చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చందాన షర్మిల వ్యవహరిస్తున్నారని దళిత బహుజన పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. షర్మిల ఏపీలో రాజకీయ డ్రామాలు ఆపాలని రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ కోరారు. అడ్డగోలుగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ని విభజించి ఏపీని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తూ జనం ముందుకు రావడానికి షర్మిలకు సిగ్గుందా అని ఆమె ప్రశ్నించారు.
బంగారం లాంటి రాజధాని హైదరాబాద్‌ని తెలంగాణాకు అప్పగించి కట్టుబట్టలతో ఆంధ్రులను తరిమేసిన దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ అని ఆమె మండిపడ్డారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీని తన రాజకీయ స్వార్ధం కోసం విభజించి ఆంధ్రా ఎంపీలను బయటకు వెళ్లగొట్టిన సంగతి ఎవరూ మరచిపోలేదని ఆమె అన్నారు.
ఏపీని అడ్డంగా విడగొట్టిన కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన బీజేపీ ఈ రెండూ ఏపీకి ద్రోహులే అని ఆమె అన్నారు. అంతే కాదు ఏపీకి ఆగర్భ శత్రువులు అని కూడా అన్నారు. ఈ రెండు పార్టీలను ఏపీ నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టి బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు ఆమె పిలుపు ఇచ్చారు.
ఏపీ మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఆర్ధిక హామీలు కాంగ్రెస్ ఆనాడే ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు ఏపీకి తీరని ద్రోహం చేసి ఇపుడు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ జనంలోకి వస్తోందని ఆమె నిలదీశారు. వైఎస్సార్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తే కుదరదని ఆమె అన్నారు. ఏపీకి అన్ని రకాలుగా అన్యాయం చేసిన జాతీయ పార్టీలను జనాలు దూరం పెట్టాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు.