సీట్లు, అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో తమను జనసేన బ్లాక్ మెయిల్ చేస్తోందన్న భావనలో టీడీపీ వుంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఇంకా సీట్ల లెక్క తేలలేదు. ఈ సందర్భంగా ఆ రెండు పార్టీలు పోటీ చేసే స్థానాలపై మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ 112 , జనసేన 63 స్థానాల్లో పోటీ చేస్తాయంటూ విస్తృతంగా ప్రచారం అవుతోంది.
ఈ ప్రచారాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఇదంతా ఫేక్ అని ఆయన కొట్టి పారేశారు. దీని వెనుక జనసేన ఉందని టీడీపీ అనుమానిస్తోంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసినా వైసీపీకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఎలాగైనా జనసేనకు సాధ్యమైనన్ని తక్కువ సీట్లు ఇచ్చి, కేవలం మద్దతు మాత్రమే పొందగలిగితేనే తమకు లాభమని టీడీపీ ఉద్దేశం.
కానీ జనసేన ఎక్కువ అశలు పెట్టుకుంది. అందుకే కాపు ఉద్యమ నాయకులు జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎవరెవరో పోటీ చేస్తారో పేర్లతో సహా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య 60 సీట్ల గురించి పవన్‌తో చర్చించినట్టు ప్రకటించారు.
ఇప్పుడు జనసేన 63 సీట్లలో పోటీ చేస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ప్రచారాన్ని టీడీపీ ఖండిస్తోందే తప్ప, జనసేన స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? ఇందులో అబద్ధం వుంటే, జనసేన-టీడీపీ ఉమ్మడిగా ఖండించాలి కదా? ఆ పని జనసేన ఎందుకు చేయడం లేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అందుకే ఈ ప్రచారం వెనుక జనసేన వుందని టీడీపీ నేతలు అనుమానించడం.
టీడీపీ కేవలం 112 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుందనే ప్రచారంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకుంది. ఇట్లైతే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు 63 సీట్లలో పోటీ చేస్తామంటూ జనసేన నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. జనసేనలోకి రోజురోజుకూ వలసలు పెరుగుతున్నాయని, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేసేంత బలాన్ని పెంచుకుంటున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
సీట్లు, నియోజకవర్గాల పేరుతో తమను జనసేన బ్లాక్ మెయిల్ చేస్తోందని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అధికారికంగా సీట్లపై ఒక ప్రకటన వస్తే, అప్పుడు చూసుకోవచ్చనే ఆలోచనతో టీడీపీ నేతలున్నారు.