనే చర్చ ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాలో నడుస్తోంది.
షర్మిల కంటే వివేకా కూతురు డాక్టర్ సునీతే బెటర్ అని, కనీసం తండ్రిని చంపినోళ్లకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నారని అనుకుంటున్నారు. ఏనాడూ చిన్న మాట కూడా తన అన్న జగన్ గురించి సునీత మాట్లాడలేదని అంటున్నారు. కానీ సొంత చెల్లి అయిన షర్మిల మాత్రం అతి చేష్టలు చూడలేక చస్తున్నామని జనం తిట్టి పోస్తున్నారు.
సొంత జిల్లాలో కనీసం ఏజెంట్లను కూచోపెట్టుకునేందుకు ఆమెకు మనుషులున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా బొక్క బోర్లా పడి, ఇప్పుడు ఏపీకి వచ్చారని, ఇక్కడ కూడా అదే గతి తప్పదని జనం శాపనార్థాలు పెట్టడం గమనార్హం. మరీ ముఖ్యంగా తాను రాజన్న బిడ్డనంటూ పదేపదే చెబుతూ రాజకీయంగా సొమ్ము చేసుకోవడాన్ని జనం తప్పు పడుతున్నారు.
జగన్ను షర్మిల ఎంత ఎక్కువ విమర్శిస్తే, రాజకీయంగా ఆయనకే ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. అందుకే జగన్ను ఇంకా తిట్టు తల్లి అని షర్మిలను కడప జిల్లా ప్రజానీకం కోరుకుంటోంది.