హోదా పై బాబు.. పవన్ ల మాటేమిటి?

ప్రత్యేక హొదా మీద గడచిన అయిదేళ్లు జగన్ చేసిన పోరాటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల. సబబే.. నిజమే. అయిదేళ్లలో జగన్ హోదా విషయం పట్టించుకోలేదు. 23 మంది ఎంపీలు వున్నా…

ప్రత్యేక హొదా మీద గడచిన అయిదేళ్లు జగన్ చేసిన పోరాటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల. సబబే.. నిజమే. అయిదేళ్లలో జగన్ హోదా విషయం పట్టించుకోలేదు. 23 మంది ఎంపీలు వున్నా కూడా. అందువల్ల ప్రశ్నించడంలో తప్పు లేదు.

కానీ అదే నోటితో, అంతకు ముందు అయిదేళ్లు పాలించిన చంద్రబాబు ఏం చేసారు? పాచిపోయిన లడ్లు అని ఎద్దేవా చేసిన పవన్ కళ్యాణ్ భాజపాతో పొత్తు పెట్టుకుని ఏం సాధించారు? రాబోయే అయిదేళ్లలో హోదా మీద వారిద్దరి వైఖరి ఏమిటి? అన్నది కూడా షర్మిల ప్రశ్నించాల్సి వుంది.

షర్మిల హోదా విషయంలో బాబు-పవన్‌లను ఎందుకు ప్రశ్నించాలి అనే ఎవరైనా కౌంటర్ క్వశ్చనుతో రావచ్చు. ఎందుకు ప్రశ్నించాలి అంటే, షర్మిల వేసిన ఈ ప్రశ్నల వల్ల లబ్ది పొందేది ఆ ఇద్దరే కనుక. జగన్ హోదా సాధించడంలో విఫలమయ్యారు అని షర్మిల చాటడం ద్వారా ఆమె కు కానీ ఆమె పార్టీకి కానీ ఒరిగేది ఏమీ లేదు.

ఎందుకంటే 175 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా? చేసినా మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఆంధ్ర రాజకీయం తెలిసిన వారు ఎవరైనా ఇట్టే చెబుతారు. మరి అలాంటపుడు షర్మిల చేసే ఈ యాగీ వల్ల ఎవరికి ఉపయోగం? జగన్ హోదా సాధించే ప్రయత్నం చేయలేదు అని షర్మిల టముకేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? అంటే బాబు అండ్ పవన్ టీమ్ కు అన్నదే సరైన సమాధానం.

మరి షర్మిల హోదా మీద చేస్తున్న యాగీ వల్ల పవన్-బాబు లబ్దిపొందుతారని షర్మిలకు తెలియదా? మరీ అంత అవివేకం వుందా ఆమెకు? లేదు కదా? మరి అలాంపుడు హోదా మీద తిట్టే ఉద్దేశం వుంటే ముగ్గురిని తిట్టాలి.

ఏమయ్యా బాబూ.. 2014 నుంచి 2019 వరకు భాజపాతో అంటకాగి ఏం సాధించావు అని నిలదీయాలి కదా? ఏమయ్యా పవనూ.. పాచిపోయిన లడ్లు అని అన్నావు.. అదే భాజపాతో వెళ్తున్నావు. మరి ఇప్పుడు మీ భవిష్యత్ కార్యక్రమంలో హోదా అన్న అంశం వుందా? లేదా? వుంటే ఎలా వుండబోతోంది? అన్నది అడగాలి కదా?

అప్పుడు షర్మిల గారి మాటల్లో చిత్తశుద్ది వుందని జనం నమ్ముతారు. అలా కాదు అంటే ఒక్కో అంశం ప్రాతిపదికగా జగన్ ను నిలదీసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, చంద్రబాబు-పవన్ లకు మేలు చేయడం కోసం చేసే ప్రయత్నంగా చూస్తారు తప్ప వేరు కాదు.